Thursday, November 22, 2012

మనో రేఖా చిత్రాలు..// శైలజామిత్ర 

గుండె లోతుల్లో నుండి వచ్చే సౌందర్యావిష్కారం నీ ఆకృతి..
కదలుతున్న శిల్పం నుండి మూర్తీభవించిన మానవత్వం  నీ స్మృతి 
నిశీధి నుండి నిశ్సబ్దం వరకు నిద్రను దాటే సమయం ప్రకృతి
మనో జగత్తును ప్రభావితం చేసే ఉదార స్వరూపం నీ సంస్కృతి 

అశ్రు కణాలు సమూహమైనప్పుడు కదిలే ప్రవాహం కిరణాలుగా మారి 
గ్రీష్మ పవన రేఖలు పలచబడి మండే అగ్నిని   చల్లర్చినట్లు 
నాలోని సృజన శక్తి మేల్కొలిపిన నీ మనో రసాకృతి కి 
మంచు బిందువుల్లాంటి  నీ చూపులు తాకిన సృష్టి రసధుని గా మారింది..

కాల పరిధి తొలి సంజలా మారి వాలిపోయిన కనురెప్పల్లో చేరి 
హిమ శిల లాంటి  రాగ స్నిగ్ద ముఖాన్ని మలిసంజలా మార్చినట్లు 
గుండె లోని పురా రహస్యాల్ని స్మరింపజేసిన గాంధర్వ కలల మూర్తికి 
రాగ ద్వేషాలేరుగని నీ సహజత్వం సోకి సమాజం ఆనందాక్రుతిగా మారింది..

సూర్యుని సిగపై వేళ్ళాడే చంద్రమానంలా  నీ నామం వినబడి .
నక్షత్రాల నఖ శిఖలపై పారాడే నీ ముఖం పారాణి ముద్రయినట్లు 
సప్త వర్ణ కిరాణాకృతి లో కనబడుతున్న వెన్నెల ఉంగరంలాంటి  నీ హృదయానికి  
కదిలే నీటిపై నిర్మించబడిన నీలి మబ్బులు తాకి జీవితం వెలుగు రధంలా మారింది 

పదునైన కత్తికి రెక్కలు దిక్కులు ఉండవు 
బలమైన వృక్షానికి హక్కులు ఉండవు 
నిశీదిలోని నీడలకు ఆనవాళ్ళు కనబడవు 
నదీ తీరాలకు కొలమానాలు ఉండవు 

సుప్రభాత వేళ శుభోదయమనే మాటలో నీ శ్రేయస్సే ఉంటుంది 
అల మరో అలను అందుకున్నట్లు 
అరచేతిలోని రేఖలు అనుభవాల్ని తరచి చుసుకున్నట్లు 
నేనడిగే  చిట్టచివరి సాయంలో  నీ అనురాగమే ఉంటుంది....
ఉహల శోభలో నిత్యం నీతో నేను 
విశ్వ గీతంలా ఎల్లప్పుడూ నాతో నీవు