Monday, December 30, 2013

భావ చిత్రం 

కొత్త నెల 
సరికొత్త సంవత్సరం 
కొత్త నవ్వు 
సరికొత్త దు:ఖం 
కొత్త చలి 
సరికొత్త వేసవి 

పాత మనసు 
మార్పు లేని 
మార్చుకోలేని 
అదే మనిషి తీరు !

బంధాలను కాదని 
ద్వార బంధాలను ముసేస్తున్న 
నూతనత్వపు తేరు !

ముఖాలను దాటి 
ముఖ స్తుతులను అనుసరిస్తున్న 
అంతస్తుల హోరు !

సునితత్వపు  నూనె లేక తుప్పు పట్టి 
కిర్రు కిర్రు మంటున్న హృదయ కవాటాలు !

'మనం ' పదం వినబడక ... 
సమూహం లో ఒంటరై 
ఆనందంగా ఆహ్వానించలేని ఇంటి వాకిళ్ళు !

సఖ్యత మరచిన మనసు లోగిళ్ళు తేలికై 
నేలకొరుగుతున్న నిలువెత్తు కుటుంబ వృక్షాలు !

భావ సంపదను  మరచిన అక్షరాలు 
కనిపించని ఆకుపచ్చని కవికోసం ఎదురుచూస్తూ 
కాలాన్ని బంధించి  కలాలకు సవాలు విసురుతున్న వైనాలు !

మార్పు రాని నూతనత్వం 
నేలపై పడిన నూనె లాంటిది !
ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా 
జారిపడటానికే  అవకాశం ఎక్కువ !
అది సంస్కృతీ సాంప్రదాయాలకే  పెద్ద సవాలు !

Sunday, October 13, 2013

నిన్ను చూసేందుకే .... 

నిన్ను చూసేందుకే 
నేను ఒంటరినయ్యాను 
నిన్ను పలకరించేందుకే 
నేను మాటలు రానిదాన్నయ్యాను 
నీతో సహచార్యానికే 
నా దినచర్యను మరచిపోయాను 
నిన్ను పూర్తిగా నమ్మినందుకే 
నేను కన్నీళ్లను విస్మరించాను 
నువ్వు స్మరించినందుకే 
నా పేరును అపురూపంగా చూసుకుంటున్నాను 
నువ్వు దగ్గర లేకున్నా 
నీ నీడలా నిలుచున్నాను 
నువ్వు దూరమైతే 
నీ పాదాల చప్పుడును నా గుండె సవ్వడిగా  మార్చుకున్నాను 
ఉలి తాకితే శిల అయినా శిల్పంగా మారుతుంది 
ప్రేమ స్పర్శ తాకిన ప్రతి గుండె గ్రంధంగా మారుతుంది 
మహా కవనాలు సందర్శించిన మగువ కన్నులు 
మహా కావ్యాలుగా మారుతాయి 
వాస్తవం లో విలువల ప్రతిరూపం 
నువ్వు నన్నొదిలి వెళుతున్న దృశ్యం 
జీవితంలో విషాదంలో విషాదం 
నిన్ను విడిచి నేను దూరమయ్యే సన్నివేశం !

Thursday, October 10, 2013

కాలంశ లిప్తలు 

కవితాంశానికి , కాలాంశానికి మధ్య జరిగే సంఘర్షణ 
స్థానభ్రంశానికి , స్థల ప్రభావానికి మధ్య కలిగే ఆకర్షణ 
మరుగున పడ్డ మనోభావాలు పంచుకుంటూ 
కదలిక మరచిన హృదయాంశలు మ్రాన్పడి పోతూ 

నులివెచ్చని ఉత్సాహంతో ఎగసిపడి పడి సృష్టిని వెదుకుతోంది 
మమతల మండుటెండల్లో నివసించే మనుషులెక్కడ ?
ప్రేమే ఎరుగని ఎడారి అంచులలో నివసించే మనసులెక్కడ ?
సంబంధ విభేదాలతో గడిచే శక్తి యుక్తుల సంచలనం ఇది 
అంతరాంతర భూమికల్లో కనిపించని బొమికల మానవహారం ఇది. 

సుదీర్ఘ శ్రవణానికి , సంగీత రసధుని గతికీ జరిగే సంవేదన 
ఆనంద విహారానికి , ఆశల ఆత్మతేజానికి మధ్య జరిగే విలంబన 
ఆలోచనలను కమ్ముకున్న మబ్బుల మౌనశంఖం ఊదుకుంటూ 
ఆగని ప్రయాణంలో సరికొత్త అనుభవాల గొడుగును సరిచేసుకుంటూ 

సవిత్రు రూపాల నడుమ శరీర పరిమాణం దాగి ఉంది 
జ్ఞాపక సువర్ణ పుష్పం రెక్కలు తడిపే సోపానం అవుతుంది 
నేను లేని , నాది కాని అమృత లోకం ఎక్కడ ?
అణువణువునా సాగే లిప్తపాటు సంక్షిప్త నవాకృతులెక్కడ?
సమయపు సంకెళ్ళలో పశువు , పక్షి ఉనికే లేని ఉన్మాద స్థితి ఇది !
సమీకరణాకృతి ఆలంబనలో ఏర్పడ్డ ఏకోన్ముఖుని  అంతర్లీన సందిగ్ధ స్థితి ఇది!

