Saturday, June 8, 2013

వర్ణ నిశి 

నీలి అంచు ఆకాశంలో 
ఉదయ ముఖ చిత్రం వేల్లాడుతోంది 
భూమిపై బతుకుకై సంఘర్షణ సాగుతోంది
గుండె చప్పుడు  ఒక విషాద కావ్యమై మిగులుతోంది.  

సమయం నిశ్శబ్దమైనప్పుడు 
నేలపై నడిచే శిలలు 
పాతపడిన రాత్రిని తలచుకుంటూ 
వ్యక్తి నుండి సమాజానికి మధ్య 
అనుబంధపు నీడలా  కదులుతుంది 
బౌతికం నుండి మానసికానికి 
వర్ణ నిశి వృధా ప్రయాణం ఆరంభమవుతుంది 

క్షణాలన్నీ నాలుగు గోడలకు  ఆభరణాలు అయినప్పుడు 
ప్రతి నిముషానికి   అనుభవ చిత్రం వేళ్ళాడుతుంది. 
విశ్రాంతి ఎరుగని జీవిత గమ్యం 
సముద్ర తీరమై అలరిస్తుంది 
వర్తమానాన్ని  మోస్తున్న  మేఘం ఉపిరి ఆడక 
కిరణాల సందుల్లో నుండి దారి జోప్పించుకుని 
మనసు అద్దాన్ని స్పురింపచేస్తోంది 

విశ్వానికి శబ్దం, కదలిక , ఎదిగిన ప్రాణాలైతే 
ఇంతకాలం నిద్రించిన శిలల్లో  సంగీతం వినిపిస్తుంది
ఒకపక్క ఆకలి, మరోపక్క అలజడికి మధ్య 
రెపరెపలాడే పేజీలన్నీ ప్రకృతి అలుముకుంటుంది 
ప్రాత: కాలపు రంగులలో కనిపించే 
జీవన ఆశా రేఖల్లో ముక్కలవుతున్న పంక్తుల్ని 
విడదీసిన సమయం ఒక్కటే అదే నూతనత్వం  ! 
అన్నింటినీ కలగలిపే మంత్రమొక్కటే మానవత్వం ! 

24-05-2013