Sunday, July 28, 2013

మబ్బులతో  ఆకాశం

మబ్బులు కమ్ముకున్న  ఆకాశానికి
ఈ మధ్య మరీ గైర్హాజరు అవుతున్నందుకు 
ముఖం చూపేందుకు సిగ్గు పడుతున్నాడేమొ 
సూర్యుని  పరిమళం అందలేదు 
తడిసి తడిసి ముద్దవుతున్నఅవనికి
జలుబు చేసి విసుగు కలిగిస్తోందేమో  
తగాదాల పీటముడుల్ని  విప్పడం లేదు 
 
సగం తెరచి ఉన్న తలుపుల మధ్య 
మధ్య తరగతి ఆశలు  ఇంకా తీరడం లేదు 
గమ్యం అంటే ఏదో తెలియని వాహనాలు
ఒకదానికొకటి ఎందుకు డీ కొంటున్నాయో అర్థం కావటం లేదు !
నగరం పెదాలకు హరితహాసాల్ని అంటిద్దామని  
ఎంతగా ప్రయత్నించినా 
రూపాయి నోట్ల  మీద నుండి కిందికి దిగడం లేదు 

సూత్రాలలో బిగించిన పరమార్ధం పట్టుపడక 
రూపాయికి , ఐదు రూపాయలకి తేడా 
పనిచేసే కుర్రవాడికి అంతు చిక్కడం లేదు 
సినిమా శైలి నే అంటిపెట్టుకున్న  
కాపలాదారుకి  శ్రమ కు , మిశ్రమానికి తేడా తెలియటం లేదు 

గుండెలోకి బులెట్ దూసుకెళ్ళాక
రేపటి నుంచి మంచిగా ఉండాలనుకునే 
మానవ  జీవితానికి పునాది లేదు 
ఇంటి గుమ్మాన్ని ఒక భీభత్స వేదికను చేసి 
మానాభిమానాలు మళ్ళీ మెరవాలంటే 
ఆ  అవకాశం ఏ కోశానా లేదు 

ఎన్ని జరుగుతున్నా 
జీవితాలలో మార్పు లేదు 
నడతలో లయ లేదు 
ఉపిరి ప్రయాణానికి విరామం లేదు 
వదిలినట్లు వదిలి తిరిగి పడే బంధం 
గళంలో స్వేఛ్చ లేదు 
ఉదయానికి ఉద్యోగం లేదు 
రాత్రికి నిద్రలేదు 

ఎప్పుడైనా , ఎక్కడైనా 
ఒంటరితనం మరీ ఒంటరైనప్పుడు 
దరిదాపుల్లో ఎవరులేరని 
నీకు అనిపించినప్పుడు 
నిన్ను ఎవరు చూడటం లేదని 
నీవు తెలుసుకున్నప్పుడు 
నీవెలా ఉంటావో 
ఆ వ్యక్తిత్వం నీదే అనడానికి 
సందేహం లేదు ..!