Saturday, October 20, 2012

ప్రళయ మేఘానికి భయపడి జీవితం 
గగనాన్ని చూడటం మానేస్తుందా..?
ఎక్కడో బాంబు పేలిందని 
భారతదేశం గౌరవం పోతుందా..?
గుండె చోటు అందరికి ఒకటేనా అని 
శరీరంలో వేరే చోటు చూసుకు౦టు౦ధా
కన్న బిడ్డ వద్దంటే 
నా తల్లి స్థానం కదిలిపోతుందా..? 
నాది కవి హృదయం 
స్పందిస్తే కవిత్వం ముందు వాలుతుది
నా ఉనికి అన్ని కోల్పోయినా
నా నీడ వాస్తవమై నిలిచిపోతుంది..
పోద్దేక్కుతున్నకొద్దీ దైర్యం పగటి వెలుగు
రాత్రి అయ్యేసరికి త్యాగబలంలా ఛీకటి
నా ఆనవాల్లై నిలిచిపోతాయి..

గతం మెలకువగానే ఉంది


గడచిన గతుకుల రోడ్లమీద 
శయనించిన నా తనువు 
ఇంకా సేదతీరనే లేదు
అణువణువునా ఆవేదన
నిలదీసిన నిరాదరణల మధ్య 
చేసిన గుండె వేగం 
ఇంకా ఆగనే లేదు 
ఆవేశం, అనాలోచిత చర్యల మధ్య 
పోరాడి సాధించిన ఓటమి తాలుకు 
ఆనవాళ్ళకు చిహ్నంగా 
తడిసిన రెప్పల్ని తుడిచిన చేతి రుమాలు 
ఇంకా తడారనే లేదు 
సమ సమాజ సమూహం ఎలుగెత్తి 
పాడిన అపనిందల గీతాలు 
నా వీనులను ఇంకా వదలనే లేదు 
భారంగా గడిచిన రోజులు 
భయంగా నడిచిన క్షణాలు 
సందిగ్ధం లో సర్దుకున్న 
తలపుల క్రీనీడల్ని
అనుసరించిన నిరాశ, నిస్పృహల 
నిగ్గు తేలనే లేదు 
రక్తంతో తడిసిన 'పగ' లు 
సగం కాలిన రాత్రుల ఛాయలు
నన్ను ఇంకా వీడనే లేదు 
గత వర్షపు నిర్వీర్యమయిన ముఖం 
నా ఒడిలో నిదురిస్తున్న ఆ బంధం 
నా తలపై వేసిన ఆ చేతి వెచ్చదనం 
బరువైన శ్వాసతో 
అదిరే చుబుకంతో 
వదలలేక వదలలేక వదిలి 
అశక్తతను తన మంద్ర స్వరంతో 
పూర్తిగా వ్యక్త పరిచిందో లేదో
అపుడే మాయ క్యాలండర్ తేదీల తుంపర్లు 
కాలం కంపల్ని దాటుకుంటూ 
ఒకవైపు చలి, మరోవైపు ఆకలి ఆలోచనలతో 
లేమితనపు లిపిని గుర్తించేలోగా
కొలమానం లేని "వెర్రి" సాయంతో 
కళ్ళముందుకు వచ్చింది 
మనసున్న ఆపిల్ మాంత్రికుల నుండి 
మనిషి తత్వమే లేని నియంతృత్వం వరకు 
ఎందరో ఆత్మీయుల్ని ఆవేదనల్ని పోగొట్టుకుని 
వెక్కిళ్ళ మధ్య 
ఇంకా మెలకువగానే ఉంది గతం!
అంతస్తుల ఆభరణాల్ని ధరించినా 
నల్లని పరదాల చాటున దాగిఉండి
కళ్ళు తెరిచే ఉంది గతం!

అందుకే ..
భుకంపాలతో మేను ముడుచుకున్నప్పటినుండి 
బాంబుల శబ్దంతో కళ్ళు ముసుకున్నంత వరకు 
జ్ఞాపకాల ప్రాతిపదికపై 
భవిష్యత్ తెరిచి ఉంచిన గ్రంధంలా కనిపిస్తోంది 
స్పందించలేని సుగంధ రహిత సుమాలను ధరించి 
వర్తమాన వాకిళ్ళకు కాపలా కాస్తూ 
పైరవీల సరిగంచుల్ని కళ్ళకద్దుకోవడానికి
మంచు ప్రమిదల్లో
ఆశల దీపాల్ని మళ్లీ మళ్లీ వెలిగిస్తోంది!
మానవ జీవితం మరో అంకెల అంకంతో 
చమక్కుల చుక్కలతో 
మొగ్గుల ముగ్గుల్ని వేస్తూనే ఉంది !

జరిగిన విషయం విషాదమయినా 
వదిలి వెళ్లేందుకు విల విల లాడుతుంది 
జరిగిపోయేది ప్రళయ మయినా 
నిజమయినా , అబద్దమయినా 
అంగీకరించేందుకు అలసత్వం అడ్డొస్తోంది!
ప్రపంచం తల్లక్రిందులయినా
ఒక నర్గీస్, ఒక లైలా, ఒక తానే ల కంటే 
ముంచేసే మజ్ను ఎదురయినా 
నిమ్మకు నీరేత్తనట్లున్న నైజం 
మన నైసర్గిక స్వరుపాలకు ఒక నిదర్శనం!
పరికించి చూస్తే.. 
పరివర్తన ఒక్కటే ప్రపంచ నియమం!
అదే యుగాంతం!

Wednesday, October 17, 2012


ఎడారి కళ్ళు // శైలజామిత్ర 

ఊరు పేరు లేని కాలం గోడల మధ్య ఖైది మనిషి
కడుపు నిండని ఖర్మ సిద్దాంతాల మధ్య బంధీ మనసు 
జీవితం ఒక బిక్షపాత్ర 
అందులో పడేవి ముత్యాలైనా, మట్టిగడ్డలైనా 
ఎడారి కళ్ళతో ఏరుకుని దాచుకోవాల్సిందే..!!

ఇంత వెలుగు కావాలి.. కొంత చీకటి కావాలి 
కాస్తంత నీరు కావాలి.. మరి కాస్తంత గాలి కావాలి 
చిరునవ్వు రావాలంటే నోటు కావాలి 
హృదయం ఒక ఉహా చిత్రం, అందంగా ఉన్న, లేకున్నా 
సాంఘిక శక్తులతో కలిసి సర్డుకోవాల్సిందే...

ఆకలి యానంలో ఆరాటం ఉండచ్చు.. ఆవేశం ఉండచ్చు 
శిలా నక్షత్రంలా ఉండచ్చు.. మేఘంలా ఉండచ్చు 
నీలి రాక్షసుడు రావచ్చు.. నిరంకుశత్వం ఏలచ్చు 
ఆయువు అరచేతిలో తాయిలం.. ఆ క్షణంలో ఉన్నా, వదిలి వెళ్ళిపోయినా 
ఆయుధాల శబ్దాలతో సంభాషించాల్సిందే...

సముద్రంలో పలకలు కదిలినా.. అరణ్యం ఆసాంతం అంటుకున్నా 
ఆకాశం అందుబాటులో ఉన్నా, అవని అలిగి కూర్చున్నా 
పొదలోనో, చెట్టు పైనో  పొంచిఉన్న వేటగాడు 
గురిచూసి విరగకొట్టే పాపాల కుండ.. ముక్కలైనా, ముచ్చటగా ఉన్నా 
వాస్తవ చేతనలో విరగబడి నవ్వాల్సిందే...

మనసే కాదు.. శరీరము కూడా ఒక ప్రశ్నే 
అవనేకాదు, ఆకాశము కూడా ఒక ప్రశ్నే 
ఆయుధాలతో స్వార్థ శక్తుల జైత్ర యాత్ర ఒక ప్రశ్నే..
ఆకుపచ్చని తోటలో స్తంభాలై నిలబడిన వీరులూ 
బాధలతో బీటలువారిన సమాజం 
అనేక ముఖాల్ని మోస్తున్న చరిత్ర పిడికిట్లో సంకల్పం 
పాతవైనా.. సరికోత్హవైనా 
ప్రశ్నల పరంపరలో కొనసాగాల్సిందే...-

Tuesday, October 16, 2012


ఈ రోజు 

ఈ  రోజూ నా మనస్సు ఉత్తుంగ తరంగాలై 
దీప శ్రేణులతో తలెత్తిన ఒక కెరటం.. 
ఆరోజు నా ఉహా కాంతి కల్లోలంతో 
శివ నాట్యమాడిన గంగాతరంగం..
ఆరోజు నా నరనరాల్లో సజీవశక్తులు సశబ్దంగా 
వెలుతురు తీగలు కదిలించిన అంతర్నానంద  భరితం..
ఆ అనురాగం .. చాలు జీవితాంతం..

ఆ జ్వాలలు వర్షపు ధారలు మోస్తాయనే నా అంకితభావం..
ఆ మాటలు అమృతం కురిపిస్తాయనే నా హృదయ సహజం..
కన్నీరు మోసినా ఆ కన్నులు ఆనందాన్నే భరించిన వైనం..
కురిసే ప్రతి వర్షపు బిందువు నా బందువైనంత ఆనందం..
చురుక్కుమన్న సూర్యకిరణం నన్ను తట్టి లేపిన చందం...
'నా' అనే పదానికి ఇంతటి  బలముందా అనేది నమ్మలేని నిజం..

ఉన్నట్లుండి గగనతలం నేనున్నాననే హెచ్చరించినట్లున్న మౌన మృదంగం..
ఎద ఎదను తడుతూ నాకోసం ఒకరున్నారని చెప్పాలనిపించే లిప్త స్వరం..
శరీరంలో ప్రతి భాగం అంతలోనే వాయిద్యాలుగా మారిన సమైక్యం..
చిందులు తొక్కుతూ తేలి తేలి తులిపడ్డ అశ్వగతి వ్యాఖ్యానం..
గుండెలో స్వాతంత్రం.. హిమబిందువైన నవ్వులో తేజోరుపం..
ఒక్కరోజు కణ కణంగా విడివడితే జీవితమే అవుతుందా కావ్యరూపం..

ఇన్నాళ్ళ ప్రయాణంలో ఒక్కసారిగా దేహం యజ్ఞవేది జటాచ్చటం.
నీలి ముగ్గు వేసినట్లున్న ఆకాశం వలయపంక్తుల యంత్ర శిఖరం..
ఒక్కో క్షణం ఆలోచనా తరంగంలో స్వప్నదేవతల స్వైర్యవిహారం..
సూర్యుడెందుకు? ప్రపంచమెందుకు అనుకునేటంత అరుణిమ ఆరాటం....
వెలుగు వెన్నెలకు రెక్కలోచ్చినంత శక్తితో పురోగమనం..
ఆ ఒక్కరోజుకే రంగు  రంగుల మనోరుపం మేల్కొన్న౦త సంపూర్ణం 

ఉదయమేపుడు రోదసి ప్రయాణమే 
రాత్రంతా మంచుతెరల జ్ఞాపకాల సహవాసమే..
ఏ రెంటిమధ్య ఉన్న యుద్ద జీవితం 
నర్తించే తాబేళ్ల ఆక్రోశం... 
ఒక్క రోజయినా దొరికితే మానవతా రాగం!
లేకుంటే గుండెపై కలంకార చిహ్నం..