Thursday, September 8, 2011

నువ్వు-నేను

కదిలిన జీవితాల నడుమ
వేళ్ళాడే ఆకారాలు
ఒకటి మనసు
మరొకటి మనిషి
ప్రవహించే నదుల మధ్య
విరబూసిన అలలు
ఒకటి నిశ్శబ్దం
మరొకటి గంభీరం!
హద్దులు లేక గాలికి ఎగసిపడే
వెండి పాదాలు
ఒకటి చందమామ
మరొకటి నక్ష్యత్ర౦
గడచిన ఇన్నేళ్ళలో
కనిపించిన ప్రాణాలు
ఒకటి నువ్వు
మరొకటి నేను..

ఒంటరి నక్షత్రం

ఓడిపోవడమే
ప్రేమ లక్ష్యం..
గెలిచాను అనుకోవడమే
మనసు లక్షణం..!
గెలిచామో.. ఓడామో
తెలియని ప్రతి క్షణం ఒక సందిగ్ధం..!

నీట మునిగితే
నీరెండిపోతాయనుకోవడం
లేనిది ఉన్నట్లుగా చూపే సాక్ష్యం..
ఒడ్డుకు చేరితే
నేల తల్లడిల్లి పోతుందనుకోవడం
ఉన్నది మరొక్కమారు తెలుసుకునే దైన్యం..

మరణానంతరం
కాలి బూడిద అయ్యేది
శరీరమే అనుకోవడం అనాలోచితం ..
ప్రేమ మాయలో పడి
ముక్కలయ్యేది
గుండె మాత్రమె అనుకోవడం అవివేకం...

ఎదురయ్యే ప్రతిదీ
ఆవేదనే మనిషికి
ఎదురేల్లితే మాత్రం ఆత్మీయత కూడా
హృదయంలో అదృశ్యం..
కరగని శిలల మధ్య
కన్నీరు కూడా ఎప్పటికి ఉహా జనితం...

ఆకలి దప్పులంటే
కానేకాదు నేడు అన్నం, పానీయం..
నేడు మనిషిని మనిషే పీల్చి పిప్పిచేసే
మరయంత్రాల దాహం..
బంధాలు లేనితనం..
అనురాగాలు అపహాస్యమయిన దృశ్య రూపం..
కలగలిపితేనే
అచ్చమయిన మనిషి జీవితం..

ప్రేమ
సౌందర్య లిఖితం
పెళ్లి
సౌశీల్య పద గుంభనం.!
వీటికి నిర్ణయించిన
సంవత్సరానికో రోజూ మాత్రం
ఒంటరి నక్షత్రం..

Wednesday, September 7, 2011

ఓటమి జన్మహక్కు - శైలజామిత్ర August 14th, 2011

ఓడిపోవడం జీవితారంభం!
గెలిచి అరవడం చివరి అంకం!
ఓడితేనేగా గెలిచేది!
ఓడితేనేగా జీవితకాలం పెరిగేది!
ఓటమి పుట్టుకలో రావచ్చు
మరణంలో రావచ్చు..
నడుమ జీవితమంతా గెలుపే కావచ్చు!

జన్మనిచ్చిన అమ్మచేతి గంజినీరే
నేటి ఆరోగ్యసూత్రం కావచ్చు!
దాక్కునేందుకు అమ్మ చీరకొంగు,
భద్రతకు నాన్న చేతి వేలు
మనకు మిగిలిన నిజాలు కావచ్చు!
అవి కనుమరుగయినంతమాత్రాన
మనం ఓడిపోయినట్లు కాదు!
మనల్నిమనం తెలుసుకోవడానికి రహదారి కావచ్చు!

మల్లెల సువాసనల్ని మార్చాలనుకోవడం
నిజాన్ని భయపెట్టాలని ప్రయత్నించడం
ఓటమిని జయించే లక్షణాలు కాలేవు.
కాలం కల లాంటిది కాదు
వాస్తవం దాచుకునే వస్తువు కాదు
ఉలిక్కిపడే చర్య భయానిదే కాదు ఆత్మవిమర్శది కావచ్చు
జలజలా రాలే కన్నీటిబొట్లు ఆవేదనే కాదు
నిలువెత్తు పశ్చాత్తాపం కావచ్చు!

ఓటమి ఒకప్పుడు నీవొదిలి వెళ్ళిన నేస్తం కావచ్చు
నినే్న వరించాలని ఎదురుచూసిన నీ ప్రాణం కావచ్చు!
నిజాయితీకి చిరునామా మారిపోదు
సంవత్సరం పేరు మారిందని తేదీల మార్పు ఉండదు!
బతుకు బండిలో కదిలిపోతున్న ఒక్కోరోజు పండగ కాదు
పండుగలన్నీ మనకు ఆనందాల్ని తేలేవు!

ఊహ ఒకప్పుడు ఒక్కరికే పరిమితం
నేడు రెండు జీవితాల దర్పణం!
శరీరం వదిలివెళ్లడమే ఓటమి అనుకుంటే
పుట్టుకే ఓటమి కావచ్చు!
జేజేలు కొట్టడమే గెలుపు అనుకుంటే
వాటికి అలవాటుపడిన నీకు ఓటమే మిగలచ్చు!