Monday, September 17, 2012



మట్టి మనిషి 

ఏళ్ళ తరం మోస్తున్న బండను 
మట్టి మనిషి ఇంతవరకు దించనే లేదు 
ఇదేదో శిక్ష అనుకుంటున్నారు
సర్కస్ అనుకునేవారు ఉన్నారు
కాళ్ళు చక్రాలై, చేతులు బిక్షా పాత్రలై 
ఏ గమ్యానికి చేరుతారో కాని 
అదో వలయం అంతే!

పంట చేతికి రాకున్నా 
జవాబు చెప్పాల్సింది ఆ మట్టి మనిషే
మండే కుంపటి అతని గుండె!
ఆరిన గళం ఆతని చెమట ధార!

సముద్రాన్ని మధిస్తే 
వచ్చే అమృతమయినా 
వెంట వెంటనే తీయకుంటే కలిసిపోతుంది 
ఉప్పు కషాయం మట్టి మనిషికి మిగులుతుంది 

పూతోటలో వెన్నెల కాస్తే 
ఆ మట్టి మనిషి అవసరం లేదు 
పూల కుండీకి మట్టి అవసరం 
కాపలాకు మట్టి మనిషికి అవసరం!
బతుకు బండకు మిగిలేది శ్రమే కాని ఆశ్రమం కాదు..
ఇదో జ్ఞాపకమని పిచ్చిగీతలు వేసుకుని 
అద్దాల్లో దాచుకునే వారు ఉన్నారు.
శిల్పంగా మలచి మార్గదర్శకంగా ఎంచుకున్నవారు ఉన్నారు

జారే ప్రతి చెమట బిందువు శ్రమకు చిహ్నం కాదు 
ప్రతి పాద ముద్ర భవితకు మార్గదర్శకం కాదు 
ప్రతి అరచేయి జీవితం కాదు.
ప్రతి నొసలు కణం మూల్యాంకనం కాలేదు 

జీవన్నాటకం లో మట్టితో అవసరంలేదు 
నాటకంలో సమాజం ఉంది కాని మట్టి లేదు 
మట్టిలో మనిషి ఉన్నాడు కాని నేడు మనసులేదు 
మట్టి నుండి మట్టికి చేరుకునే ఈ ప్రాణానికి విలువ లేదు 
అంతరంగానికి మట్టి విలువ తెలిస్తేనే 
మట్టి మనిషి కొంతకాలమయినా జీవిస్తాడు

No comments:

Post a Comment