Friday, October 26, 2012

మసి

కదిలే గుండెకు గురిపెట్టడం
కదిలించే మానవతకు మంటపెట్టడం
కావాలంటున్న అనుభందాల్ని హేళన చేయడం 
కమ్ముకుంటున్న నిరాశను నివారించాకపోవడం
కాలం చేస్తున్న కనికట్టు కాదు
నీలోని కానితనం చేస్తున్న పైశాచికం...!!

తెల్లరకనే..
సద్దిముటల మాటెలా ఉన్నా
సద్దుచేయని పులచెండుల్లా బద్దలైన 
హృదయపు ముక్కలు కిందపడి ఉన్నాయి..
ఆరాతీయకనే...
రబ్బరు బంతుల్లా వాటికి స్వేచ్చాకవచాలు తొడిగి 
న్యాయమూర్తుల రూపంలో వెనక్కు నడుస్తున్నాయి

పనివాడికేం తెలుసు ? పాపం...
పాపాలన్నీ తెల్లగానే ఉంటాయని...
వంటవాడికేం తెలుసు ?పాపం..
శరీరాలన్ని నేడు కూరగాయాలయ్యాయని...

ఇపుడు నింగి మన ఇంటి కప్పు...
నేల ఎవరు ఎవరికీ చేసారో తెలియని ఒక అప్పు..
దిక్కులు ఎవరికీ ఏమికాని నిప్పులు
హక్కులు మనకు మనమే కొని తెచ్చుకుంటున్న డప్పులు...

రా.. మనిషీ.. రా 
ఎన్నాళ్ళయింది నిన్ను చూసి..
ఎవరు పంపితే వచ్చావో..
ఎవరు రమ్మంటే వేల్లిపోతావో తెలియదు.
సురీడంటే పిచ్చోడు సాయంత్రం వెళ్ళిపోతాడు 
నీకయితే లోకం తో పనిలేదు కదా 
స్వరాలతో, స్వప్నాలతో పరిచయం లేదు కదా 
సృష్టిని కాదని వెళ్లి పోయే హక్కు ఒక్క నీకే ఉంది..
మద్య మధ్యలో ఈ జంతువులోకటి 
నన్ను బతకనివ్వవు.. అలాగని అవీ జీవించవు..

అయినా 
ఇవన్ని ఎవరికీ కావాలి..?
అడవులకా..? నదులకా..?
సముద్రాలకా? బహుశా ఇంకా బతికున్న మనుషులకేమో..

కనిపించే నురగ బొమ్మలు...
వస్తు పోతున్న నౌకలు 
సిగ్గుతెరల మధ్య తరంగ చిత్రాలు..
చీకటి ఖడ్గాల మధ్య స్తంబించిపోయాయి..
అశాంతి ఆవిరుల మధ్య కరిగిపోయాయి..

మనిషి మసకబారిపోయాడు 
మనసు మసి బారిపోయింది..
మిగిలిందొక్కటే...
ఆస్తుల మధ్య అస్థికలు 
అపనమ్మకాల మధ్య జీవత్చవాలు...

ఉరి
మనసు మడిస్నానం చేసి చేసి జోకొడుతోంది
నిద్ర చుట్టి చుట్టి వేకువను మేల్కొలుపుతోంది
నిశ్శబ్దపు నిశిలో చిక్కుకున్న పక్షి తన
కిల కిలా రావాలతో సృష్టికి సంకేతాల్ని అందిస్తోంది
వెలుగుకు చీకటికి మధ్య ఉన్న సన్నని తెర
కాలంతో పాటు కన్నెసొగసులను కాపలా కాస్తోంది
ఆకాశం మాసినట్లు చేస్తున్న కాలుష్య భూతం
మూడో కంటికి తెలియకుండా అధికారంతో శుభ్రం చేస్తోంది
ఎపుడో వేయాలనుకునే రోడ్డుకు ముందుగానే
దారికడ్డంగా పోసిన కంకర నడిచే కాళ్ళను రక్తంతో నిలదీస్తోంది
దేవుడే దిక్కని గుడిముందు అడుక్కుంటున్న ముష్టివాడి జీవితం
నాగరికత నడుమ కొత్త నోట్లలా కళకళలాడుతోంది
తప్పతాగి తూలుతూ అర్థరాత్రి ఇంటికొచ్చిన భర్త అక్రుత్యాల్ని
తెల్లవారకుండానే తులసికోటలో కన్నీటి దీపం వెలిగిస్తూ
ఆనవాలు దొరకకుండా భార్య కడిగేస్తోంది..
హైటెక్ సింధురాన్ని నుదుట దిద్దుకుని నగరం
మృత్యుమాతను పిలిచి అత్యాధునికంగా అలంకరిస్తోంది
అందమైన అనురాగాన్ని వికృతమైన ఆనందాన్ని పంచుతూ
తాత్కాలిక సుఖాన్ని వెదికే గుండె అశ్రువుల్ని నింపుకుంటోంది
కదలలేని కాలాన్ని సాగదీసి కృత్రిమమైన క్షణాల్ని సృష్టించి
గారడీల మధ్య నివసించే ప్రాణాలు ఉపిరి లేకుండానే సేదదీరుతోంది
బతుకు భారాన్ని మోయలేక మోయలేక
నడిరోడ్డు కూడలిలో నిలబడి ఉండగానే
మనసును ఒక ఒడంబడిగా చేసుకుని
చెదిరిన స్వప్నపు సంచుల్ని సరిచేసుకుంటూ
తెల్లని కాన్వాసుపై కనబడేలా నల్లని చిత్రాన్ని గీస్తూ
కనబడని దారానికి ఉరి పోసుకుని
తెలియని ద్వారాల వెంట జీవం వెళ్ళిపోతుంది..!!

