Thursday, October 10, 2013

కాలంశ లిప్తలు 

కవితాంశానికి , కాలాంశానికి మధ్య జరిగే సంఘర్షణ 
స్థానభ్రంశానికి , స్థల ప్రభావానికి మధ్య కలిగే ఆకర్షణ 
మరుగున పడ్డ మనోభావాలు పంచుకుంటూ 
కదలిక మరచిన హృదయాంశలు మ్రాన్పడి పోతూ 

నులివెచ్చని ఉత్సాహంతో ఎగసిపడి పడి సృష్టిని వెదుకుతోంది 
మమతల మండుటెండల్లో నివసించే మనుషులెక్కడ ?
ప్రేమే ఎరుగని ఎడారి అంచులలో నివసించే మనసులెక్కడ ?
సంబంధ విభేదాలతో గడిచే శక్తి యుక్తుల సంచలనం ఇది 
అంతరాంతర భూమికల్లో కనిపించని బొమికల మానవహారం ఇది. 

సుదీర్ఘ శ్రవణానికి , సంగీత రసధుని గతికీ జరిగే సంవేదన 
ఆనంద విహారానికి , ఆశల ఆత్మతేజానికి మధ్య జరిగే విలంబన 
ఆలోచనలను కమ్ముకున్న మబ్బుల మౌనశంఖం ఊదుకుంటూ 
ఆగని ప్రయాణంలో సరికొత్త అనుభవాల గొడుగును సరిచేసుకుంటూ 

సవిత్రు రూపాల నడుమ శరీర పరిమాణం దాగి ఉంది 
జ్ఞాపక సువర్ణ పుష్పం రెక్కలు తడిపే సోపానం అవుతుంది 
నేను లేని , నాది కాని అమృత లోకం ఎక్కడ ?
అణువణువునా సాగే లిప్తపాటు సంక్షిప్త నవాకృతులెక్కడ?
సమయపు సంకెళ్ళలో పశువు , పక్షి ఉనికే లేని ఉన్మాద స్థితి ఇది !
సమీకరణాకృతి ఆలంబనలో ఏర్పడ్డ ఏకోన్ముఖుని  అంతర్లీన సందిగ్ధ స్థితి ఇది!

ఆగు నేస్తమా ! ఆగు ఇది మాయ కానే కాదు 
మర్మంతో మృగమైన మనిషి తీరు కాదు 
తమో రాశిని కరిగించే అనుజ్వలిత ఓంకారపు ఆవిర్భూతమిది కాదు!
సూర్యుని కిరణ వాకిళ్ళలో ఇపుడు తెలియని మనో రూపం దాగుంది 

ఏకాంత  నిద్ర గుహ నుండి ఇపుడే బయటకు వచ్చిన గుండె జాడ లెక్కడ ?
సంభ్రుతమైన శున్యపు ఒడిలో ఒడిసి పట్టుకున్న కన్నీటి చారికలెక్కడ ?
ఆనందపు అలలలో కనిపించే కదలికతో కళల శిరోలంకారమిది 
గంటలు గడిచినా మానవ భారాన్ని మోస్తున్న ఆనందాగ్ని ఇది !

ఇవన్నీ దీపాలు ఆరిపోయే ప్రాణాలున్న కొత్త ముఖాలు కావు 
ఇసుకపై అడుగు జాడలన్నీ అంచనావేసే గాలి మనుషుల తాలుకు కాదు 
ఆలొచనాలొచనాల్లొ నివసించే కాలం కపోతమైతే 
ఉదయమే బయటకు పోతుంది. కదలలేనిదైతే నిద్రపోతుంది. 

వెలుగులో పట్టించుకోకున్నా తరుముకొచ్చే చిమ్మ చీకటి చిద్విలాసం ఎక్కడ ?
అవసరం, అనుభవం ఎత్తుకు పై ఎత్తైతే మిగిలిపోయే స్వప్న శిఖరం ఎక్కడ ?
నేలపై పొగడ్తపు పోగాలకు అలవాటు పడిన అధికారపు సింహాసనం ఇది 
విధి గీసిన చిత్రపటాల్ని సైతం వీధి దీపాల్లా వెలిగించే వింతలోకం ఇది !

కాలంతో పోటీ పడే కెరటాలు ! ఎన్నైతేనేం? ఎక్కడుంటేనేం ?
తీరం దాటలేవని ని తెలియక ఎంత పోరాడితేనేం ?
కవిత్వాన్ని అనుసరించే చీకటి సముద్రాలు ఎంత వైశాల్యముంటేనేం ?
మనసుల్ని గెలుచుకోలేని మంచితనం ఎంతుంటేనేం ?

ప్రాణం చెట్టుకుంటుందని , పిట్టకుంటుంది కదాని 
మనం దయదలచి కదిల్చే కొండబండలు నీడనిచ్చినా 
మీదపడి మనిషిని ముక్కలు చేసినా ప్రాణం ఉండాలని ఏముంది ?
గాలికి ఒక చోట నుండి మరో చోటకు వేగంగా ప్రయాణించే 
ఖాళీ విస్తరాకు తనకు తెలియని విధి లేదంటే మాత్రం విలువేముంది ?

కవిత్వాంశం ఏదైనా ఒకచోటనుండి మరొక చోటకు కదలదు 
కాలాంశం ఎక్కడున్నా తన ఉనికిని మార్చుకోదు 
జరిగే ప్రతి అంశాన్ని ఒక ఫ్రేములో బిగించి రూపం కలిగించే కవి 
ఈదురుగాలికి కొట్టుకుపోతే ఎక్కడికి తేలుతాడో పాపం !

సృష్టి మొత్తం తుడిచి పెట్టుకుపోయినా తన స్థానం తనదే ననే కాలం 
ఈ మాయా లోకానికి అలవాటు పడితే 
తన పని తాను చేసుకుని పోయే ముళ్ళని 
ఎవరికీ తాకట్టు పెడుతుందో కదా  పాపం !