ఆగు నేస్తమా ! ఆగు ఇది మాయ కానే కాదు 
మర్మంతో మృగమైన మనిషి తీరు కాదు 
తమో రాశిని కరిగించే అనుజ్వలిత ఓంకారపు ఆవిర్భూతమిది కాదు!
సూర్యుని కిరణ వాకిళ్ళలో ఇపుడు తెలియని మనో రూపం దాగుంది 

ఏకాంత  నిద్ర గుహ నుండి ఇపుడే బయటకు వచ్చిన గుండె జాడ లెక్కడ ?
సంభ్రుతమైన శున్యపు ఒడిలో ఒడిసి పట్టుకున్న కన్నీటి చారికలెక్కడ ?
ఆనందపు అలలలో కనిపించే కదలికతో కళల శిరోలంకారమిది 
గంటలు గడిచినా మానవ భారాన్ని మోస్తున్న ఆనందాగ్ని ఇది !

ఇవన్నీ దీపాలు ఆరిపోయే ప్రాణాలున్న కొత్త ముఖాలు కావు 
ఇసుకపై అడుగు జాడలన్నీ అంచనావేసే గాలి మనుషుల తాలుకు కాదు 
ఆలొచనాలొచనాల్లొ నివసించే కాలం కపోతమైతే 
ఉదయమే బయటకు పోతుంది. కదలలేనిదైతే నిద్రపోతుంది. 

వెలుగులో పట్టించుకోకున్నా తరుముకొచ్చే చిమ్మ చీకటి చిద్విలాసం ఎక్కడ ?
అవసరం, అనుభవం ఎత్తుకు పై ఎత్తైతే మిగిలిపోయే స్వప్న శిఖరం ఎక్కడ ?
నేలపై పొగడ్తపు పోగాలకు అలవాటు పడిన అధికారపు సింహాసనం ఇది 
విధి గీసిన చిత్రపటాల్ని సైతం వీధి దీపాల్లా వెలిగించే వింతలోకం ఇది !

కాలంతో పోటీ పడే కెరటాలు ! ఎన్నైతేనేం? ఎక్కడుంటేనేం ?
తీరం దాటలేవని ని తెలియక ఎంత పోరాడితేనేం ?
కవిత్వాన్ని అనుసరించే చీకటి సముద్రాలు ఎంత వైశాల్యముంటేనేం ?
మనసుల్ని గెలుచుకోలేని మంచితనం ఎంతుంటేనేం ?

ప్రాణం చెట్టుకుంటుందని , పిట్టకుంటుంది కదాని 
మనం దయదలచి కదిల్చే కొండబండలు నీడనిచ్చినా 
మీదపడి మనిషిని ముక్కలు చేసినా ప్రాణం ఉండాలని ఏముంది ?
గాలికి ఒక చోట నుండి మరో చోటకు వేగంగా ప్రయాణించే 
ఖాళీ విస్తరాకు తనకు తెలియని విధి లేదంటే మాత్రం విలువేముంది ?

కవిత్వాంశం ఏదైనా ఒకచోటనుండి మరొక చోటకు కదలదు 
కాలాంశం ఎక్కడున్నా తన ఉనికిని మార్చుకోదు 
జరిగే ప్రతి అంశాన్ని ఒక ఫ్రేములో బిగించి రూపం కలిగించే కవి 
ఈదురుగాలికి కొట్టుకుపోతే ఎక్కడికి తేలుతాడో పాపం !

సృష్టి మొత్తం తుడిచి పెట్టుకుపోయినా తన స్థానం తనదే ననే కాలం 
ఈ మాయా లోకానికి అలవాటు పడితే 
తన పని తాను చేసుకుని పోయే ముళ్ళని 
ఎవరికీ తాకట్టు పెడుతుందో కదా  పాపం !


Sunday, September 29, 2013

పోస్ట్ మార్టం  

తెరచిన కిటికీ వద్ద కూర్చున్న అతను ఒక విషయమై ఉన్నాడు 
ఆ కళ్ళు మాత్రం అక్షరాలకు వలయమై ఉన్నాయి 
అరుపులు, అమ్మకాల నడుమ బస్సు ధ్వని ఎక్కువగా ఉంది 
చూపులు తిప్పి ఒక్కసారిగా ద్రుష్టి సారించాడు 
ఆ చూపు ఒక నిశ్శబ్ద దళం లా ఉంది 
గమనించిన నా  క్షణం హిమ స్వరం లా ఉంది 

రాత్రి అంచుల మీది నిద్ర ప్రయాణం తో 
సేదతీరిన ఆ కనుల నుండి ఏదో తెలియని భాష కనబడుతోంది 
సందిగ్ధం లో నా హృదయం వెలుగు సూది గా మారింది 
ఇద్దరి మధ్య బిగిసిన మౌనంతో  
స్వప్నం చెదిరి  ఒక్కసారిగా మెలకువ వచ్చింది 

ఆ పెదవులపై ఇప్పటికీ స్వేఛ్చ శబ్దం వినిపిస్తుంది 
ఎలా ఉన్నావు ? అని అడిగితే ఉన్నాను కదాని అర్థం వచ్చేలా 
ఆ గళం గ్లాసులోకి పాట జూలు విసిరింది 
ఆ చేతిలో న్యూస్ పేపర్ చదవడానికి ఏముంది అన్నట్లు మూసి ఉంది 

మళ్ళీ వీధి లోకి మళ్ళీ నిర్లిప్తంగా నా చూపుల ప్రవాహం
నిర్ణయం ఏదైనా పోస్ట్ మార్టం ఖచ్చితం ! 
ఇంత భగ్న శాంతి లోనూ 
నా పాట ను వినే గుండె లేకపోలేదు 
నన్ను అనుసరించే ఛాయలు రాకపోలేదు ! 

Saturday, September 28, 2013

నా హృదయం 

కళ్ళు మూస్తే రాత్రి కన్న కలలే 
కాంతి వర్ణం తో కొన్ని 
కటిక చీకటితో కొన్ని 
అన్నీ సృష్టి దృశ్య పరంపర బింబాలే !

తల విదిల్చి చూడగానే 
ఎదురుగా వెలుగు దారాలు 
పొందికగా అల్లుతూ సూరీడు 
కొమ్మ కొమ్మకు సమన్వయాన్ని అనుసరించి  
గూడు అల్లుకుంటూ సాలీడు దర్శనమిచ్చాయి 

ఒక్క గాలి తెర వీస్తే 
ఆ దారమేమవుతుందో 
ఆ గూడు ఎలా నిలుస్తుందో అనేదే ప్రశ్న 
వంద రేకుల పద్మం నుండి 
ఒంటి రేకు పలకరింపు వరకు 
అన్నీ నీటిమీద రాతలే !

ఇంతా చేస్తే 
ప్రతి చోటా నేను ఉన్నాను 
ప్రతి వర్ణం నా చుట్టూ అల్లుకుని ఉన్నాయి 
ఎక్కడికక్కడ విడిపోతూ 
కలుసుకుంటూ ఉన్నది ఒక్కటే 
నా హృదయం 
చిత్రమై 
సంగీతమై 
సాహిత్యమై ...!

Saturday, September 21, 2013

ఏది మంచిది..?

వద్దు 
రావద్దు 
ఉదాసీనత 
ఉద్యోగం చేసే సమయం 
రావద్దు
దానికంటే నిద్ర పోవడం 
మంచిది 

కదలిక లేని శాంతి 
వద్దే వద్దు !
అంతకంటే క్షణాలన్నీ 
విషమ పాత్రలు 
పోషించడమే మంచిది 

నిరాశ నిటారుగా నిలుచుని 
నింగి నెలా ఏకమై 
మనిషి పిచ్చి కలలు కనే 
సమయం రావద్దు
అంతకంటే మేలకువను 
ఆశ్రయించడం మంచిది  

నది వొడ్డున కుర్చుని 
విశ్వాసం తో తిరిగే వ్యక్తికి 
గతం గుర్తుకు రానే వద్దు
అంతకంటే తెలియని భవిష్యత్ ను 
ఉహించు కోవడం మంచిది  

దీర్ఘమైన చీకటి 
ఆయువును తగ్గించే 
విషయం 
గుర్తుకు తెచ్చుకోవద్దు 
అంతకంటే వెలుగు చేసే మాయకు 
దూరం కావడం మంచిది 


అవసరాల పలుకులతో 
విషయ సేకరణ చేసే 
స్నేహం చేయద్దు
అంతకంటే మౌనగీతం 
పదే పదే పాడుకోవడం మంచిది  

ఉడికిపోయిన వయసుకు 
రంగులు దిద్దుకుంటూ 
మనిషిలో ఎన్నో 
రంగులున్నాయని అనద్దు !
అంతకంటే 
ఎన్ని రంగుల్ని 
తొలగించ వచ్చో ఆలోచించడం 
మంచిది 

జీవితంలో 
జీవం లేదని 
కన్నీటితో కడిగి 
మరింత 
విషాదంతో నింపద్దు 
నవ్వలేక పోయినా 
నవ్వేవారినైనా  
చూడటం మంచిది 

 

Saturday, September 7, 2013

పరిధి // శైలజామిత్ర  

కనిపించని కళ్ళతో సూటిగా చూస్తూ 
అనేక సంవత్సరాలుగా జీవిస్తున్న నేను నాకు బాగా గుర్తు 
వీధి చివర , ఆరు బయట 
చిగుర్లు చిట్లినట్లు రేగినట్లు .. చెట్లు తెగిపడినట్లు 

ఇంట్లో మారుమూల గదికేసి చూస్తూ 
నిస్తేజంగా చప్పుడు చేస్తున్న నా హృదయం ఇంకా గుర్తు 
శరీరం వెనుక   .. మనసుకు ఎదుట 
ఎదిగిన పంట ఎండినట్లు .. పండిన కాయ పూసినట్లు 

పెలుసుబారిన కిటికీ ఊచల కేసి గమనిస్తూ 
నా కనుబొమలు ముడిపడిన దృశ్యం ఇంకా గుర్తు 
భావోద్రేకం అంచున .. ఉపద్రవం రూపాన 
కొండలన్నీ కదిలి వెళ్లి పోతున్నట్లు .. పరకలన్నీ  స్థిరమైనట్లు

ముఖాముఖి హస్తగతమైన తీరు అంచనా వేస్తూ 
నా హృదయం చిరునవ్వులు చిందించిన చాయలు ఎంతో గుర్తు
ఒలికిన సముద్రాన .. ఎత్తుకున్న అత్తిచెట్టు అందాన  
కంచె ఇంటికి వేసినట్లు .. కావలి కాళ్ళకు పడినట్లు 

ఎదుగుదల మెరుపులా  మారిన దిశను పరిశీలిస్తూ 
గొంతెత్తి ఎదురుతిరిగిన క్షణాన నేనో తల్లినైన గుర్తు 
తేలికైన గుండె తీరాన .. కన్నీటి కళ్ళ చివరన 
జీవితం జీవితమైనట్లు .. ప్రేమ వేరింటి కాపురం పెట్టినట్లు ..  

