Sunday, October 21, 2012


అక్షరం ధ్వనిస్తుంది 

మాయలో ఉంచిన 
వర్తమాన చరిత్రలో 
నీదో చిత్రమయిన పాత్ర .
చేజారిన మానవ హక్కుల పత్రంపై 
నాదో అవిశ్రాంతమయిన శీర్షిక !
చిరునామా నా వద్ద లేదు 
బహుశా అడుగుల్లో  దాగుందేమో!

ఎవరికెవరు మరో దారి నవలంబించడం 
అలవాటు చేసుకున్నారో 
ఎవరినెవరు నగ్న హృదయంతో 
భిన్న మార్గాలని అనుసరింపజేసారో 
ఒక స్వప్నం నిజం కావడానికి 
చీలికలో నలిగే కంటే గోతిలో పడేదే మిన్న!

తలుపులు మూసిన సాయంత్రపు బతుకుల్లో 
నిప్పు ఆరిపోయినా శక్తికి మెలకువ ఉంది 
ఇది మొండితనం కావచ్చు! అరణ్య సాహసం కావచ్చు 
జీవం ఉంటే చాలు హక్కు ఉన్నట్లే అనుకోవచ్చు 
ఇంత భాద్యత సమర్ధత కోసమే కాని సహనం కోసం కాదు!
ఎందుకంటే 
జరిగే ప్రతి పోరాటం భూమికోసం కంటే 
మనిషి అస్తిత్వం కోసమయింది. 

బరువైన గాయాల్ని మోస్తున్నా 
గుండె వదిలి పోదు 
రేగుతున్న మంటల్ని భరిస్తున్నా
జీవితం వద్దు పొమ్మనదు
వాస్తవం కనిపిస్తుంది చివరిలో 
అక్షరం ధ్వనిస్తుంది నా నాడిలో..

No comments:

Post a Comment