Tuesday, August 21, 2012


జన్మ విస్పోటనం 

గుండెను తవ్వుకుని బైట పడ్డ 
పారదర్శక శైలి వాన చినుకుది!
శరీరాన్ని దాటి ఊడి పడ్డ 
పదాల శక్తి భరించే మనిషిది..

నింగి, నేల గాలి, ధూళి తో పాటుగా 
నేను కూడా కలిసి నలు దిశలా వ్యాపించాను 
వీచే గాలిలానే నాలోని మనిషి తత్వం 
గతానికి. భవిష్యత్ కాలానికీ మధ్య జరిగే 
ఊహల ఉగిసలాటలు ఇంటిని ఆశాంతం మింగేసాయి.

జన్మ విస్పోటనంతో 
జరిగిపోయిన సమయం 
అంతా కావాలని మారం చేసిందో ?
తనదే అయిపోతుందని స్వప్నం వచ్చిందో కాని 
జీవిత కాలాన్ని  ఒక యంత్రంలా మార్చింది.

కళ్ళు, కాళ్ళు, ఒళ్ళు, మెదడు 
స్వార్ధం, అసూయ, అంతర్మధనం,
విడిపోతూ, కలిసిపోతూ
ఆకాశం ఆత్మను ఒంటరిని చేసింది 
తడి ఆరని అవని ఎప్పుడో కన్ను మూసింది.

ప్రేమ అల బతుకు పుటను తాకి 
గాడత ఎరుగని వలస వృత్తాంతం వైపుకు నడిచినా 
గుండ్రంగానే భూమి తిరుగుతోంది.
వరద నీటిలో మునిగిన సముద్రం 
అశాంతిగా దుఃఖ పతాకాన్నిచేత బూని 
మృత కిరణాల మధ్య  మౌనం పాటిస్తూ..
శూన్యపు పొరలను తాకుతోంది 

గుండె కాలిన చోట
మబ్బులు సైతం బూడిదలా కనిపిస్తుంది 
మనిషి పోయిన తర్వాత 
ఆ పాదపు గుర్తులన్నీ పోగు చేస్తే 
కదిలిపోయిన కాలం కనిపిస్తుంది.
హృదయ నదికి జ్వరం వస్తే 
తేరుకునేదాక ఏదీ ఆగదు.
పచ్చని కిరణాలు చేలకు పరిచయమైతే 
వెచ్చని ఊసులు కాపలా కంచెకు చెందుతాయి.

విషయాలతో జీవనం సాగదు.
విషంతో అబద్దం నిజం అవ్వదు.
ఏదో మిషతో నిలువెత్తు తుఫాను ఆగిపోదు 
మనిషి నిలబడితే అది మానవత్వం.
మనసు ఏకాంతమయితే అదే దైవత్వం!

గాలిలో దీపాలు 

లేవండి! ... లేవండి! 
మానవులారా లేవండి 
మరణ సమయం మనతోనే ఉంటోంది 
అందరూ తరిమి కొట్టండి!

నడుస్తున్నా! నవ్వుతున్నా!
మాట్లాడుతున్నా!ప్రయాణిస్తున్నా
కళ్ళు విప్పే ఉండండి 
నిద్రను మరచి మరీ 
లేవండి! మానవులారా! లేవండి!
జీవితంలో ఎన్నో ఆశలు
ఉన్నాయని ఎప్పుడూ అంటూనే ఉన్నారు!.
అనుకున్నది సాధించేదాకా 
నిద్రపోకండి..అలక్ష్యంగా ఉండకండి.

కళ్ళు విప్పాలి మరి 
లేచి మీ విలువైన సంచులతో పాటు 
అంతకంటే విలువైన ప్రాణాన్ని 
మడతలు పెట్టుకుని మరీ 
చేతులో పెట్టుకోండి
ఈ క్షణమైనా పరుగులేత్తల్సిన అవసరం రావచ్చు
ఈ నిముషమైన దుకాల్సి రావచ్చు
నిద్ర మత్తులో ఉండకండి! 

కొన్నాళ్ళు మనం నిద్రపోయాము 
కాస్తయినా అదృష్ట వంతులమే!
నేటి తరానికే పాపం 
నిద్ర పోదామన్నా వీలుండటం లేదట!
విషయం ఏమిటంటే 
మరణం రక్తానికి అలవాటు పడిందట ! 
కళ్ళు మూతలు పడుతుంటే 
కంటిపై నీరైనా, గత౦లోని
రక్త చిత్రాల తాలుకు కన్నీరైనా 
గుండెపై చిలకరించుకోండి  
కాని నిద్ర పోవడానికి మాత్రం ప్రయత్నించకండి !

చెబుతుంటే వినిపించడం లేదా ?
ఓ! మనిషీ 
అక్కడ మనసులన్నీ మారణ హోమాలై 
మండిపోతున్నాయట !
బంధాలన్నీ బూడిదై పోతున్నాయట!

లేవండి లేవండి !
మరణం విలువ ఇప్పుడు 
పెరిగిపోయింది 
మరణం దారులు 
క్రిక్కిరిసిపోతున్నాయట!
ఎంత పనిలో ఉన్నా 
కళ్ళల్లో వత్తులు వేసుకుని 
మానవులారా ! మేలుకోండి 
మన పిచ్చిగానీ 
ఇప్పుడు మరణానికి జననానికి 
పెద్ద తేడా ఏముందని?
రెండూ గాలిలోని దీపాలే !
తెల్లని ఆకాశం 

గుండె ఆవిర్లు 
చల్లరుతున్నాయి.
మరో మారు పంచడానికి కాదు 
నన్ను నేను ఒదార్చుకోవడానికి..

సజీవ మనో స్పర్శకు 
అనుభవాల మొన తగులుతుంది 
జ్ఞాపకాల ఫలితానికి 
మనసు పత్ర హరితాన్ని పోగొట్టుకుంటుంది 

తలుపు గొళ్ళెం పడినా 
రెప్ప పడని ఎదురు చూపులు
తడిని కోల్పోయిన కళ తప్పిపోయిన  
మమతల మడత మజిలీ 

ఎన్ని అవమానాలో ఈ జీవితానికి 
దిక్కులే మనిషికి చుక్కలు 
నిద్ర లేమికి ఓదార్పు ఇంటి చూరున 
వేళ్ళాడే సాలె గూడే!

ప్రవాసాల ప్రకంపనల మధ్య 
నిలబెట్టి గుట్టు చెప్పాలని 
ఒకరినైనా నమ్మించి తరించాలని 
ఒంటరి సెగలో కాలిపొతూ...

తెల్లని ఆకాశంపై 
నల్లని సంతకం 
రాసి పారేసిన గతం !
నేడు క్యాటరాక్ట్ పొరల మధ్య 
మసకబారిన ఆత్మీయ స్వరం !