రాత్రి - నిద్ర  

రాత్రికి  తోడుగా నీవు 
నిద్రకు తోడుగా నేను 
లేనప్పుడు  
సమయం సమయానుకూలంగా 
మారిపోతుంది 

బల్ల పరుపుగా 
సుదీర్గంగా ఉన్న రాత్రి 
ఒక్కసారిగా వృత్తం లా చుట్టుకుంటుంది. 
పగటి నుండి వచ్చే రాత్రి పాతదే ! 
ఎక్కి వచ్చే మెట్లు పాతవే 
అయినా ఎప్పటికప్పుడు 
జాగ్రత్తలు తీసుకుంటూ 
నిద్ర సరికొత్తదని నిరూపిస్తుంది.   

రాత్రే కదా 
మెల్లగా పారిపోదాం అనుకునే ఆశను  
కల తన బాహువుల్లో బంధిస్తుంది. 
ఎవరు చూస్తారులే ఇక్కడే ఉండిపోదాం 
అనుకునే చీకటిని 
నిద్ర బయటకు వెళ్ళగొడుతుంది   


రాత్రికి 
ఒక్క పువ్వైనా కాపలా కాస్తుంది  
అనవసర ఆవేదనను , ఆందోళనను 
గది తలుపు అడ్డగిస్తుంది 

తెల్ల వారితే వెళ్ళిపోయే రాత్రి 
మళ్ళీ వస్తుందని తెలుసు 
అయినా  
ముఖం మీది నుండి దుప్పటిని తొలగించి 
పగలతో రగిలిపోయే 'పగలు' ను 
ఆహ్వానించాలంటే 
భూమి ప్రాచీన ప్రేయసిలా 
కన్నీళ్లు పెట్టుకుంటుంది 

రాత్రి 
అలసిపోయిన భూమిని ఓదార్చుతుంది
పగలు 
నీడలను గురించిన అనేక విషయాలపై 
సందేహాలు తీర్చుకుంటుంది. 

Monday, August 19, 2013

నీకోసం ..!

నేను నిన్ను  అనుసరిస్తూనే ఉంటాను 
ఒక్కసారైనా  వెనుతిరిగి చూస్తావేమొ అని..  
నిద్రను , మేలకువను రెంటినీ ఏకం చేసి 
నిశ్శబ్దాన్ని పరిపూర్ణం చేస్తూనే ఉంటాను 
ఎప్పటికైనా నా పిలుపులో ఆర్ధ్రతను గుర్తిస్తావేమో అని..

శరీరాన్ని ఇంద్రధనువును  చేసి 
నీకై ఎదురుచూస్తూనే ఉంటాను 
ఒక్క నిముషమైనా నా చూపుల తాకిడి 
నిన్ను మేల్కొలుపుతుందేమో అని.. 
హృదయాన్ని హరివిల్లును  చేసి 
నీకు అందిద్దామని అనుకుంటూనే ఉంటాను
నీ మాటల పరిమళం నన్ను తాకుతుందేమో అని. 

అయినా ప్రియా !
నా గుండె ఆకాశమే నీవైనప్పుడు 
వెదకడానికి ఏముందని ?
నా శ్వాసే నీ నామమైనప్పుడు 
ఎదురు చూడడానికి ఏమి మిగిలిందని ?
ఆకృతి లేని ఆత్మస్వరూపం  
నిన్ను బహుమానంగా నాకిచ్చినప్పుడు 
గుర్తించడానికి ఏముందని ?

 

  

Saturday, August 17, 2013

చిత్రం - విచిత్రం

ఉదయం ఎన్నో హావభావాల చిత్రం 
హృదయం ప్రేమ  విచిత్రం 
ఈ చిత్ర విచిత్రాల నడుమ 
రాత్రి ఊహల ఉయ్యాల లూగే వర్ణ చిత్రం 

ఆశ మనల్ని అనుసరించే భావ చిత్రం 
అత్యాశ మనలోంచి మనల్ని వేరు చేసే 
ఆధునిక విచిత్రం
ఈ చిత్ర విచిత్రాల నడుమ 
ఆశయం అందరినీ తోడు తీసుకుని 
ఒక తాటిపై నడిపించే అపురూప చిత్రం 

ఒకచోట గెలిచి, మరొక చోట ఘోరంగా 
అవమానించ బడినా అదొక అనుభవ చిత్రం 
ప్రతిచోటా విజయ బావుటా ఎగరవేస్తున్నా 
ఆ గజమాలను నువ్వు తప్ప అందరూ మోస్తున్న 
అదొక సరదా విచిత్రం 

పలకరింపుకు విలువను చూపుతూ 
పళ్ళికిలించకున్నా చిరునవ్వుతో ఆహ్వనించేది  
ఒక అనుభూతి చిత్రం 
పంటి పంటికి విలువకట్టి అక్కున చేర్చుకునేది 
మసక బారిపోయే తాత్కాలిక విచిత్రం 

మాట ముత్యమైతే అది బంధనా చిత్రం
సత్యమైతే ఆత్మీయతా చిత్రం 
అతితెలివి ద్వారభందాల మధ్య నుండి వచ్చే  
మాటలన్నీ అవసరం సోరుగులోనివైతే 
అది కాలానికి వేళ్ళాడే గాజు రాళ్ళ చిత్రం

కట్టు మనమెంటో తెలిపే మొదటి చిత్రం
కలిసికట్టు మనకు కనిపించే మనసు చిత్రం 
కాలం మనల్ని అనుసరించే మౌన చిత్రం 
కన్నీరు గుండెను తేలిక పరిచే వాస్తవ చిత్రం 
ఇంత భారాన్ని మోస్తున్న మనిషి జీవితం 
ఒకరికి ఒకరు అర్థం చేసుకోలేని విషాద చిత్రం ! 

