Thursday, February 28, 2013

అమ్మకు నాకు పెద్దగా తేడా లేదు 

అమ్మకు నాకు పెద్దగా తేడా లేదు 
కాకుంటే.. ఆధునిక కాలం కదా!
మా అమ్మ అమ్మ గానే ఆత్మీయతలో ఉండిపోతే 
నేను మమ్మీ గా మారి ఆంగ్లంలో ఇరుక్కుపోయాను 
మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపిస్తే 
నేను ఆయాలో అమ్మను చూపుతున్నాను 
నా అక్షరాభ్యాసానికి అమ్మ తొలి గురువైతే 
నేను వచ్చీ రానీ మాటల భాద్యతనే పంతులమ్మకు అప్పగించాను. 
నేను కన్నీరు పెడితే అమ్మ చీరకొంగు ఒదార్చితే 
నేను పాప కన్నీటికే అర్థం తెలుసుకోలేని రూపాయి నోటు గా మారాను 
నా  ఆశలు  ఆశయాలు అన్నీ అమ్మే అయితే 
నేను నా పాపకు కలలా, ఒక ఉహలా కనిపిస్తున్నాను. 
ఇప్పటికీ నా అణువణువులో అమ్మ లాలి పాట వినిపిస్తుంటే 
నా బిడ్డకు డబ్బుకోసం అమ్మ పడే పోరుబాట కనిపిస్తోంది 
మా అమ్మ నన్ను గెలిపించడానికి తాను ఓడిపోయింది 
నేను మాత్రం నేను గెలవడానికి నా బిడ్డను ఓడిస్తున్నాను 
అందుకేనేమో .. 
మా అమ్మ అంతా నేనే అనుకుని నా ఒడిలోనే కన్ను మూసింది 
నేను అంతా నావారే అనుకుంటూ బతికున్నా కన్ను మూసినట్లే  ఉన్నాను..