Monday, April 22, 2013

నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ?



నాకో జీవితం కావాలి దానమిస్తావా  నేస్తం ?
అది అందమైన  నీ మనస్తత్వం లానే  ఉండాలి 
మరచిపోకు నేస్తం!
బలవంతంగా నడిపిస్తున్నా కాని చెయ్యి వదిలి పరుగులు తీస్తోంది 
దోమలు కుట్టకుండా , చీమలు కుట్టకుండా మనసు దోమతెర కట్టి 
ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా సొమ్మసిల్లి పోతోంది 
వర్షపు చినుకుల మధ్య మనం వేడి వేడి టీ తాగుతున్నప్పుడు 
నువ్వు అసామాన్యమైన దానివి  అన్నావు గుర్తుందా?
ఆ మాటలు గుర్తుండే అడుగుతున్నాను 
నాకో జీవితం కావాలి దానమిస్తావా  నేస్తం!

ఇన్నేళ్ళుగా తిరుగుతున్న గుండె రంగుల రాట్నం 
నాదే అనుకున్నా కానీ యాంత్రికం అంటోంది 
నాతోనే ఉందనుకున్నా కాని సంబంధం లేదంటోంది 
ఉన్నంత వరకైనా నా పక్కనే ఉండమంటే 
అది మాత్రం అడగద్దని శాసిస్తోంది 
అపుడెప్పుడో సమస్యలను తలుచుకుని 
పడీ పడీ  మనం నవ్వుకున్తున్నప్పుడు 
నా నవ్వు చూస్తూ బతికేయచ్చు అన్నావు గుర్తుందా ?
ఆ ధైర్యంతోనే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ! 

ప్రాణం పోరాటాల బట్టీలో నిత్యం  ఉడుకుతోంది 
అదృష్టం అల్లంత దూరంలో నిల్చుని చోద్యం చూస్తోంది 
ఒకరినేంటి అడిగేదని నా అంతట నేనే 
ఒక  మంచి రోజును తీసుకుని పూజలో ఉంచి 
కన్నీటి తీర్థ ప్రసాదాలు అందించి 
భద్రంగా దాచుకుంటే స్వేఛ్చ కావాలంది 
అప్పటికీ ఉపిరిని వడగట్టి వచ్చే స్వచ్ఛతను 
జీవితానికి మూడు పూటలా తాగిస్తున్నాను 
అయినా రోజు రోజుకు చిక్కి శల్యమై పోతోంది 
ఒకసారి మనం మాట్లాడుకునేటప్పుడు 
నీలో అమాయకత ఉందని ఒకసారి అన్నావు గుర్తుందా ?
ఆ నమ్మకంతోనే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ! 

నా జీవిత తెరచాపలో చిల్లులు , చిరుగులు లేవు 
అలాగని మరొకరికి పంచి ఇచ్చేటంత సొగసులు లేవు 
కొన్నాళ్ళైనా ఆనందనిలయం లో  తాకట్టు పెడదామంటే 
జామీను ఇచ్చేవారు లేరు 
అసలే జీవితం లేనివారికి అమ్మేద్దామనుకుంటే 
నాకు జీవితం లేకుంటేనే బావుంది 
ఉంటె రిపేర్లకే ఖర్చు పెట్టాలి మాకొద్దని 
తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు
ఒకసారి మనం గట్టిగా పోట్లాడుకునేటప్పుడు 
ఆ కోపంలోనే నీలో నిజాయితీ ఉందని అన్నావు గుర్తుందా ?
నువ్వు నా స్వంతమనుకునే అడుగుతున్నా 
నాకో జీవితం కావాలి దానమిస్తావా నేస్తం ?

నాకు మరుజన్మ పై నమ్మకం లేదు నేస్తం 
నాకు జన్మ అంటూ ఉంటె ఇలానే ఉంటుందని తెలిసిపోయింది 
నీ జీవితం నాతో ఉంటెనే నాకు ఆనందమని అర్థమైపోయింది 
ఇంత తెలిసాక నీ మౌనంతో 
జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే  బోధపడుతోంది...