Sunday, July 28, 2013

మబ్బులతో  ఆకాశం

మబ్బులు కమ్ముకున్న  ఆకాశానికి
ఈ మధ్య మరీ గైర్హాజరు అవుతున్నందుకు 
ముఖం చూపేందుకు సిగ్గు పడుతున్నాడేమొ 
సూర్యుని  పరిమళం అందలేదు 
తడిసి తడిసి ముద్దవుతున్నఅవనికి
జలుబు చేసి విసుగు కలిగిస్తోందేమో  
తగాదాల పీటముడుల్ని  విప్పడం లేదు 
 
సగం తెరచి ఉన్న తలుపుల మధ్య 
మధ్య తరగతి ఆశలు  ఇంకా తీరడం లేదు 
గమ్యం అంటే ఏదో తెలియని వాహనాలు
ఒకదానికొకటి ఎందుకు డీ కొంటున్నాయో అర్థం కావటం లేదు !
నగరం పెదాలకు హరితహాసాల్ని అంటిద్దామని  
ఎంతగా ప్రయత్నించినా 
రూపాయి నోట్ల  మీద నుండి కిందికి దిగడం లేదు 

సూత్రాలలో బిగించిన పరమార్ధం పట్టుపడక 
రూపాయికి , ఐదు రూపాయలకి తేడా 
పనిచేసే కుర్రవాడికి అంతు చిక్కడం లేదు 
సినిమా శైలి నే అంటిపెట్టుకున్న  
కాపలాదారుకి  శ్రమ కు , మిశ్రమానికి తేడా తెలియటం లేదు 

గుండెలోకి బులెట్ దూసుకెళ్ళాక
రేపటి నుంచి మంచిగా ఉండాలనుకునే 
మానవ  జీవితానికి పునాది లేదు 
ఇంటి గుమ్మాన్ని ఒక భీభత్స వేదికను చేసి 
మానాభిమానాలు మళ్ళీ మెరవాలంటే 
ఆ  అవకాశం ఏ కోశానా లేదు 

ఎన్ని జరుగుతున్నా 
జీవితాలలో మార్పు లేదు 
నడతలో లయ లేదు 
ఉపిరి ప్రయాణానికి విరామం లేదు 
వదిలినట్లు వదిలి తిరిగి పడే బంధం 
గళంలో స్వేఛ్చ లేదు 
ఉదయానికి ఉద్యోగం లేదు 
రాత్రికి నిద్రలేదు 

ఎప్పుడైనా , ఎక్కడైనా 
ఒంటరితనం మరీ ఒంటరైనప్పుడు 
దరిదాపుల్లో ఎవరులేరని 
నీకు అనిపించినప్పుడు 
నిన్ను ఎవరు చూడటం లేదని 
నీవు తెలుసుకున్నప్పుడు 
నీవెలా ఉంటావో 
ఆ వ్యక్తిత్వం నీదే అనడానికి 
సందేహం లేదు ..!


Wednesday, July 17, 2013

తడిచి ముద్దవుతున్న కాలం// శైలజామిత్ర 

సంఘర్షణల వర్షానికి 
కాలం తడిసి ముద్దవుతోంది .  
రాత్రి బల్లపై ఒంటరి దీపం 
స్వప్నమై వెలిగిపోతోంది 
మంచు దువ్విన బంతి పువ్వు 
చిరునవ్వులు ఒలకపోస్తోంది 

శున్యపు కోటపై 
భయం కావలి కాస్తోంది 
బంగారు పళ్ళెరం లో 
ప్రకృతి ఉదయ బింబాన్ని 
మోసుకొస్తోంది 
జీవితపు చీకటికి 
సూర్యకాంతికి ఏమాత్రం సంబంధం ఉండదు 
ప్రయాణం లో విషాదాన్ని మరిచేందుకు 
మన అడుగులు మరొకరిపై 
నెట్టేస్తాం అంతే ! 

ఇక్కడ ముళ్ళు 
ఒంటికి గుచ్చుకుంది 
గుండెకు కాదు 
రక్తం మాత్రం గుండెలోంచి వస్తోంది 
ఆశ్చర్యం!
గిర గిర తిరిగే బావి గిలక 
నగరాలపై పడి 
చరిత్ర పుష్పించే మానవ రూపమై 
కృపాణ మతితో అలరిస్తోంది 

ఒకరికి శక్తి కావాలి 
మరొకరికి యుక్తి,కుయుక్తి కావాలి 
కొండల్లో లోయల్ని దాచేసే చీకట్లో 
వీధి దీపపు స్నేహం కావాలి 
కనిపించే పాలభాగం పై 
పుష్ప రాగం కనిపించాలి 
ఒక్కొక్క రోజు ఒక్కో కోరిక చేతుల్ని బంధిస్తే 
పతాక శీర్షికలో 
సమాజపు కొత్త శిల దర్శనమిస్తుంది 
మనిషి రాక్షసుడైనా 
మహానీయుడైనా 
చేతలలో మార్పే తప్ప 
చేతులు రెండే !
స్పర్శలో , స్పందనలో 
మస్తిష్క మనోజ్ఞ శాల ఒకటే ! 

