Saturday, September 28, 2013

నా హృదయం 

కళ్ళు మూస్తే రాత్రి కన్న కలలే 
కాంతి వర్ణం తో కొన్ని 
కటిక చీకటితో కొన్ని 
అన్నీ సృష్టి దృశ్య పరంపర బింబాలే !

తల విదిల్చి చూడగానే 
ఎదురుగా వెలుగు దారాలు 
పొందికగా అల్లుతూ సూరీడు 
కొమ్మ కొమ్మకు సమన్వయాన్ని అనుసరించి  
గూడు అల్లుకుంటూ సాలీడు దర్శనమిచ్చాయి 

ఒక్క గాలి తెర వీస్తే 
ఆ దారమేమవుతుందో 
ఆ గూడు ఎలా నిలుస్తుందో అనేదే ప్రశ్న 
వంద రేకుల పద్మం నుండి 
ఒంటి రేకు పలకరింపు వరకు 
అన్నీ నీటిమీద రాతలే !

ఇంతా చేస్తే 
ప్రతి చోటా నేను ఉన్నాను 
ప్రతి వర్ణం నా చుట్టూ అల్లుకుని ఉన్నాయి 
ఎక్కడికక్కడ విడిపోతూ 
కలుసుకుంటూ ఉన్నది ఒక్కటే 
నా హృదయం 
చిత్రమై 
సంగీతమై 
సాహిత్యమై ...!