Wednesday, September 19, 2012

నేను నా ప్రపంచం..

నా ప్రాణం ఉన్న 
ప్రపంచం కదా ఇది!
అందుకే నాకీ ప్రపంచమంటే 
అంత ప్రాణం!
నేను ప్రపంచాన్ని ప్రేమించాను 
నా పై కప్పిన నవ్వుల శాలువాలతో 
అన్ని రంగుల్ని గుర్తించి మరీ 
తొలి సిగ్గుల స్పందనతో 
నేను ప్రపంచాన్ని ప్రేమించాను 

ఒకరోజు మనసు విప్పి 
చెప్పాను కదా!
ప్రపంచం తానెప్పుడో 
నన్ను ప్రేమించానంది
పైగా 
తనది ప్రాచీన ప్రేమ అంది.

అమ్మాయిగా 
నా బాల్యాన్ని
అమ్మగా 
నా భాద్యతను ప్రేమించిందట !
ప్రపంచం 
నా కళ్ళల్లో కొలను అయింది 
నేను ఆ కొలనులో 
కలువ గా  మారాను 
ఎవరిని ఎవరు అల్లుకుపోయారో కాని 
నాపై ప్రపంచ ప్రభావం 
ప్రపంచంపై నా ప్రభావం పడిపోయింది!

అలిగిన ప్రతిసారి నాలో ఒక 
ప్రపంచం కనబడుతుంది 
మరింతగా ప్రేమించిన ప్రతిసారి 
 ప్రపంచమంతా నేనై కనిపిస్తాను!
అందరూ అంటారు 
ప్రపంచానికి ప్రేమ తెలియదని..
నిజమే 
ప్రేమే ఒక ప్రపంచమయితే 
ఇక ప్రత్యేకంగా ప్రేమ గురించి 
తెలియడమెందుకు? అనిపిస్తుంది!
అల్లంత దురాన ఉన్నా 
అజ్ఞాతంలో ఉన్నా సరే నేను 
నా ఆలోచనలన్నీ ప్రపంచం మీదే ఉంచాను!

ప్రపంచం పసిపిల్ల లాంటిది 
దరికి చేర్చుకుంటే  ఒదిగిపోతుంది 
తరిమి కొడితే అందకుండా 
అందకుండా పారిపోతుంది 
ప్రాణాన్ని ప్రాణంలా చూపే 
ఈ ప్రపంచం ఒక వస్తువు కాదు 
దాచుకోవడానికి..
అలాగని ద్రవ పదార్ధం కాదు 
ఒలికిపోవడానికి..
ప్రపంచం ఒక గ్రంధం!
అందులో ప్రతి ఒక్కరు ఒక్క 'గీతా' సారాంశం!
 

No comments:

Post a Comment