Tuesday, March 26, 2013

నిలదీసే ప్రశ్నలు 

నిలదీసే ప్రశ్నలన్నీ మరచిపోయి 
ఖాళీ అయిన గుండెతో  స్త్రీ  శరీరం నడుస్తోంది 
అంతరిస్తున్న జన్మ, తేలికైన బతుకు బరువు 
వెలివేస్తున్న  సమాజాన్ని ఇంకా వీడటం లేదు 
స్త్రీ పురుషుల ఒప్పందాల మధ్య 
బంధం  కూలిపోయినప్పుడు 
జరిగే ఆఖరిరోజు తతంగం ఆర్పబడి 
మిగిలేదే ఒక తల్లి ఒడి 

ఆరేళ్ళ చిత్రపటాన్ని అనుకుని
అరవై ఏళ్ల విచిత్ర వైఖరిని అనుసరిస్తూ 
ఆకాశానికి ఎంత కావలి కాసినా సరే 
అనునిత్యం ఒక నక్షత్రం రాలిపోతోంది  . 
నకక్షతాలు పదునుబారి ఉన్నా  రక్తసిక్తమవుతోంది . 
స్త్రీ జననం ఒక జ్ఞాపకాల దుస్తుల హారం 
మానసిక భ్రాంతిలో వెలుగుతున్న అర్థ ఉంగరం 

స్త్రీ జీవన గమనం మైళ్ళ తరబడి 
తూర్పు పడమరల ఒంపులుగా  బారులు  తీరినా  
ఆశ్రయించిన ఆనవాళ్ళైతే నిలుచున్నాయి కాని 
భాద్యతల బరువుకు మాత్రం ఎప్పుడో 
నేలబారుగా ఒంగిపోయాయి. 
శాసనాలకై  తవ్విన శిధిలాలపై నిలబెట్టి 
కొద్దో గొప్పో ఉగిసలాడుతున్న  
పైకప్పులు కాస్త కన్నీటికి కూలిపోతున్నాయి .  

ఇప్పుడు వినబడుతున్నదల్లా  రక్షణకై నినాదాలు 
చేతి కర్రలకున్న ఇనప మేకుల మొనలోంచి  కనిపించేదంతా 
నిర్లజ్జపు నిశ్శబ్దం అంకురించిన ఆవేశపు శకలాలు  అంతే !
ఏమి చేయలేని నిస్సహాయపు ఊపిరిలు 
సమాజపు శ్వాసకు  తక్కువైందేమో కానీ 
బతకడానికి సూదిమొనంత అవకాశం ఉన్నా సరే 
చేతివేళ్ళ మధ్య ఉన్న బెజ్జంలోకి దూరి  
ప్రపంచం  గురించే ఆలోచించే వారం ! 
చేతులు లేని నింగీ నేలను సైతం గుప్పెట బంధించే వారం! 

ప్రతీదీ నా తర్వాతే.// శైలజామిత్ర .

ప్రతీదీ నా తర్వాతే..
నీకు తెలియదేమో..
నేను చూసిన తర్వాతే నీ జీవితం 
మొదలయింది 
నేను అనుభవాన్ని దోసిలితో పట్టి 
గుండెలోకి ఇముడ్చుకున్న తర్వాతే 
నీ గుండెలో చలనం మొదలయింది..
సన్నిహితులు సరసకు చేరుతున్నప్పుడు 
బంధాల ముడులన్నీ విడివడినప్పుడు 
కృత్రిమ కాసులని అడ్డం పెట్టుకుని 
మాటల మూటలు కట్టిన తర్వాత గాని 
నిన్ను నువ్వెరగవు..!

మౌనం నాకు నేర్పుతావా నువ్వు?
ఒక్క సారి నీ జీవితాన్ని భూతకాలం లోకి పంపు 
జరిగిన సంఘటనల తాలుకు స్తితిగతులతో కలిసి 
మోడు ఎంత కష్టంగా చిగురులు వేసిందో 
చిరునగవుల చిగురుటాకులు ఎంతగా మొలకెత్తి 
నీవున్న చోటు ఈరోజు లభ్యమయిందో 
నీకవగతమయినా నాకు తెలుసు 
నీవు కళ్ళు మూసుకునే ఉంటావు..!

