Monday, August 18, 2014

నేస్తం ఎలా ఉన్నావు ?

నేస్తం ఎలా ఉన్నావు ?
నా పలకరింపు నీకు కనిపిస్తోందా  ?
నా పద్యం నీకు వినిపిస్తుందా ?
ఏదీ ఒక్కసారి సమాధానమివ్వు !

నీకు గుర్తుందో లేదో 
నా గుండె తీరం పై 
నీ జ్ఞాపకాల అలలు ఇంకా ఉన్నాయి 
నా జీవిత తెరచాపపై 
నీ ఆనవాళ్ళు అలానే ఉన్నాయి 

ఒకప్పుడు నా గీతమై నిలుచున్నప్పుడు 
నేను అలాపనై నీకు వినిపించేదాన్ని 
సూర్యుని కంటే ముందు లేచిన నన్ను 
చందమామ తో పోల్చి నీలాకాశం పై నిలిపే వాడివి !

హృదయేశ్వరి నువ్వని అంటున్నప్పుడు 
నా మాటల ముఖమల్ దుప్పటి కప్పెదాన్ని 
తలలు వాల్చని అనుభూతిని నేను అందించినప్పుడు 
నీ పలువరసతో చిత్ర లేఖనం చేసేవాడివి 

పచ్చిక , పిచ్చుక రెంటినీ చూస్తూ మురిసిపోయిన రోజుల్లో 
ఇసక తప్ప మరొకటి లేదని ఏడిపించే వాడివి 
నీ కళ్ళలోకి చూస్తూ సిగ్గుపడినప్పుడు 
నీ ప్రేమ వైశాల్యాన్ని చూపి ఆశ్చర్య పోయేలా చేసేవాడివి !

నీకోసం కన్నీరు పెట్టె సమయం లో 
ఇక్కడ నీరే లేదు కన్నేరైనా దాచుకో అంటూ నవ్వించే వాడివి 
నువ్వు నేను పక్క పక్కగా నడుస్తూనే  
ఎన్నో కళ్ళకు ప్రశ్నల సంకెళ్ళు వేసే వాడివి 

ఏది ఒక్కసారి సమాధానం ఇవ్వు 
ఎలా ఉన్నవో తెలుసుకోవడానికి 
నీ చేయి అందివ్వు 
నువ్వు నన్ను మర్చిపోలేదని తెలుసుకోవడానికి ... 

( వదిలి వచ్చిన మా ఊరిని చాల రోజుల తర్వాత చూసినప్పుడు )