Wednesday, September 19, 2012

నేను నా ప్రపంచం..

నా ప్రాణం ఉన్న 
ప్రపంచం కదా ఇది!
అందుకే నాకీ ప్రపంచమంటే 
అంత ప్రాణం!
నేను ప్రపంచాన్ని ప్రేమించాను 
నా పై కప్పిన నవ్వుల శాలువాలతో 
అన్ని రంగుల్ని గుర్తించి మరీ 
తొలి సిగ్గుల స్పందనతో 
నేను ప్రపంచాన్ని ప్రేమించాను 

ఒకరోజు మనసు విప్పి 
చెప్పాను కదా!
ప్రపంచం తానెప్పుడో 
నన్ను ప్రేమించానంది
పైగా 
తనది ప్రాచీన ప్రేమ అంది.

అమ్మాయిగా 
నా బాల్యాన్ని
అమ్మగా 
నా భాద్యతను ప్రేమించిందట !
ప్రపంచం 
నా కళ్ళల్లో కొలను అయింది 
నేను ఆ కొలనులో 
కలువ గా  మారాను 
ఎవరిని ఎవరు అల్లుకుపోయారో కాని 
నాపై ప్రపంచ ప్రభావం 
ప్రపంచంపై నా ప్రభావం పడిపోయింది!

అలిగిన ప్రతిసారి నాలో ఒక 
ప్రపంచం కనబడుతుంది 
మరింతగా ప్రేమించిన ప్రతిసారి 
 ప్రపంచమంతా నేనై కనిపిస్తాను!
అందరూ అంటారు 
ప్రపంచానికి ప్రేమ తెలియదని..
నిజమే 
ప్రేమే ఒక ప్రపంచమయితే 
ఇక ప్రత్యేకంగా ప్రేమ గురించి 
తెలియడమెందుకు? అనిపిస్తుంది!
అల్లంత దురాన ఉన్నా 
అజ్ఞాతంలో ఉన్నా సరే నేను 
నా ఆలోచనలన్నీ ప్రపంచం మీదే ఉంచాను!

ప్రపంచం పసిపిల్ల లాంటిది 
దరికి చేర్చుకుంటే  ఒదిగిపోతుంది 
తరిమి కొడితే అందకుండా 
అందకుండా పారిపోతుంది 
ప్రాణాన్ని ప్రాణంలా చూపే 
ఈ ప్రపంచం ఒక వస్తువు కాదు 
దాచుకోవడానికి..
అలాగని ద్రవ పదార్ధం కాదు 
ఒలికిపోవడానికి..
ప్రపంచం ఒక గ్రంధం!
అందులో ప్రతి ఒక్కరు ఒక్క 'గీతా' సారాంశం!
 

తెగిపడిన రెక్క!

ఉన్నట్లుండి 
ఈరోజు రెక్క తెగి పడిపోయింది 
తొలి సంధ్యలో విషాదం ఆవరించింది 
సమయం చప్పుడు 
గుండెను తలపిస్తోంది..

ఇది నిన్న 
కూలిన గోడ శిధిలాల తాలుకు 
కలహ శిఖల అంతర్యం 
అగ్నినుండి ముళ్ళపైకి ఎగబాకే 
ముఖ శిఖ  శక్తి బింబమై ప్రకాశించింది..!.

నేడు 
ధూళి కమ్మిన రూపాలలో 
బతుకులతో బంతులాట ! 
ద్వేష బీజాలు కత్తులై వెలసే 
ప్రాణితం హిమ శిలై కదులుతోంది.
ఊరు బావిలో శవమై తేలుతోంది 

సమాజం 
ఒక ఉప్పు సముద్రం!
మునిగితే సమస్యే లేదు 
మునిగేందుకు ప్రయత్నిస్తేనే 
ఆవేదనంతా!

అంతర్నేత్రం..!

వెలుగు చెట్టుకింద 
రెక్కలు విప్పి విహరించిన రాత్రిని 
ఆకాశం చుంబిస్తుంది. 
రెప్పలు వాలిన మనస్సు వెలుగు చెట్టుకింద 
రెక్కలు విప్పి విహరించిన రాత్రిని 
ఆకాశం చుంబిస్తుంది. 
రెప్పలు వాలిన మనస్సు 
విశ్రాంతి కోరుకుంటుంది. 
ప్రకృతి పలకరింపు 
కళ్ళకు తెలుస్తుంది. 
ప్రాణం పులకరింపు 
గుండెకు అర్థమవుతుంది.. 
అనుభూతి సమార్ధ్రమయిన హృదయం 
అనుభవ పక్వమై మనసు తుఫానుకు 
ఎదురీదే మహా సముద్రం వలె 
జీవితం అన్నింటికీ సిద్దం. 
ఆత్మ నావరించిన ముసుగుతో 
మనిషిలో వ్యక్తిత్వం ఇప్పటిదా? 
హృదయ రేఖలు ఏర్పడని ప్రక్రుతివా ? 
ఉహల ఆకుల మాటునుండి 
శబ్ద విహంగమై వచ్చి 
నీలాకాశం వంపుల్లో 
సుందర జీవిత దృశ్యంలో కనిపించే 
శతపత్రం ప్రభావ ముధ్రవా? 
తప్పదు ఈ వికల్ప వాదన గల 
చెట్టు నీడ 
బతుకును 
అహి వలె చుట్టుకుంటుంది. 
ఇదో స్వర్ణపధం! 
ప్రపంచాన్ని పూర్తిగా 
మరచిపోవాలనుకునే పిరికితనం. 
మొదలు తుది ఎరుగని అంతర్నేత్రం!
విశ్రాంతి కోరుకుంటుంది. 
ప్రకృతి పలకరింపు 
కళ్ళకు తెలుస్తుంది. 
ప్రాణం పులకరింపు 
గుండెకు అర్థమవుతుంది.. 
అనుభూతి సమార్ధ్రమయిన హృదయం 
అనుభవ పక్వమై మనసు తుఫానుకు 
ఎదురీదే మహా సముద్రం వలె 
జీవితం అన్నింటికీ సిద్దం. 
ఆత్మ నావరించిన ముసుగుతో 
మనిషిలో వ్యక్తిత్వం ఇప్పటిదా? 
హృదయ రేఖలు ఏర్పడని ప్రక్రుతివా ? 
ఉహల ఆకుల మాటునుండి 
శబ్ద విహంగమై వచ్చి 
నీలాకాశం వంపుల్లో 
సుందర జీవిత దృశ్యంలో కనిపించే 
శతపత్రం ప్రభావ ముధ్రవా? 
తప్పదు ఈ వికల్ప వాదన గల 
చెట్టు నీడ 
బతుకును 
అహి వలె చుట్టుకుంటుంది. 
ఇదో స్వర్ణపధం! 
ప్రపంచాన్ని పూర్తిగా 
మరచిపోవాలనుకునే పిరికితనం. 
మొదలు తుది ఎరుగని అంతర్నేత్రం!

Monday, September 17, 2012

అటక మీది బొమ్మ!

కాలం ముడి 
విడిపోయిన మూట నుండి 
జారే వస్తువు 
నేడు వృద్దాప్యం!
గాలి స్వరం 
దూరమయిన బూది నుండి 
రాలే బొగ్గు కణిక
నేడు వృద్దాప్యం!
సంకల్పంతో 
శాఖా కీర్ణమయిన లేపనం లా 
అనుభవానికి  వాస్తవం!
ఆత్మకు సన్నిహితం!

అయిదు వేళ్ళతో 
చిటికిన వేలిని పట్టుకున్నప్పటి నుండి 
మనిషికి ఏమి మిగిలింది జీవితం?
చీలికల దారులలో ఎంత ఎత్తు ఎదిగినా 
అంతా చేరేది ఒక చోటే అనేది పరమార్ధం!
తల్లి తండ్రి స్థానాలు 
అందరికి ఎన్నో మెట్లు ఎక్కినంత ఆనందం
ఆ తర్వాతంతా మిగిలేది  ఒంటరితనం!

ఎలాగయినా బతుకు 
'మా దగ్గర మాత్రం వద్దు'  అనునయిస్తూ  కొడుకు 
ఇంకా బతికి ఉన్నావా ? 
'అయితే ఇంకేదయినా పెట్టు'  అడుగుతూ కూతురు
ఇంకేమి చూస్తావు అంటూ కాలం
ఎలా తట్టుకుంటావు అంటూ దేహం 
ఎప్పుడు  ఈ కారణంతో చస్తావంటూ దేశం 
సమాధానం చెప్పలేక 
పగలు రాత్రి మధ్య ప్రవాహమై 
అహరహం ఆవేదన చెందేది వృద్దాప్యం!

కాల మాన గతుల్లో 
ఇప్పటి  ఇంటి ముఖచిత్రం మారిపోయింది 
తళ తళ లాడే  గాజు పాత్రల మధ్య 
వృద్దాప్యం ఎప్పుడూ మట్టి పాత్రే!
బతికుంటే వృద్దాశ్రమపు  వాకిట్లో
మరణిస్తే  అటక మీది చెత్త మూకుట్లో..
ఒక్క భూమి మాత్రమే కాదు 
జీవితం కూడా ఒక చక్రమే అని 
అర్థం చేసుకోలేని అంతరాంతర ఆరాటం!

