Sunday, November 16, 2014

జీవనది
ఒక్కసారైనా
ఆ ఇంట్లోకి అడుగేయగలనా ?
నా ప్రపంచానికి నే అతిదినే
ఆ ఇంటికి మాత్రం పరాయిని కాలేను
పాలరాతి భవనమైనా నా కంటికి
ఆకాశాన్ని తాకే పాము పడగలా కనిపిస్తుంది
నిలువెత్తు ధ్వజస్తంభం ఉన్న గుడి అది
ఒక్క రాత్రయినా నిద్రిస్తే చాలనిపిస్తుంది
అసలు ఆ ఇల్లు నాది కాదు
కానీ ఆ ఇంటి గోడలో దాగున్న ఇటుకను నేను
అక్కడి వారెవరు నా వారు కారు
ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్న బంధువుని నేను
అక్కడున్న నాలుగు గదుల సంభాషణల మధ్య
నా పేరును వెదుక్కోలేను
అసలు అక్కడ అనుభంధమే ఉందొ లేక
ప్రతిభంధకాలు నివసిస్తున్నాయో తెలియదు
నాలు ఇల్లే లేదని  ఆరుబయట నిద్రించను
అక్కడ నాదంటూ ఏమి లేదని చూపుల్ని అతికించను
అది నా దేవుడున్న దేవాలయం
నాది ఏమి మాట్లాడలేని ఒక దేహం !
తలంపు ఒక జీవనది
నిత్యం ఆ గుండెలో ప్రవహిస్తూ ఉండిపోతాను
ష్ ! ఆగండి !
నా లోకం నిద్రపోతోంది ! జోల పాడాలి !

No comments:

Post a Comment