సమయాన్ని అనుసరించి 
హృదయంపై నిప్పుల కుంపటో 
మబ్బుల పందిరో వెలుస్తుంది 
మనసును బట్టి 
పూల గుత్తో లేక ముళ్ళ కంపో ఎదురవుతుంది 
మనో ముఖంపై ఒకవైపు సంతోషం 
మరోవైపు ఆవేదన కలుగుతుంటుంది 
వెలుగు ముగ్గులపై  కన్నీరు 
నీడ ముద్రల దృశ్యాలు కలగలిపి 
జీవితానికి మౌలిక రహస్యమై మిగిలిపోతుంది 

రైలు కదిలింది 
ఆ మూర్తి రూపం మళ్ళీ ఆలోచనలో పడింది  





మా ఊరి చిత్రం

నా భుజంపై తల వాల్చి 
నా గుండెపై చిన్ని పాదాలు మోపి 
చిట్టి మోకాళ్ళు నన్నల్లుకుని 
నన్ను అనుకుని ఉండేది 
మా ఊరి చిత్రం 

ఏమైందో ఏమో
మసకబారిన ముఖంతో 
మోయలేని భారాన్ని మోస్తున్నట్లు 
మనసు ఉయ్యాల లోంచి 
కిందకు జారిపోయింది
నిండైన దృశ్యం చెదిరిపోయింది 

ఉల్లాసంతో ఎగిరి పడే చేప 
వెల్లకిలా పడినట్లుంది ఆ రూపం 
కలల కొలనులో 
మహారాణి లా  ఉండే చందమామ 
నాతో పాటు తుళ్ళిపడే వాన నేస్తం 
చిన్ని పాపలను ఓలలాడించే 
రెండెడ్ల బండి మువ్వల సవ్వడి 
వయస్సు ఉడిగినట్లు గా మారి 
నన్ను చూసి బోసి నవ్వునవ్వాయి 

సూర్యకిరణం మీది నుంచి దూకే 
కుందేటి వెచ్చదనాన్ని తోడు తెచ్చుకుని 
మూడో కాలు ఆసరాగా నడుస్తుంటే 
నువ్వూ  అంతేగా పిల్లా 
అంటూ ఊరు నవ్వుతోంది 

పైర గాలిలో తుమ్మెదల్లా సాగిపోతున్న 
రంగురంగుల ఉహలు 
ముసిరిన మబ్బులయితే 
వాస్తవాలు  ఉండుండి మెరిసే  
మెరుపులవుతాయి 
నీలాకాశంలో వెండి పడవ 
రెండు విశ్వాస తీర్మానాల మధ్య 
నిలుచున్న నా ఉపిరిలా ఉంది ..
అల్లిబిల్లిగా సాగే నీరెండ ముఖాల మధ్య 
అలికిడి నా ధరహాసంలా ఉంది.. 

Saturday, June 8, 2013

వర్ణ నిశి 

నీలి అంచు ఆకాశంలో 
ఉదయ ముఖ చిత్రం వేల్లాడుతోంది 
భూమిపై బతుకుకై సంఘర్షణ సాగుతోంది
గుండె చప్పుడు  ఒక విషాద కావ్యమై మిగులుతోంది.  

సమయం నిశ్శబ్దమైనప్పుడు 
నేలపై నడిచే శిలలు 
పాతపడిన రాత్రిని తలచుకుంటూ 
వ్యక్తి నుండి సమాజానికి మధ్య 
అనుబంధపు నీడలా  కదులుతుంది 
బౌతికం నుండి మానసికానికి 
వర్ణ నిశి వృధా ప్రయాణం ఆరంభమవుతుంది 

క్షణాలన్నీ నాలుగు గోడలకు  ఆభరణాలు అయినప్పుడు 
ప్రతి నిముషానికి   అనుభవ చిత్రం వేళ్ళాడుతుంది. 
విశ్రాంతి ఎరుగని జీవిత గమ్యం 
సముద్ర తీరమై అలరిస్తుంది 
వర్తమానాన్ని  మోస్తున్న  మేఘం ఉపిరి ఆడక 
కిరణాల సందుల్లో నుండి దారి జోప్పించుకుని 
మనసు అద్దాన్ని స్పురింపచేస్తోంది 

విశ్వానికి శబ్దం, కదలిక , ఎదిగిన ప్రాణాలైతే 
ఇంతకాలం నిద్రించిన శిలల్లో  సంగీతం వినిపిస్తుంది
ఒకపక్క ఆకలి, మరోపక్క అలజడికి మధ్య 
రెపరెపలాడే పేజీలన్నీ ప్రకృతి అలుముకుంటుంది 
ప్రాత: కాలపు రంగులలో కనిపించే 
జీవన ఆశా రేఖల్లో ముక్కలవుతున్న పంక్తుల్ని 
విడదీసిన సమయం ఒక్కటే అదే నూతనత్వం  ! 
అన్నింటినీ కలగలిపే మంత్రమొక్కటే మానవత్వం ! 

24-05-2013

Friday, May 3, 2013

కాంతి పరిష్వంగం  // శైలజామిత్ర 

పల్లవించే కాంతి పరిష్వంగం వీడే ప్రగతి 
దిగులుతో నురగలు చిందించే నేను 
ఎవరికోసమో నవ్వులు చిందించలేము 
వెన్నెల విన్నపాన్ని విస్మరించలేము 

ఉదయాన్ని అంటిపెట్టుకున్న ఊరు 
కలల బొమ్మల ఉహలతో నేను 
దుస్తుల కోసం చుక్కల్ని బతిమలాడలేము  
రాత్రుల కోసం స్మృతుల్ని వెంట తెచ్చుకోలేము 

చీకటి రెక్కలతో నిండిన రాత్రి 
భయం తుఫానులో నేను 
సుఖంగా నిద్రించలేము 
మృత్యువును ఆశ్రయించలేము 

నెత్తుటి గీతల్లో సమాజం 
విచ్చు కత్తుల మెరుపుల్లో నేను 
జనస్వామ్య రంగంపై జీవించలేము 
హృదయ విహంగాన్ని వీక్షించలెము 

రుతువుల ఘోషల్లో  చెట్టు 
వెన్నెల గిలిగింతలలో నేను 
మరొకరి కోసం ఈల పాట పాడలేము 
ఏ సృజన రూపాన్ని దర్శించలెము 

అవసరంపై ప్రతి వ్యక్తీ తనలో అన్నీ ఉందనుకుంటారు 
ప్రయోజనం తో ప్రతీదీ అస్తిత్వం నుండి విడి పోతుందనుకుంటారు. 
అయినా అనుబంధం తప్పదు ప్రకృతిలో 
సముద్రం ఉప్పొంగక తప్పదు బతుకు విధానంలో ,,!

04-05-2013
 

Monday, April 22, 2013

నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ?



నాకో జీవితం కావాలి దానమిస్తావా  నేస్తం ?
అది అందమైన  నీ మనస్తత్వం లానే  ఉండాలి 
మరచిపోకు నేస్తం!
బలవంతంగా నడిపిస్తున్నా కాని చెయ్యి వదిలి పరుగులు తీస్తోంది 
దోమలు కుట్టకుండా , చీమలు కుట్టకుండా మనసు దోమతెర కట్టి 
ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా సొమ్మసిల్లి పోతోంది 
వర్షపు చినుకుల మధ్య మనం వేడి వేడి టీ తాగుతున్నప్పుడు 
నువ్వు అసామాన్యమైన దానివి  అన్నావు గుర్తుందా?
ఆ మాటలు గుర్తుండే అడుగుతున్నాను 
నాకో జీవితం కావాలి దానమిస్తావా  నేస్తం!

ఇన్నేళ్ళుగా తిరుగుతున్న గుండె రంగుల రాట్నం 
నాదే అనుకున్నా కానీ యాంత్రికం అంటోంది 
నాతోనే ఉందనుకున్నా కాని సంబంధం లేదంటోంది 
ఉన్నంత వరకైనా నా పక్కనే ఉండమంటే 
అది మాత్రం అడగద్దని శాసిస్తోంది 
అపుడెప్పుడో సమస్యలను తలుచుకుని 
పడీ పడీ  మనం నవ్వుకున్తున్నప్పుడు 
నా నవ్వు చూస్తూ బతికేయచ్చు అన్నావు గుర్తుందా ?
ఆ ధైర్యంతోనే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ! 

ప్రాణం పోరాటాల బట్టీలో నిత్యం  ఉడుకుతోంది 
అదృష్టం అల్లంత దూరంలో నిల్చుని చోద్యం చూస్తోంది 
ఒకరినేంటి అడిగేదని నా అంతట నేనే 
ఒక  మంచి రోజును తీసుకుని పూజలో ఉంచి 
కన్నీటి తీర్థ ప్రసాదాలు అందించి 
భద్రంగా దాచుకుంటే స్వేఛ్చ కావాలంది 
అప్పటికీ ఉపిరిని వడగట్టి వచ్చే స్వచ్ఛతను 
జీవితానికి మూడు పూటలా తాగిస్తున్నాను 
అయినా రోజు రోజుకు చిక్కి శల్యమై పోతోంది 
ఒకసారి మనం మాట్లాడుకునేటప్పుడు 
నీలో అమాయకత ఉందని ఒకసారి అన్నావు గుర్తుందా ?
ఆ నమ్మకంతోనే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ! 

నా జీవిత తెరచాపలో చిల్లులు , చిరుగులు లేవు 
అలాగని మరొకరికి పంచి ఇచ్చేటంత సొగసులు లేవు 
కొన్నాళ్ళైనా ఆనందనిలయం లో  తాకట్టు పెడదామంటే 
జామీను ఇచ్చేవారు లేరు 
అసలే జీవితం లేనివారికి అమ్మేద్దామనుకుంటే 
నాకు జీవితం లేకుంటేనే బావుంది 
ఉంటె రిపేర్లకే ఖర్చు పెట్టాలి మాకొద్దని 
తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు
ఒకసారి మనం గట్టిగా పోట్లాడుకునేటప్పుడు 
ఆ కోపంలోనే నీలో నిజాయితీ ఉందని అన్నావు గుర్తుందా ?
నువ్వు నా స్వంతమనుకునే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ?