రోడ్డు పక్కగా విరిగిన బెంచిపై 
ముడుచుకుని నిదురపోతున్న ఎన్నో వ్రుద్దప్యాలు 
ఏదో అలజడికో గురయి 
జీవితపు అంచులలో ఉన్న ఆ బింబాలకు ఏమి కావాలో 
కన్న ప్రేమ  తెలుసుకున్న వారికే అర్థమవుతుంది 
కంటికి కనిపించని సంకెళ్ళతో 
ఎంతో అనుభవాన్ని గడించి 
ఆత్మకు గుణము రూపము ఇచ్చే 
జీవన సత్యం వృద్దాప్యం!

బాల్యం, యవ్వనం, ప్రోదత్వం మూడింటి 
ప్రభావ శక్తితో  ఏర్పడిన వృద్దాప్యం  ముందు అన్నీ వ్యర్థం!
పండుటాకులని విసిరి పారేసినా  
ఎండుటాకులని తొక్కి తోసేసినా 
జీవితాన్ని  కాచి వడబోసిన  జీవితం ముందు 
తాటిని తన్నిన వాడు ఎవరైనా  ఉత్తదే !
సహనానికి  మారుపేరైన కొత్త  చిగురు ముందు 
ఎంత పెద్ద వ్రుక్షమయినా  విత్తనమే!


మట్టి మనిషి 

ఏళ్ళ తరం మోస్తున్న బండను 
మట్టి మనిషి ఇంతవరకు దించనే లేదు 
ఇదేదో శిక్ష అనుకుంటున్నారు
సర్కస్ అనుకునేవారు ఉన్నారు
కాళ్ళు చక్రాలై, చేతులు బిక్షా పాత్రలై 
ఏ గమ్యానికి చేరుతారో కాని 
అదో వలయం అంతే!

పంట చేతికి రాకున్నా 
జవాబు చెప్పాల్సింది ఆ మట్టి మనిషే
మండే కుంపటి అతని గుండె!
ఆరిన గళం ఆతని చెమట ధార!

సముద్రాన్ని మధిస్తే 
వచ్చే అమృతమయినా 
వెంట వెంటనే తీయకుంటే కలిసిపోతుంది 
ఉప్పు కషాయం మట్టి మనిషికి మిగులుతుంది 

పూతోటలో వెన్నెల కాస్తే 
ఆ మట్టి మనిషి అవసరం లేదు 
పూల కుండీకి మట్టి అవసరం 
కాపలాకు మట్టి మనిషికి అవసరం!
బతుకు బండకు మిగిలేది శ్రమే కాని ఆశ్రమం కాదు..
ఇదో జ్ఞాపకమని పిచ్చిగీతలు వేసుకుని 
అద్దాల్లో దాచుకునే వారు ఉన్నారు.
శిల్పంగా మలచి మార్గదర్శకంగా ఎంచుకున్నవారు ఉన్నారు

జారే ప్రతి చెమట బిందువు శ్రమకు చిహ్నం కాదు 
ప్రతి పాద ముద్ర భవితకు మార్గదర్శకం కాదు 
ప్రతి అరచేయి జీవితం కాదు.
ప్రతి నొసలు కణం మూల్యాంకనం కాలేదు 

జీవన్నాటకం లో మట్టితో అవసరంలేదు 
నాటకంలో సమాజం ఉంది కాని మట్టి లేదు 
మట్టిలో మనిషి ఉన్నాడు కాని నేడు మనసులేదు 
మట్టి నుండి మట్టికి చేరుకునే ఈ ప్రాణానికి విలువ లేదు 
అంతరంగానికి మట్టి విలువ తెలిస్తేనే 
మట్టి మనిషి కొంతకాలమయినా జీవిస్తాడు

ఇప్పుడు చెప్పు నీ ప్రేమ ఎలాంటిదో..?

మంచు దుప్పటి కప్పుకున్న ఆకాశం 
ఎలాగైనా భూమికి వెలుగు ఇవ్వాలని 
పడే తాపత్రయమే ప్రేమ!
వెన్నెల వాకిట 
కనిపించే చెట్టు నీడే  ప్రేమ!
చెలియలి కట్టపై కదిలే నౌక కింద 
దాక్కున్న నీటి ప్రవాహమే ప్రేమ!
కాంతి హస్తాలై విస్తరిస్తూ  
కనిపించే కిరణాల పువ్వులే  ప్రేమ !
అహరహం వీలయినంత శక్తిని సమీకరిస్తూ 
ఏకంగా ధాత్రిని తడిపే వర్షపు 
చినుకులదే  ప్రేమ !

ఇప్పుడు చెప్పు! నీ ప్రేమ ఎలాంటిది?
అవసరపు గొడుగుల కింద 
అన్యమస్కంగా జరిగే గుండె ఉగిసలాట 
ప్రేమ కాదు 
అసూయ, అనుమానపు నీలి నీడల వెనుక 
కనిపించీ కనిపించని 
సర్దుబాటు నగవు ప్రేమ కాదు 
సబ్బు నురగ బొమ్మలు,
తడిసి ముద్దయిన తరంగ చిత్రాలు 
ప్రేమ కానే కాదు. 
కోర్కెలకు మెరుగులు పెట్టి 
నువ్వు కంటి ముందు ఉంటేనే 
నా జీవితం అనే మాటలు ప్రేమ కాదు 
కలలు కంటే ప్రేమ జనించినట్లు కాదు 
పగటి పలవరింత ప్రేమ కానే కాదు.

