Tuesday, August 21, 2012


జన్మ విస్పోటనం 

గుండెను తవ్వుకుని బైట పడ్డ 
పారదర్శక శైలి వాన చినుకుది!
శరీరాన్ని దాటి ఊడి పడ్డ 
పదాల శక్తి భరించే మనిషిది..

నింగి, నేల గాలి, ధూళి తో పాటుగా 
నేను కూడా కలిసి నలు దిశలా వ్యాపించాను 
వీచే గాలిలానే నాలోని మనిషి తత్వం 
గతానికి. భవిష్యత్ కాలానికీ మధ్య జరిగే 
ఊహల ఉగిసలాటలు ఇంటిని ఆశాంతం మింగేసాయి.

జన్మ విస్పోటనంతో 
జరిగిపోయిన సమయం 
అంతా కావాలని మారం చేసిందో ?
తనదే అయిపోతుందని స్వప్నం వచ్చిందో కాని 
జీవిత కాలాన్ని  ఒక యంత్రంలా మార్చింది.

కళ్ళు, కాళ్ళు, ఒళ్ళు, మెదడు 
స్వార్ధం, అసూయ, అంతర్మధనం,
విడిపోతూ, కలిసిపోతూ
ఆకాశం ఆత్మను ఒంటరిని చేసింది 
తడి ఆరని అవని ఎప్పుడో కన్ను మూసింది.

ప్రేమ అల బతుకు పుటను తాకి 
గాడత ఎరుగని వలస వృత్తాంతం వైపుకు నడిచినా 
గుండ్రంగానే భూమి తిరుగుతోంది.
వరద నీటిలో మునిగిన సముద్రం 
అశాంతిగా దుఃఖ పతాకాన్నిచేత బూని 
మృత కిరణాల మధ్య  మౌనం పాటిస్తూ..
శూన్యపు పొరలను తాకుతోంది 

గుండె కాలిన చోట
మబ్బులు సైతం బూడిదలా కనిపిస్తుంది 
మనిషి పోయిన తర్వాత 
ఆ పాదపు గుర్తులన్నీ పోగు చేస్తే 
కదిలిపోయిన కాలం కనిపిస్తుంది.
హృదయ నదికి జ్వరం వస్తే 
తేరుకునేదాక ఏదీ ఆగదు.
పచ్చని కిరణాలు చేలకు పరిచయమైతే 
వెచ్చని ఊసులు కాపలా కంచెకు చెందుతాయి.

విషయాలతో జీవనం సాగదు.
విషంతో అబద్దం నిజం అవ్వదు.
ఏదో మిషతో నిలువెత్తు తుఫాను ఆగిపోదు 
మనిషి నిలబడితే అది మానవత్వం.
మనసు ఏకాంతమయితే అదే దైవత్వం!

No comments:

Post a Comment