Tuesday, March 26, 2013

నిలదీసే ప్రశ్నలు 

నిలదీసే ప్రశ్నలన్నీ మరచిపోయి 
ఖాళీ అయిన గుండెతో  స్త్రీ  శరీరం నడుస్తోంది 
అంతరిస్తున్న జన్మ, తేలికైన బతుకు బరువు 
వెలివేస్తున్న  సమాజాన్ని ఇంకా వీడటం లేదు 
స్త్రీ పురుషుల ఒప్పందాల మధ్య 
బంధం  కూలిపోయినప్పుడు 
జరిగే ఆఖరిరోజు తతంగం ఆర్పబడి 
మిగిలేదే ఒక తల్లి ఒడి 

ఆరేళ్ళ చిత్రపటాన్ని అనుకుని
అరవై ఏళ్ల విచిత్ర వైఖరిని అనుసరిస్తూ 
ఆకాశానికి ఎంత కావలి కాసినా సరే 
అనునిత్యం ఒక నక్షత్రం రాలిపోతోంది  . 
నకక్షతాలు పదునుబారి ఉన్నా  రక్తసిక్తమవుతోంది . 
స్త్రీ జననం ఒక జ్ఞాపకాల దుస్తుల హారం 
మానసిక భ్రాంతిలో వెలుగుతున్న అర్థ ఉంగరం 

స్త్రీ జీవన గమనం మైళ్ళ తరబడి 
తూర్పు పడమరల ఒంపులుగా  బారులు  తీరినా  
ఆశ్రయించిన ఆనవాళ్ళైతే నిలుచున్నాయి కాని 
భాద్యతల బరువుకు మాత్రం ఎప్పుడో 
నేలబారుగా ఒంగిపోయాయి. 
శాసనాలకై  తవ్విన శిధిలాలపై నిలబెట్టి 
కొద్దో గొప్పో ఉగిసలాడుతున్న  
పైకప్పులు కాస్త కన్నీటికి కూలిపోతున్నాయి .  

ఇప్పుడు వినబడుతున్నదల్లా  రక్షణకై నినాదాలు 
చేతి కర్రలకున్న ఇనప మేకుల మొనలోంచి  కనిపించేదంతా 
నిర్లజ్జపు నిశ్శబ్దం అంకురించిన ఆవేశపు శకలాలు  అంతే !
ఏమి చేయలేని నిస్సహాయపు ఊపిరిలు 
సమాజపు శ్వాసకు  తక్కువైందేమో కానీ 
బతకడానికి సూదిమొనంత అవకాశం ఉన్నా సరే 
చేతివేళ్ళ మధ్య ఉన్న బెజ్జంలోకి దూరి  
ప్రపంచం  గురించే ఆలోచించే వారం ! 
చేతులు లేని నింగీ నేలను సైతం గుప్పెట బంధించే వారం! 

4 comments: