Friday, March 7, 2014

ఒక సమయం 



అలా నీకిష్టమైన రూపం ముందే 
ఒకప్పుడు ఎంతో సేపు కూర్చున్నావు 

స్వరపేటికను గ్లాసులో ఉంచి 
నిజాన్ని నిలదీయాలని అనుకున్నావు!

ఆరుబయట చలి గాలిలో 
ఒంటికి  అతుక్కుంటున్న 
మట్టి రేణువుల్ని 
మమతానురాగాలుగా భావించావు ! 

కన్నీటి లోంచి వానచుక్కల్ని చూస్తూ 
అది వాన ప్రభావమే అనుకున్నావు 

తూర్పు వాకిలి వద్ద నిలుచున్నా 
దక్షిణ ద్వారం లో వరికంకులలో దాక్కున్నా 
పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు 

నా  నేస్తమా !
నిన్ను ఇదివరకటి కళ్ళతో చూసేందుకు 
ఇప్పుడు నాలో అప్పటి కన్నీళ్లు లేవు 
ఇదివరకటిలా నీకోసం 
పరుగులు తీసేందుకు 
నా కాళ్ళకు వయసు లేదు ! 

ఒకప్పటి 
గాయాల మాట దేవుడెరుగు 
ఏకంగా నా గుండె పుట్టు మచ్చైపోయింది
నన్నెవ్వరు గుర్తించనంతగా జీవితం 
ముసలమ్మ మౌనమైపోయింది !