నాకు మరుజన్మ పై నమ్మకం లేదు నేస్తం 
నాకు జన్మ అంటూ ఉంటె ఇలానే ఉంటుందని తెలిసిపోయింది 
నీ జీవితం నాతో ఉంటెనే నాకు ఆనందమని అర్థమైపోయింది 
ఇంత తెలిసాక నీ మౌనంతో 
జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే  బోధపడుతోంది...  








Friday, April 12, 2013

మాకైతే ఉగాది కావాలి



గాలి రుస రుస లాడుతోంది 
ఎండా కణ కణ లాడుతోంది 
ఇసుక దిబ్బాలపై నిర్జీవమైన జీవితాల్లా 
ఎండిన చెట్లు, పండిన కొమ్మలను చూస్తూ  
ఆకాశం ఆవేదనగా ఉంది 
అవని దప్పికతో ఉంది 
సరిచేయలేక  మనసు కలతగా ఉంది 
మనం ఎలా ఉంటె ఏమి ?

మాకు  ఉగాది కావాలి ! 
పెదవులపై దరహాస సుమాలు పూయించే పునాది అవ్వాలి 

కరెంటు తీగలకు కాస్త అడ్డమైతే చాలు 
పూర్తిగా వృక్షాలను నరికేస్తాం 
ఆశ్రద్దతో గాలిని కలుషితం చేస్తాం 
సెల్ ఫొన్ శాస్త్రంతో పక్షులని చంపేస్తాం 
అడవుల్ని నరికి 
జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తాం
చెరువుల్లో నీళ్ళు తోడి కాంక్రీటు భవనాల్ని కట్టేస్తాం 

అయినా మాకు ఉగాది కావాలి  
పెదవులపై దరహాస సుమాలు పూయించే పునాది అవ్వాలి 

బాల్యాన్ని పుస్తకాల మధ్య పెట్టి నలిపెస్తాం 
పసి మొగ్గలనుండి 
పండు ముసలి వరకు 
వావి వరుసలు, వయో బేధాలు లేకుండా 
యువతుల్ని 
అత్యాచారాలు చేసి మసి చేస్తాం 
అమ్మను, నాన్నను దూరం చేసుకుంటాం 
ఉద్యమాలని , బందులని 
బస్సుల్ని తగల పెడతాం 
తలలు పగల కొట్టుకుంటాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

నిరుపేదల పేగులకు 
డబ్బు ఆశ చూపి ఇష్టమొచ్చిన రీతిలో వాడుకుంటాం 
పిందెలు ఏరుకుంటూ 
పత్తిని  పిండుకుంటూ 
తడిసిన మిరపను సరిచేసుకుంటూ 
తెగిన తన రక్త నాళాలను  అతికించుకుంటూ 
బతకలేక బతుకుతున్న రైతన్నను 
నిర్లక్ష్యం చేస్తాం 
 కత్తుల్ని కడుపులో పెట్టుకుని 
కౌగలించుకుంటూ  రాజకీయమంటాం 
కరువుల్ని మనమే సృష్టించుకుని 
కడుపుల్ని చూపి మరీ ఏడుస్తాం !

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

వేదికలపై తెలుగు మాట్లాడమంటాం 
మా పిల్లలకు అస్సలు తెలుగే రాదనీ గొప్పలు చెప్పుకుంటాం 
మనవళ్ళ తో  ఆంగ్లంలోనే మాట్లాడతాం 
కుల మతాలు వద్దంటాం 
మా కులానికే సీటు ఇస్తాం 
ధనిక పేదలు ఉండకూడదు అంటాం 
డబ్బుంటేనే అవకాశాలు ఇస్తాం 
నీతి నియమాలపై ఇంటర్వ్యూ లు ఇస్తాం 
అవినీతిని ఇంటిపేరుగా మార్చుకుంటాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

ఆగస్టు పదిహేను, జనవరి ఇరవై ఆరు 
అంటూ జెండాలు ఎగరేస్తం 
గాంధి , నెహ్రు , వల్లభి పటేల్ అని దేశ చరిత్రలు 
ఒక్కసారి తిరగేస్తం 
పేదలతో చిందులేస్తాం 
కులానికి తగ్గట్లు టోపీలు పెట్టుకుంటాం 
మతానికి తగినట్లు ప్రార్ధనలు చేస్తాం 
పగటి వేషాల్నీ కుర్చీలేక్కాక మర్చిపోతాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

ప్రతిభను పలుకుబడికి అమ్మేస్తాం 
కిరీటం ఉంటేనే కీర్తిని అందిస్తాం 
సమాజసేవ చేసినట్లు మభ్య పెడతాం 
మనసాక్ష్నిని నిద్ర పుచ్చుతాం 
పంచన చేరి వంచన చేస్తాం 
అబద్దాలాడుతాం .. మాటలు మార్చుతాం 
నటిస్తాం . తమకేమి తెలియదని బుకాయిస్తాం 
ఎన్ని చేసినా 

మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

అత్యాసతో కాలిబాటను సైతం మింగేస్తాం 
వ్యాపారమంటూ మనసునే చంపేస్తాం 
రూపాయి నాణెంలో అణువులా దాక్కుంటాం 
పట్టెడన్నం లేకున్నా పండగలు జరుపుకుంటాం 
అప్పులు చేసి బలవంతంగా బలిపశువులవుతాం 

ఎలా ఉన్నా మాకైతే ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి