భావ చిత్రం
కొత్త నెల
సరికొత్త సంవత్సరం
కొత్త నవ్వు
సరికొత్త దు:ఖం
కొత్త చలి
సరికొత్త వేసవి
పాత మనసు
మార్పు లేని
మార్చుకోలేని
అదే మనిషి తీరు !
బంధాలను కాదని
ద్వార బంధాలను ముసేస్తున్న
నూతనత్వపు తేరు !
ముఖాలను దాటి
ముఖ స్తుతులను అనుసరిస్తున్న
అంతస్తుల హోరు !
సునితత్వపు నూనె లేక తుప్పు పట్టి
కిర్రు కిర్రు మంటున్న హృదయ కవాటాలు !
'మనం ' పదం వినబడక ...
సమూహం లో ఒంటరై
ఆనందంగా ఆహ్వానించలేని ఇంటి వాకిళ్ళు !
సఖ్యత మరచిన మనసు లోగిళ్ళు తేలికై
నేలకొరుగుతున్న నిలువెత్తు కుటుంబ వృక్షాలు !
భావ సంపదను మరచిన అక్షరాలు
కనిపించని ఆకుపచ్చని కవికోసం ఎదురుచూస్తూ
కాలాన్ని బంధించి కలాలకు సవాలు విసురుతున్న వైనాలు !
మార్పు రాని నూతనత్వం
నేలపై పడిన నూనె లాంటిది !
ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా
జారిపడటానికే అవకాశం ఎక్కువ !
అది సంస్కృతీ సాంప్రదాయాలకే పెద్ద సవాలు !