Thursday, October 25, 2012


చౌరస్తా..

అర్థరాత్రి నిశ్శబ్దంలో మునిగిన చౌరస్తా ..
ఉదయం శబ్దంతో నిద్రలేస్తుంది..
ఒక సుందర స్వప్నం చెదిరిపోతే
మరొక ఉహ దాన్ని చెరిపేసినట్లు...

ఇంటిముందు దీపాల వెలుగులో 
కనిపించే ఇల్లాలి ఆలోచనలు
కొత్త అనుభవంతో మేల్కొంటాయి.
అస్తిత్వం రుజువు చేసుకోవాలనుకుని కళ్ళు 
వాస్తవాన్ని నిలుపుకోవాలనుకున్నట్లు..

గాలికి కదిలే అడుగు జాడలు  
ఇసుకలో అంతరంగాన్ని అనుసరించే పల్లవులు 
భవిష్యత్ వ్యవస్థకై పరుగులు తీస్తాయి 
నేలపైని నీడలతో నడిచే స్వప్న శిఖలు 
ప్రకృతి నుదిటిన అదృష్ట సింధువుగా మారాలన్నట్లు.. 

ఉదయం నుండి రాత్రి వరకు హృదయం  
కోలాహల సముద్రంలో ఈదుతున్న ఒంటరి నిశీధి 
కలలు కనే అసంఖ్యాక హస్తాలతో కలిసి 
గుండెలను దాటే నిరంతర నినాదాలతో 
గోడలకు వేళ్ళాడే సంధ్యారుణ మేఘంలా ఉంది 
త్రుప్తి లేని సమాధానం బరువుగా పరుచుకున్నట్లు..

పరుగులెత్తే ఉత్సాహంతో ఒక తరం 
ప్రవహించే కలలతో మరో తరం 
ఎదురయ్యే ప్రశ్నలతో మలి తరం 
ఏదైనా ఏమైనా, ఎవరైనా సరే సముద్రం మధ్య కుర్చుని 
దాహం గురించి చర్చించరు..
నిజమంటే భాధాతప్త ప్రపంచంలో 
ఉలికిపాటు పంక్తులు నిలిచినట్లుంది 
నీడనిచ్చే ఎద ముందు ఆకాశం చిన్నబోయినట్లు..

మనిషిలో మానవత్వంతో పాటు 
మారణహోమం ఉంటుంది 
మనసులో అనురాగంతో పాటు అనల చరణ౦ ఉంటుంది 
పొలం గట్టుపై తలెత్తి ఆకాశాన్ని చూస్తున్న రైతుకు 
కనిపించే జీవితం భవిష్యత్ లో ఎన్ని రూపాలకు ఆయువునిస్తోందో 
అర్థంలేని స్వేచ్ఛను కోరే శిరస్సుపై అక్షరాల ఆయుధాలు 
ఎంతగా  విలయ తాండవం చేస్తున్నాయో 
తెలియక నాలాంటి రూపాల్ని దహిస్తున్నాయి 
ముష్టియుద్ధం కాస్త మిసైల్ ప్రయోగం అయినట్లు..

అయినా 
నక్షత్రాల వెలుగులో కనిపించేదంతా 
ఆకాశం కాదు 
సూర్యకిరణాలు ప్రసరించనంత మాత్రాన 
ఆ చోటు భూమి కాకపోదు.
అర్థరాత్రి ఆకాశం పెళ్ళికి పట్టుచీర కట్టుకున్నట్లు 
పగలు భూమి నవ్వుల వెలుగులు వెదజల్లినట్లు..

Sunday, October 21, 2012


అక్షరం ధ్వనిస్తుంది 

మాయలో ఉంచిన 
వర్తమాన చరిత్రలో 
నీదో చిత్రమయిన పాత్ర .
చేజారిన మానవ హక్కుల పత్రంపై 
నాదో అవిశ్రాంతమయిన శీర్షిక !
చిరునామా నా వద్ద లేదు 
బహుశా అడుగుల్లో  దాగుందేమో!

ఎవరికెవరు మరో దారి నవలంబించడం 
అలవాటు చేసుకున్నారో 
ఎవరినెవరు నగ్న హృదయంతో 
భిన్న మార్గాలని అనుసరింపజేసారో 
ఒక స్వప్నం నిజం కావడానికి 
చీలికలో నలిగే కంటే గోతిలో పడేదే మిన్న!

తలుపులు మూసిన సాయంత్రపు బతుకుల్లో 
నిప్పు ఆరిపోయినా శక్తికి మెలకువ ఉంది 
ఇది మొండితనం కావచ్చు! అరణ్య సాహసం కావచ్చు 
జీవం ఉంటే చాలు హక్కు ఉన్నట్లే అనుకోవచ్చు 
ఇంత భాద్యత సమర్ధత కోసమే కాని సహనం కోసం కాదు!
ఎందుకంటే 
జరిగే ప్రతి పోరాటం భూమికోసం కంటే 
మనిషి అస్తిత్వం కోసమయింది. 

బరువైన గాయాల్ని మోస్తున్నా 
గుండె వదిలి పోదు 
రేగుతున్న మంటల్ని భరిస్తున్నా
జీవితం వద్దు పొమ్మనదు
వాస్తవం కనిపిస్తుంది చివరిలో 
అక్షరం ధ్వనిస్తుంది నా నాడిలో..