ఇప్పుడు చెప్పు నీ ప్రేమ ఎలాంటిదో ? 
వదిలి వెళ్ళిన దేదీ నీది కాదు.
అంటిపెట్టుకున్నది నీది కాదు.
జీవితం అనేది చిత్ర విచిత్రమైన 
పాత్రల పరకాయ ప్రవేశం!
ఏ  పాత్ర ముగిసినా 
అది నీ పాత్ర కాదనుకో!
ఏ సన్నివేశానికి తెరపడినా 
ఇంకా నీలో సున్నితత్వం పోలేదని తెలుసుకో!
పుట్టగానే మాటలు రాలేదని
నాలుక వ్యర్ధం అనుకోము!
పెరిగీ పెరగ గానే పరుగు రాలేదని 
కాళ్ళు  వృధా అనుకోలేము!
ప్రేమంటే అర్థం తెలుసుకోకుండా 
ప్రేమ దూరమయితే 
గుండెకు చిల్లు ఉందనే 
అభిప్రాయానికి రాలేము!
ప్రతి పుట్టుకకు 
ఒక కారణం 
ప్రతి మరణానికి 
ఒక నింద తప్పవు !
కారణాలను తెలుసుకుంటేనే 
కారణ జన్ములవుతాము 
లేకుంటే పలుగాకులమవుతాము!

మరచిపోకు 
ప్రేమంటే ఒక కన్నీటి భాష!
అది ఒక్క హృదయానికే అర్థమవుతుంది!
తడిని కోల్పోకుండా  
పల్లవి పాడే పలుచని పరదాల కదలిక !
అది ఒక్క  స్వచ్చతకే కనిపిస్తుంది!

మొదటి రోజూ  వన్నెతో 
మరునాటికి మన్నులో.. 
అందుకే ఉండాలి మనం ప్రేమతో!







ఉదయ స్వరం..

తలుపు తెరవగానే 
గ్రీటింగ్ కార్డ్ లా చెట్టు 
ఆహ్వానం పలికింది!
పూలన్నీ అక్షరాల్లా 
ఉదయానికి ఆహ్వానం చెబుతున్నాయి!

ఉదయం ప్రతిరోజు 
కొత్త ఉహల్ని జతచేసుకుని 
పాత రూపాన్ని 
మనకు జ్ఞాపకంగా ఇస్తూ వస్తుంది 

కొత్త అద్దంలా ఆకాశం 
మెరిసిపోతూ 
తన చుక్కల చీరను మార్చుకుంటూ 
సూర్యుని రాకకై 
ఎదురు చూస్తుంటుంది..

శూన్యంలో తిరుగాడే గ్రహాలు 
పాతవే అయినా 
ఏరోజుకారోజు 
కొత్త అర్థాల నగిషీలను 
అలంకరించుకుంటుంది 

కాలానికి, కలానికీ 
సోదర సంభంధం ఉంది 
నదికి రెండు తీరాల్లా 
ప్రకృతి దృశ్యం, సమాజ చైతన్యం 
జత పడి
మనిషి కొత్త కలలకు 
అందమయిన రుపాన్నిస్తుంది

జీవిత పుస్తకంలో 
రోజూ వారీ రహస్యాలు 
కొండరాళ్ళ మధ్య దాగిన జలాల్లా 
గుండె గొంతులోని స్వరాల్లా 
సమయం చూసుకుని 
బయటకు వస్తాయి. 
గట్టును దాటలేని ఆశలు మాత్రం  
ఆలోచనల నదిలోనే కొట్టుమిట్టాడుతుంటాయి..

భోధనలేందుకు?
త్యాగం చాలు కదా అనుకుంటూ 
ఎవరు ఏమి కోరకుండానే మేఘం 
అందరికీ ఆనందాన్ని ఇస్తుంది 

రవి చంద్రులు 
రాత్రి కవాటాల్ని తెరుస్తూ 
కిరణాల అశ్వాన్ని అధిరోహించి 
కవితగా మారి 
కవి హృదయంలోకి చేరిపోతుంది 

గాలి ప్రశ్నిస్తుంది 
ప్రవాహ రూపం నిలదీస్తుంది 
మానవీయ ముద్రతో 
అతి సున్నితమయిన 
క్షణాల్ని తట్టి లేపితే 
ఈ దిశ అయినా సరే 
ప్రకృతిలో ఏకమవుతుంది..