Sunday, September 29, 2013

పోస్ట్ మార్టం  

తెరచిన కిటికీ వద్ద కూర్చున్న అతను ఒక విషయమై ఉన్నాడు 
ఆ కళ్ళు మాత్రం అక్షరాలకు వలయమై ఉన్నాయి 
అరుపులు, అమ్మకాల నడుమ బస్సు ధ్వని ఎక్కువగా ఉంది 
చూపులు తిప్పి ఒక్కసారిగా ద్రుష్టి సారించాడు 
ఆ చూపు ఒక నిశ్శబ్ద దళం లా ఉంది 
గమనించిన నా  క్షణం హిమ స్వరం లా ఉంది 

రాత్రి అంచుల మీది నిద్ర ప్రయాణం తో 
సేదతీరిన ఆ కనుల నుండి ఏదో తెలియని భాష కనబడుతోంది 
సందిగ్ధం లో నా హృదయం వెలుగు సూది గా మారింది 
ఇద్దరి మధ్య బిగిసిన మౌనంతో  
స్వప్నం చెదిరి  ఒక్కసారిగా మెలకువ వచ్చింది 

ఆ పెదవులపై ఇప్పటికీ స్వేఛ్చ శబ్దం వినిపిస్తుంది 
ఎలా ఉన్నావు ? అని అడిగితే ఉన్నాను కదాని అర్థం వచ్చేలా 
ఆ గళం గ్లాసులోకి పాట జూలు విసిరింది 
ఆ చేతిలో న్యూస్ పేపర్ చదవడానికి ఏముంది అన్నట్లు మూసి ఉంది 

మళ్ళీ వీధి లోకి మళ్ళీ నిర్లిప్తంగా నా చూపుల ప్రవాహం
నిర్ణయం ఏదైనా పోస్ట్ మార్టం ఖచ్చితం ! 
ఇంత భగ్న శాంతి లోనూ 
నా పాట ను వినే గుండె లేకపోలేదు 
నన్ను అనుసరించే ఛాయలు రాకపోలేదు !