అవిశ్రాంత గాడ పరిష్వంగ ముద్రలలో 
వేరెవ్వరు నిన్ను విశ్రమించనీయని అర్దరాత్రి వేళలో 
అతి సున్నితంగా నన్ను నిద్ర లేపడమే కాదు 
నన్ను నిద్రకే ఏకంగా దూరం చేసి 
అలసిపోయిన నీ మనసును నా ముందు పరిచినప్పుడు 
తెరచాపనై నీ కన్నీటిని అద్దిన కాలం మరచిపోయి
నా అచ్చాదనతో నీవు 
నేడు ఆనంద దుప్పటిని కప్పుకున్నావు..!

ఒకనాడు దైవం లేదని 
గీత లో ఏముందని అంటున్నప్పుడు 
చరిత్రను కాలదన్ని 
భూమ్మీదే నీవు ఉండను అన్నప్పుడు 
ఆత్మీయతలకు తెలిసిన దానికంటే 
అప్పుడే తెలిసిన సృష్టికి ప్రేమను నేర్పుతున్నప్పుడు 
అంతరాంతరాలలో అంతరించిపోతున్న 
నీ ఆత్మకున్న  రెండు ముఖాలను మార్చి 
ఏకాంత వాసాన్ని అమర్చి పంకాలు 
విసిరినా రోజుల్ని 
కాల గర్భంలోకి నేట్టేసావు..!

నేనొక్కదాన్ని ఎంతో ధైర్యం చేసి 
నీ కల్లోల  హృదయం మీది  ఆరవేసిన 
ఎన్నో సోపానాలను పక్కకు జరిపి 
చీత్కారాల మీది నుండి నీ ఇంటికి చేరినప్పుడు 
నిన్న నేడు రేపు అనే తేడా లేకుండా 
నువ్వు నన్ను దేవతగా అనుకున్నప్పుడు 
నీ పిల్లల, పెద్దల కన్నీళ్ళ  కెరటాలను దాటి 
నీ గుమ్మాన్ని నేను దాటుతున్నప్పుడు 
మౌనపు విలువ నీకు నేర్పిన నాకు 
కొత్తగా మౌనం నేర్పుతున్నావు!

లోకం చెడలేదు నేస్తం..నీ చూపు చెడింది.. 
కాలం మారలేదు నేస్తం..నీ గళం  మారింది '
బంధం చెడలేదు నేస్తం..
నీలో ఆలోచనల  విలువ చెడింది 
నా ఆత్మీయతలో లోపం లేదు 
నీ ఆదరణ ముళ్ళ దారి పట్టింది 
ఇకపై అంతస్తుల అహంకారం తో నిండి ఉన్న 
నీ నేత్రాల ముందు 
స్థిరమయిన భావనకు వెదకడం కష్టమే!
నిండు మనిషిగా కోల్పోయిన 
నీ సహజత్వం ముందు 
మెరుపులా మారిపోయే నీ తత్వంతో  
నా మనసును గెలవడం ఇక కష్టమే,,!

నేడు నీవైనా నీనైనా 
ఒక అమ్మకు పుట్టిన జాతులం 
రేపు చెట్టుకు వేళ్ళాడే ఆత్మలం 
వాటికి మనకు ఇప్పుడు తేడా లేదు 
వీధి వీధికి ఒక ఇల్లు ఉన్నట్లు 
నోటి నోటికి ఒక మాట ఉంటుంది 
ఆస్తి అంతస్తులు 
నిన్ను ఒంటరిని చేయడం కోసమే!
పదవులు నిన్ను శత్రువుగా నిలబెట్టడం కోసమే !
ఉన్నతాసనాలు  నిన్ను 
ఉత్తగా నిలబెట్టడం కోసమే!
నేడు నువ్వు పుడితే సంతోషపడిన అమ్మ లేదు 
నువ్వు ఏడిస్తే స్వచ్చంగా ఓదార్చే వారు లేరు 
ఆఖరికి నన్ను కాదని నువ్వే ముందు 
మరణించినా నీకోసం కన్నీరు కార్చే వారు లేరు 
ఎందుకంటే 
నిన్ను ప్రేమించే నా కళ్ళు ఎండిపోయాయి!
నన్ను  ద్వేషించే నీ గుండె బండగా మారిపోయింది..
తప్పదు 
మాయలోకంలో 
నువ్వో శలభం!
మాయని నా లోకంలో 
నేనో శరీరం!