Saturday, March 9, 2013

నిజం చెప్పు ?

శైలజామిత్ర // 9-03-2013

నీవు నా ప్రకృతికి 
ముమ్మాటికీ వికృత రుపానివి 
నీ ఉనికి సంకేతం 
నా అంతరాత్మకు వ్యతిరేకం 
ఎప్పుడో ఇవి కలిసి బతికినట్లు భ్రాంతి 
మళ్ళీ తిరగేస్తే అంతా శూన్యం 

ఒకప్పుడు అనుకూలంగా 
మరొకనాడు విభెధమై 
నన్ను నిన్నుగా చూసుకుంటావు 
ఇదేమిటని అడిగే లోగానే 
నీవు చేసే కన్నీటి రొదను అడవిలా వినమంటావు 
మరుక్షణమే అనుకున్నది 
తు చ తప్పకుండా చేసేస్తావు 

నీరు లేని నింగి 
మబ్బుల్ని దాచుకుని నవ్వుతుంటే 
కన్నీరుతో తడిసి ముద్దయిన భూమి  
మేఘమైతే చాలదా?
నా ఉనికి నీ గుండెను తాకడానికి 
నడిచే నా వెనుక ఒక రాత్రిలా నడుస్తూ 
అప్పుడప్పుడు వెన్నెల ముసుగు తొడుక్కుని 
ముళ్ళ కంపల అనుభవంతో 
ఎదురయ్యే నీవు 
అబ్బో విశ్వ మాతవే !
కాదంటావా? నిజం చెప్పు?

మనసు సూత్రం!

శైలజామిత్ర // 9-02-2013 (6 pm)

గదిలో కలర్ టివి చేరింది 
గది పాతదే!
గుండెలో సరికొత్త ఆశ మొదలయ్యింది 
శరీరం పాతదే! 
కూడలిలో బాంబు పేలింది 
రక్తం పాతదే! 

ఈ పాత కొత్త ల చుట్టూ చెదిరిపడిన 
ఆశల శిధిలాలు కొన ఉపిరితో కొట్టుకుంటూ 
సరికొత్తగా ఉండటం విశేషం 
రమారమి అందరు సజీవ సమాధులే 
సందేహం లేదు 
అలాగని వారిని ఉదయం నుండి చూడలేదు 

అనుకరించే విజ్ఞానానికి తోచకుండా 
ఎదగలేని మన:శిఖరాలకు అందకుండా 
నేరం ప్రకృతి మాతపైకి నెట్టేసి 
చేతులు చాచి నిలుచున్న మృత్యువు రెక్కలతో 
భవిష్యత్ తన ముఖాన్ని వద్దన్నా చూపుతుంది 
అది భూ విపత్కరమైనా 
జల తాండవమైనా
మనో వికారాలైనా  నలిగిపోయేది 
దిగువ రేఖా చిత్రాలే!

శిఖరాలను కూల్చేసి గాయం లేదు కదా అంటారు 
పీటభూముల్ని పేల్చేసి బతుకులు క్షేమం కదా అంటారు 
దుష్ప్రభావం అనేది రుచి కరమైన పదార్ధం 
దుర్మార్గం అనేది అసహనపు గడియారం 
తెల్లవారితే పొలానికి నీళ్ళు కావాలి 
పెద్దేక్కితే ఇంట్లో పిల్లల ఆకలి తీర్చాలి 
నేడు నదులన్నీ ఆకాశంలో అమృతాలు 
ఉట్టిపై దాచి ఉంచే ఆహారం నేడు శూన్యంలో 
వేళ్ళాడే బేల ముఖ చిత్రాలు !

అలాగని ఎలక్షన్లు ఆగవు 
ఊపిరి లేని ఓట్లు పడక పోవు 
ప్రయాణాలు ఆగవు 
ప్రవాహాలు నిలిచిపోవు 
ప్రభాతం వెనక్కు పోదు 
హింస! విధ్వంసం ! 
ప్రకంపనలు మనో వికారాలు 
ఏవీ ఆగవు ,, 

మనిషి ఒక తరగని సంకల్పం!
మానవతా రసధుని సుస్వరం ఆవాసం !
ఇప్పుడు మెలకువగానే ఉంటోంది గతం!
వర్తమానం ఎంత త్వరగా 
గతమవుతుందా అనేదే మనసు సూత్రం!







