Saturday, September 7, 2013

రాత్రి - నిద్ర  

రాత్రికి  తోడుగా నీవు 
నిద్రకు తోడుగా నేను 
లేనప్పుడు  
సమయం సమయానుకూలంగా 
మారిపోతుంది 

బల్ల పరుపుగా 
సుదీర్గంగా ఉన్న రాత్రి 
ఒక్కసారిగా వృత్తం లా చుట్టుకుంటుంది. 
పగటి నుండి వచ్చే రాత్రి పాతదే ! 
ఎక్కి వచ్చే మెట్లు పాతవే 
అయినా ఎప్పటికప్పుడు 
జాగ్రత్తలు తీసుకుంటూ 
నిద్ర సరికొత్తదని నిరూపిస్తుంది.   

రాత్రే కదా 
మెల్లగా పారిపోదాం అనుకునే ఆశను  
కల తన బాహువుల్లో బంధిస్తుంది. 
ఎవరు చూస్తారులే ఇక్కడే ఉండిపోదాం 
అనుకునే చీకటిని 
నిద్ర బయటకు వెళ్ళగొడుతుంది   


రాత్రికి 
ఒక్క పువ్వైనా కాపలా కాస్తుంది  
అనవసర ఆవేదనను , ఆందోళనను 
గది తలుపు అడ్డగిస్తుంది 

తెల్ల వారితే వెళ్ళిపోయే రాత్రి 
మళ్ళీ వస్తుందని తెలుసు 
అయినా  
ముఖం మీది నుండి దుప్పటిని తొలగించి 
పగలతో రగిలిపోయే 'పగలు' ను 
ఆహ్వానించాలంటే 
భూమి ప్రాచీన ప్రేయసిలా 
కన్నీళ్లు పెట్టుకుంటుంది 

రాత్రి 
అలసిపోయిన భూమిని ఓదార్చుతుంది
పగలు 
నీడలను గురించిన అనేక విషయాలపై 
సందేహాలు తీర్చుకుంటుంది. 

4 comments:

  1. చాలా బాగుంది....
    రాత్రి
    అలసిపోయిన భూమిని ఓదార్చుతుంది
    పగలు
    నీడలను గురించిన అనేక విషయాలపై
    సందేహాలు తీర్చుకుంటుంది. # చాల అద్బుతంగా ఉంది..మీ భావన.

    ReplyDelete
  2. mee kavithalu chaala chaala bavunnayi silaja garuu

    ReplyDelete
  3. Thank you . Mee peru enti maree vinthaga undi?

    ReplyDelete