Friday, April 12, 2013

మాకైతే ఉగాది కావాలి



గాలి రుస రుస లాడుతోంది 
ఎండా కణ కణ లాడుతోంది 
ఇసుక దిబ్బాలపై నిర్జీవమైన జీవితాల్లా 
ఎండిన చెట్లు, పండిన కొమ్మలను చూస్తూ  
ఆకాశం ఆవేదనగా ఉంది 
అవని దప్పికతో ఉంది 
సరిచేయలేక  మనసు కలతగా ఉంది 
మనం ఎలా ఉంటె ఏమి ?

మాకు  ఉగాది కావాలి ! 
పెదవులపై దరహాస సుమాలు పూయించే పునాది అవ్వాలి 

కరెంటు తీగలకు కాస్త అడ్డమైతే చాలు 
పూర్తిగా వృక్షాలను నరికేస్తాం 
ఆశ్రద్దతో గాలిని కలుషితం చేస్తాం 
సెల్ ఫొన్ శాస్త్రంతో పక్షులని చంపేస్తాం 
అడవుల్ని నరికి 
జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తాం
చెరువుల్లో నీళ్ళు తోడి కాంక్రీటు భవనాల్ని కట్టేస్తాం 

అయినా మాకు ఉగాది కావాలి  
పెదవులపై దరహాస సుమాలు పూయించే పునాది అవ్వాలి 

బాల్యాన్ని పుస్తకాల మధ్య పెట్టి నలిపెస్తాం 
పసి మొగ్గలనుండి 
పండు ముసలి వరకు 
వావి వరుసలు, వయో బేధాలు లేకుండా 
యువతుల్ని 
అత్యాచారాలు చేసి మసి చేస్తాం 
అమ్మను, నాన్నను దూరం చేసుకుంటాం 
ఉద్యమాలని , బందులని 
బస్సుల్ని తగల పెడతాం 
తలలు పగల కొట్టుకుంటాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

నిరుపేదల పేగులకు 
డబ్బు ఆశ చూపి ఇష్టమొచ్చిన రీతిలో వాడుకుంటాం 
పిందెలు ఏరుకుంటూ 
పత్తిని  పిండుకుంటూ 
తడిసిన మిరపను సరిచేసుకుంటూ 
తెగిన తన రక్త నాళాలను  అతికించుకుంటూ 
బతకలేక బతుకుతున్న రైతన్నను 
నిర్లక్ష్యం చేస్తాం 
 కత్తుల్ని కడుపులో పెట్టుకుని 
కౌగలించుకుంటూ  రాజకీయమంటాం 
కరువుల్ని మనమే సృష్టించుకుని 
కడుపుల్ని చూపి మరీ ఏడుస్తాం !

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

వేదికలపై తెలుగు మాట్లాడమంటాం 
మా పిల్లలకు అస్సలు తెలుగే రాదనీ గొప్పలు చెప్పుకుంటాం 
మనవళ్ళ తో  ఆంగ్లంలోనే మాట్లాడతాం 
కుల మతాలు వద్దంటాం 
మా కులానికే సీటు ఇస్తాం 
ధనిక పేదలు ఉండకూడదు అంటాం 
డబ్బుంటేనే అవకాశాలు ఇస్తాం 
నీతి నియమాలపై ఇంటర్వ్యూ లు ఇస్తాం 
అవినీతిని ఇంటిపేరుగా మార్చుకుంటాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

ఆగస్టు పదిహేను, జనవరి ఇరవై ఆరు 
అంటూ జెండాలు ఎగరేస్తం 
గాంధి , నెహ్రు , వల్లభి పటేల్ అని దేశ చరిత్రలు 
ఒక్కసారి తిరగేస్తం 
పేదలతో చిందులేస్తాం 
కులానికి తగ్గట్లు టోపీలు పెట్టుకుంటాం 
మతానికి తగినట్లు ప్రార్ధనలు చేస్తాం 
పగటి వేషాల్నీ కుర్చీలేక్కాక మర్చిపోతాం 

అయినా మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

ప్రతిభను పలుకుబడికి అమ్మేస్తాం 
కిరీటం ఉంటేనే కీర్తిని అందిస్తాం 
సమాజసేవ చేసినట్లు మభ్య పెడతాం 
మనసాక్ష్నిని నిద్ర పుచ్చుతాం 
పంచన చేరి వంచన చేస్తాం 
అబద్దాలాడుతాం .. మాటలు మార్చుతాం 
నటిస్తాం . తమకేమి తెలియదని బుకాయిస్తాం 
ఎన్ని చేసినా 

మాకు ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

అత్యాసతో కాలిబాటను సైతం మింగేస్తాం 
వ్యాపారమంటూ మనసునే చంపేస్తాం 
రూపాయి నాణెంలో అణువులా దాక్కుంటాం 
పట్టెడన్నం లేకున్నా పండగలు జరుపుకుంటాం 
అప్పులు చేసి బలవంతంగా బలిపశువులవుతాం 

ఎలా ఉన్నా మాకైతే ఉగాది కావాలి 
పెదవులపై దరహాస సుమాలు పుయించే పునాది అవ్వాలి 

Thursday, April 11, 2013

కాలపు గాలం// శైలజామిత్ర



సదస్యులు లేకుండా ఆడే నాటకం వలె 
రాజాదరణ కై తారాట్లాడే కవి రత్నం వలె 
ఉదయం మెల్లగా వచ్చింది.. 
చీకటి ఎడారి జీవితానికి కనిపించే ఈ వెలుగు 
ఒక వోయాసిస్ అని 
కళ్ళు కప్పి వేచి చూస్తేగా తెలిసేది మనిషికి 

నేడు అంతా క్షణం తీరిక లేని యంత్రాలే!
గుండె ను డాక్టర్ కు అప్పగించి 
బుద్దిని మరెక్కడో తాకట్టు పెట్టి 
నీటిపైనో , నేల మీదో 
నిందను అనుభవిస్తూనో 
అపనింద వేస్తునో కదిలిపోయే మనుషులు !
చాప చుట్టల బతుకులు ... 
భూమ్యాకాశాల మధ్య ఎవరికీ ఏమి కాని అతుకులు ! 

ఎక్కడైనా గడియారమే కాలమానం ! 
బతుకు తెరువు, తీరంలో బరువు 
రవి ఆగమనానికి కనిపించే ఉషస్సులు ! 
అయినా ఒక్క క్షణం నిశ్శబ్దంలో శబ్దంతో పలకరించి 
నేనెవరో నీవు చెప్పేదాకా తెలియదు 
నిజంగా నీవనుకునే నేనే నీ రూపమని! 
కాలాన్ని నియమించలేని దేవుడు 
మనిషి గాలానికి చిక్కిన నా రూపమని !