Tuesday, March 5, 2013

ఇవి వేళ్ళాడే ప్రశ్నలు 

అర్థం లేని ఆవేశం 
నల్లత్రాచులా బుసలు కొడుతోంది 
పస లేని పగ పహారా కాస్తోంది 
మనిషి జీవితం స్మశానమై కాపలా కాస్తోంది 
ఎండిన గుండెల్లో 
కారుడు కట్టిన కారుణ్యం 
రక్తం తాగుతూ దప్పిక తీర్చుకుంటోంది 

ఎవరు కావాలి? 
ఎంతమంది కావాలి?
ఎందుకు కావాలి?
అనే ప్రశ్నల పరంపరపై అన్వేషణ జరగాలిప్పుడు 
సమాధానం ఇవ్వలేని చిధ్రమైన దేహాలపై 
చేయాల్సింది శల్య పరీక్ష కాదు 
ఆరంభించాలి క్రూర మృగాల వేట ఇప్పుడు 
ఎక్కడో ఎవరో ఏదో అన్నారనో 
నీ నీచత్వాన్ని నిలదీశారనో 
కనిపించిన, కని పెంచిన ప్రాణాలను మింగి 
కడుపు నింపుకుంటానంటే
జనం ప్రభంజనం కాకపోరు 
కాటికి నీ కాయం వెళ్ళేదాకా వేచి చూడరు. 

తింటూ కొందరు, మాట్లాడుతూ కొందరు 
నడుస్తూ కొందరు విగత జీవులుగా మారిన 
ఈ ఘోరాతి ఘోరాల మధ్య 
ఏ ఇంటికప్పు కూలిందో 
ఏ ఇంటికి కడుపుకోత మిగిలిందో 
ఏ ఇంటి దీపం నింగికెగసిందో తెలియదు కానీ 
లెక్కలు చూసి లెక్క ఇచ్చేనాటికి విగత జీవుల లెక్కల్లోనే 
లెక్కలు తప్పిన వారికేమి తెలుసు?
కాలిన కన్నపేగు కడుపుకోత?
పెళ్లికనో ,ఊరికనొ, ఆనందానికనో దాచుకున్న 
ఆ ఆత్మీయతల అంచనా వారికేం తెలుసు?
ఖండించే వర్నచిత్రపు తాలుకు పడునుబారిన దు:ఖం సాంద్రత?

విధ్వంసాలతో మీ ఆగ్రహం చల్లరిపోతుందా ?
ప్రతీకారాల ప్రాంగణం మీ ప్రతిమలు ప్రతీకలవుతాయా ?
మీ పిచ్చి కానీ నువ్వు చంపినా నీకు చావే గతి 
నువ్వు ఎంతగా దాక్కున్నా కనిపించే వింతే నీ మృతి !
మా ధైర్యం కూడలి పై నులుచుని 
మా సాహసానికే దిశా నిర్దేశం చేయడానికి మీరెవరు?
ఎంతకాలమని మీ ఉన్మాదం సహించగలరు?

తుపాకీ గుండ్లతోటి, బాంబుల మోత తోటి 
ఆడుకుంటూ భయపెట్టి, బెంబేలు ఎత్తించినా,
మా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నా 
తెల్లోల్లనే తరిమి తరిమి కొట్టము 
మీ పాశవిక చర్యలను అడ్డుకోవడం 
మా వ్యవస్థకు పెద్ద కష్టమేమి కాదు. 
చావులకు మేమెప్పుడు చెదిరిపోలేదు 
మా ఉగ్రరూపం ముందు మీ ఉగ్రవాదం ఎంత?
మా తీవ్రత ముందు మీ తీవ్రవాదం ఎంతని?
మా పోరాటం ముందు మీ ఆరాటం ఎంతని?
ఒక్కటి మాత్రం మరచిపోకండి. 
చంపడం ఒక్క మంటలకే కాదు మంచుకు కూడా తెలుసు 

ప్రగాడ సానుభూతులు , ఖండింపులు 
తీవ్ర దిగ్భ్రాంతుల వైనాలు అడ్డు వచ్చాయే కానీ 
కన్నా బిడ్డను కోల్పోయిన తల్లి ఆవేదన చాలు 
మిమ్ము సజీవంగా పాతి పెట్టేందుకు..
మొసలి కన్నీళ్లు, కుర్చీల పోరాటాలు 
సమయాన్ని తింటు న్నాయే కానీ 
తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్న బాల్యం కన్నీరు చాలు 
నీ ఉనికి ఉపిరినే  శాశ్వతంగా తీసేందుకు!
అయినా తప్పదు ఏమి చేద్దాం?
తునకలయిన శవాల గుట్టల్లో సమాజం ఒక సమాధి!
సగం కాలిన దేహాలన్నీ వేళ్ళాడే ప్రశ్నలకు పునాది. 

రెడ్ అలెర్ట్ కు పబ్లిక్ అలెర్ట్ తోడయితే 
సాగని మీ ఆతల కక్ష్య మిమ్ము అనుసరించినట్లే!
త్వరలో పత్రికల్లో రాబోయే వార్త 
జాతి మతాలన్నీ కలగలిపి 
మేల్కొన్న జాతిలో చేరామని..