Sunday, November 13, 2011

విరామ చిహ్నం


ఆవేదన అగ్ని కీలల్లో
హృదయం దహించుకు పొతున్నపుడు
అంతరంగంలో
అలజడి చేస్తున్న ఆశల రెక్కలు
గాలికి చప్పుడు చేస్తున్నప్పుడు
ఒంటరితనం
మరింత ఒంటరిగా
భరించలేనంతగా బరువెక్కినప్పుడు
ఒక ఆత్మీయ సహచర్యం వెంట
నా భావాలు పరుగులు తీస్తుంటే
సిగ్గుల చిరునవ్వుని మురిసిపోతుంటాను.
ఏకాంత సాగరంలో విరిగిన రాయిపై నేను కూర్చున్నప్పుడు
ఆకాశంలో నన్ను నిత్యం పలకరిస్తున్న
నాకై వీక్షిస్తున్న ఇంద్రధనుస్సు రంగులమధ్య
పగిలిన నా గుండె ముక్కల్ని ఏరుకుంటూ ఉంటాను
నా ఈ విశ్రాంతి లోకంలో
నాకంటూ మిగిలి ఉన్న దిక్కులతో
నాకు నేనై కనబడని నీతో
పసిపిల్లనై కబుర్లు చెబుతుంటాను
అప్పుడప్పుడు చేసే నీ అనురాగపు అల్లరి స్పర్శ
గుర్తుకు వచ్చినప్పుడు
మరో నులివెచ్చని జ్ఞాపకాన్ని జీవిత పుటల మధ్య దాస్తుంటాను.
నాకేమీ మిగల్చని ఈ ప్రపంచపు సరిహద్దుల మీద కోపంతో
ఏకంగా సుర్యున్నే గెలుచుకున్నానని
నీ ఉనికి ఉహా చిత్రాన్ని చిత్రిస్తుంటాను.
మోడువారిన నా కాలాన్ని కాదని
బతుకంతా ఒక్కసారిగా బతకనిస్తున్న
ఈ కొద్దీ కాలాన్ని తనివితీరా కళ్ళ కద్దుకుంటాను
ప్రతి అంగుళం అంగుళం గాలించినా దొరకని
అమాయకత్వాన్ని పక్షుల కిల కిలా రావాలలో విని తరిస్తుంటాను
రివ్వున ప్రనబందువై వచ్చి మునివేళ్ళపై నిలబడిన
ఒకా నొక స్వర పరిష్వంగంలో
నా భవిష్యత్తు కు అర్థం తెలుసుకుంటున్నాను
ఓంకార శబ్ద సుందరమై సుదూర తీరం నుండి వచ్చే
పిలుపులలో నిరంతరం చైతన్యాన్ని
ఒకింత విరామ చిహ్నంలో
నన్ను నేను తరచి చూసుకుంటున్నాను.

No comments:

Post a Comment