Monday, September 17, 2012

అటక మీది బొమ్మ!

కాలం ముడి 
విడిపోయిన మూట నుండి 
జారే వస్తువు 
నేడు వృద్దాప్యం!
గాలి స్వరం 
దూరమయిన బూది నుండి 
రాలే బొగ్గు కణిక
నేడు వృద్దాప్యం!
సంకల్పంతో 
శాఖా కీర్ణమయిన లేపనం లా 
అనుభవానికి  వాస్తవం!
ఆత్మకు సన్నిహితం!

అయిదు వేళ్ళతో 
చిటికిన వేలిని పట్టుకున్నప్పటి నుండి 
మనిషికి ఏమి మిగిలింది జీవితం?
చీలికల దారులలో ఎంత ఎత్తు ఎదిగినా 
అంతా చేరేది ఒక చోటే అనేది పరమార్ధం!
తల్లి తండ్రి స్థానాలు 
అందరికి ఎన్నో మెట్లు ఎక్కినంత ఆనందం
ఆ తర్వాతంతా మిగిలేది  ఒంటరితనం!

ఎలాగయినా బతుకు 
'మా దగ్గర మాత్రం వద్దు'  అనునయిస్తూ  కొడుకు 
ఇంకా బతికి ఉన్నావా ? 
'అయితే ఇంకేదయినా పెట్టు'  అడుగుతూ కూతురు
ఇంకేమి చూస్తావు అంటూ కాలం
ఎలా తట్టుకుంటావు అంటూ దేహం 
ఎప్పుడు  ఈ కారణంతో చస్తావంటూ దేశం 
సమాధానం చెప్పలేక 
పగలు రాత్రి మధ్య ప్రవాహమై 
అహరహం ఆవేదన చెందేది వృద్దాప్యం!

కాల మాన గతుల్లో 
ఇప్పటి  ఇంటి ముఖచిత్రం మారిపోయింది 
తళ తళ లాడే  గాజు పాత్రల మధ్య 
వృద్దాప్యం ఎప్పుడూ మట్టి పాత్రే!
బతికుంటే వృద్దాశ్రమపు  వాకిట్లో
మరణిస్తే  అటక మీది చెత్త మూకుట్లో..
ఒక్క భూమి మాత్రమే కాదు 
జీవితం కూడా ఒక చక్రమే అని 
అర్థం చేసుకోలేని అంతరాంతర ఆరాటం!

రోడ్డు పక్కగా విరిగిన బెంచిపై 
ముడుచుకుని నిదురపోతున్న ఎన్నో వ్రుద్దప్యాలు 
ఏదో అలజడికో గురయి 
జీవితపు అంచులలో ఉన్న ఆ బింబాలకు ఏమి కావాలో 
కన్న ప్రేమ  తెలుసుకున్న వారికే అర్థమవుతుంది 
కంటికి కనిపించని సంకెళ్ళతో 
ఎంతో అనుభవాన్ని గడించి 
ఆత్మకు గుణము రూపము ఇచ్చే 
జీవన సత్యం వృద్దాప్యం!

బాల్యం, యవ్వనం, ప్రోదత్వం మూడింటి 
ప్రభావ శక్తితో  ఏర్పడిన వృద్దాప్యం  ముందు అన్నీ వ్యర్థం!
పండుటాకులని విసిరి పారేసినా  
ఎండుటాకులని తొక్కి తోసేసినా 
జీవితాన్ని  కాచి వడబోసిన  జీవితం ముందు 
తాటిని తన్నిన వాడు ఎవరైనా  ఉత్తదే !
సహనానికి  మారుపేరైన కొత్త  చిగురు ముందు 
ఎంత పెద్ద వ్రుక్షమయినా  విత్తనమే!

No comments:

Post a Comment