Friday, May 3, 2013

కాంతి పరిష్వంగం  // శైలజామిత్ర 

పల్లవించే కాంతి పరిష్వంగం వీడే ప్రగతి 
దిగులుతో నురగలు చిందించే నేను 
ఎవరికోసమో నవ్వులు చిందించలేము 
వెన్నెల విన్నపాన్ని విస్మరించలేము 

ఉదయాన్ని అంటిపెట్టుకున్న ఊరు 
కలల బొమ్మల ఉహలతో నేను 
దుస్తుల కోసం చుక్కల్ని బతిమలాడలేము  
రాత్రుల కోసం స్మృతుల్ని వెంట తెచ్చుకోలేము 

చీకటి రెక్కలతో నిండిన రాత్రి 
భయం తుఫానులో నేను 
సుఖంగా నిద్రించలేము 
మృత్యువును ఆశ్రయించలేము 

నెత్తుటి గీతల్లో సమాజం 
విచ్చు కత్తుల మెరుపుల్లో నేను 
జనస్వామ్య రంగంపై జీవించలేము 
హృదయ విహంగాన్ని వీక్షించలెము 

రుతువుల ఘోషల్లో  చెట్టు 
వెన్నెల గిలిగింతలలో నేను 
మరొకరి కోసం ఈల పాట పాడలేము 
ఏ సృజన రూపాన్ని దర్శించలెము 

అవసరంపై ప్రతి వ్యక్తీ తనలో అన్నీ ఉందనుకుంటారు 
ప్రయోజనం తో ప్రతీదీ అస్తిత్వం నుండి విడి పోతుందనుకుంటారు. 
అయినా అనుబంధం తప్పదు ప్రకృతిలో 
సముద్రం ఉప్పొంగక తప్పదు బతుకు విధానంలో ,,!

04-05-2013