Monday, September 17, 2012

ఉదయ స్వరం..

తలుపు తెరవగానే 
గ్రీటింగ్ కార్డ్ లా చెట్టు 
ఆహ్వానం పలికింది!
పూలన్నీ అక్షరాల్లా 
ఉదయానికి ఆహ్వానం చెబుతున్నాయి!

ఉదయం ప్రతిరోజు 
కొత్త ఉహల్ని జతచేసుకుని 
పాత రూపాన్ని 
మనకు జ్ఞాపకంగా ఇస్తూ వస్తుంది 

కొత్త అద్దంలా ఆకాశం 
మెరిసిపోతూ 
తన చుక్కల చీరను మార్చుకుంటూ 
సూర్యుని రాకకై 
ఎదురు చూస్తుంటుంది..

శూన్యంలో తిరుగాడే గ్రహాలు 
పాతవే అయినా 
ఏరోజుకారోజు 
కొత్త అర్థాల నగిషీలను 
అలంకరించుకుంటుంది 

కాలానికి, కలానికీ 
సోదర సంభంధం ఉంది 
నదికి రెండు తీరాల్లా 
ప్రకృతి దృశ్యం, సమాజ చైతన్యం 
జత పడి
మనిషి కొత్త కలలకు 
అందమయిన రుపాన్నిస్తుంది

జీవిత పుస్తకంలో 
రోజూ వారీ రహస్యాలు 
కొండరాళ్ళ మధ్య దాగిన జలాల్లా 
గుండె గొంతులోని స్వరాల్లా 
సమయం చూసుకుని 
బయటకు వస్తాయి. 
గట్టును దాటలేని ఆశలు మాత్రం  
ఆలోచనల నదిలోనే కొట్టుమిట్టాడుతుంటాయి..

భోధనలేందుకు?
త్యాగం చాలు కదా అనుకుంటూ 
ఎవరు ఏమి కోరకుండానే మేఘం 
అందరికీ ఆనందాన్ని ఇస్తుంది 

రవి చంద్రులు 
రాత్రి కవాటాల్ని తెరుస్తూ 
కిరణాల అశ్వాన్ని అధిరోహించి 
కవితగా మారి 
కవి హృదయంలోకి చేరిపోతుంది 

గాలి ప్రశ్నిస్తుంది 
ప్రవాహ రూపం నిలదీస్తుంది 
మానవీయ ముద్రతో 
అతి సున్నితమయిన 
క్షణాల్ని తట్టి లేపితే 
ఈ దిశ అయినా సరే 
ప్రకృతిలో ఏకమవుతుంది..

No comments:

Post a Comment