Monday, September 17, 2012


ఇప్పుడు చెప్పు నీ ప్రేమ ఎలాంటిదో..?

మంచు దుప్పటి కప్పుకున్న ఆకాశం 
ఎలాగైనా భూమికి వెలుగు ఇవ్వాలని 
పడే తాపత్రయమే ప్రేమ!
వెన్నెల వాకిట 
కనిపించే చెట్టు నీడే  ప్రేమ!
చెలియలి కట్టపై కదిలే నౌక కింద 
దాక్కున్న నీటి ప్రవాహమే ప్రేమ!
కాంతి హస్తాలై విస్తరిస్తూ  
కనిపించే కిరణాల పువ్వులే  ప్రేమ !
అహరహం వీలయినంత శక్తిని సమీకరిస్తూ 
ఏకంగా ధాత్రిని తడిపే వర్షపు 
చినుకులదే  ప్రేమ !

ఇప్పుడు చెప్పు! నీ ప్రేమ ఎలాంటిది?
అవసరపు గొడుగుల కింద 
అన్యమస్కంగా జరిగే గుండె ఉగిసలాట 
ప్రేమ కాదు 
అసూయ, అనుమానపు నీలి నీడల వెనుక 
కనిపించీ కనిపించని 
సర్దుబాటు నగవు ప్రేమ కాదు 
సబ్బు నురగ బొమ్మలు,
తడిసి ముద్దయిన తరంగ చిత్రాలు 
ప్రేమ కానే కాదు. 
కోర్కెలకు మెరుగులు పెట్టి 
నువ్వు కంటి ముందు ఉంటేనే 
నా జీవితం అనే మాటలు ప్రేమ కాదు 
కలలు కంటే ప్రేమ జనించినట్లు కాదు 
పగటి పలవరింత ప్రేమ కానే కాదు.

ఇప్పుడు చెప్పు నీ ప్రేమ ఎలాంటిదో ? 
వదిలి వెళ్ళిన దేదీ నీది కాదు.
అంటిపెట్టుకున్నది నీది కాదు.
జీవితం అనేది చిత్ర విచిత్రమైన 
పాత్రల పరకాయ ప్రవేశం!
ఏ  పాత్ర ముగిసినా 
అది నీ పాత్ర కాదనుకో!
ఏ సన్నివేశానికి తెరపడినా 
ఇంకా నీలో సున్నితత్వం పోలేదని తెలుసుకో!
పుట్టగానే మాటలు రాలేదని
నాలుక వ్యర్ధం అనుకోము!
పెరిగీ పెరగ గానే పరుగు రాలేదని 
కాళ్ళు  వృధా అనుకోలేము!
ప్రేమంటే అర్థం తెలుసుకోకుండా 
ప్రేమ దూరమయితే 
గుండెకు చిల్లు ఉందనే 
అభిప్రాయానికి రాలేము!
ప్రతి పుట్టుకకు 
ఒక కారణం 
ప్రతి మరణానికి 
ఒక నింద తప్పవు !
కారణాలను తెలుసుకుంటేనే 
కారణ జన్ములవుతాము 
లేకుంటే పలుగాకులమవుతాము!

మరచిపోకు 
ప్రేమంటే ఒక కన్నీటి భాష!
అది ఒక్క హృదయానికే అర్థమవుతుంది!
తడిని కోల్పోకుండా  
పల్లవి పాడే పలుచని పరదాల కదలిక !
అది ఒక్క  స్వచ్చతకే కనిపిస్తుంది!

మొదటి రోజూ  వన్నెతో 
మరునాటికి మన్నులో.. 
అందుకే ఉండాలి మనం ప్రేమతో!







No comments:

Post a Comment