Thursday, October 25, 2012


చౌరస్తా..

అర్థరాత్రి నిశ్శబ్దంలో మునిగిన చౌరస్తా ..
ఉదయం శబ్దంతో నిద్రలేస్తుంది..
ఒక సుందర స్వప్నం చెదిరిపోతే
మరొక ఉహ దాన్ని చెరిపేసినట్లు...

ఇంటిముందు దీపాల వెలుగులో 
కనిపించే ఇల్లాలి ఆలోచనలు
కొత్త అనుభవంతో మేల్కొంటాయి.
అస్తిత్వం రుజువు చేసుకోవాలనుకుని కళ్ళు 
వాస్తవాన్ని నిలుపుకోవాలనుకున్నట్లు..

గాలికి కదిలే అడుగు జాడలు  
ఇసుకలో అంతరంగాన్ని అనుసరించే పల్లవులు 
భవిష్యత్ వ్యవస్థకై పరుగులు తీస్తాయి 
నేలపైని నీడలతో నడిచే స్వప్న శిఖలు 
ప్రకృతి నుదిటిన అదృష్ట సింధువుగా మారాలన్నట్లు.. 

ఉదయం నుండి రాత్రి వరకు హృదయం  
కోలాహల సముద్రంలో ఈదుతున్న ఒంటరి నిశీధి 
కలలు కనే అసంఖ్యాక హస్తాలతో కలిసి 
గుండెలను దాటే నిరంతర నినాదాలతో 
గోడలకు వేళ్ళాడే సంధ్యారుణ మేఘంలా ఉంది 
త్రుప్తి లేని సమాధానం బరువుగా పరుచుకున్నట్లు..

పరుగులెత్తే ఉత్సాహంతో ఒక తరం 
ప్రవహించే కలలతో మరో తరం 
ఎదురయ్యే ప్రశ్నలతో మలి తరం 
ఏదైనా ఏమైనా, ఎవరైనా సరే సముద్రం మధ్య కుర్చుని 
దాహం గురించి చర్చించరు..
నిజమంటే భాధాతప్త ప్రపంచంలో 
ఉలికిపాటు పంక్తులు నిలిచినట్లుంది 
నీడనిచ్చే ఎద ముందు ఆకాశం చిన్నబోయినట్లు..

మనిషిలో మానవత్వంతో పాటు 
మారణహోమం ఉంటుంది 
మనసులో అనురాగంతో పాటు అనల చరణ౦ ఉంటుంది 
పొలం గట్టుపై తలెత్తి ఆకాశాన్ని చూస్తున్న రైతుకు 
కనిపించే జీవితం భవిష్యత్ లో ఎన్ని రూపాలకు ఆయువునిస్తోందో 
అర్థంలేని స్వేచ్ఛను కోరే శిరస్సుపై అక్షరాల ఆయుధాలు 
ఎంతగా  విలయ తాండవం చేస్తున్నాయో 
తెలియక నాలాంటి రూపాల్ని దహిస్తున్నాయి 
ముష్టియుద్ధం కాస్త మిసైల్ ప్రయోగం అయినట్లు..

అయినా 
నక్షత్రాల వెలుగులో కనిపించేదంతా 
ఆకాశం కాదు 
సూర్యకిరణాలు ప్రసరించనంత మాత్రాన 
ఆ చోటు భూమి కాకపోదు.
అర్థరాత్రి ఆకాశం పెళ్ళికి పట్టుచీర కట్టుకున్నట్లు 
పగలు భూమి నవ్వుల వెలుగులు వెదజల్లినట్లు..

No comments:

Post a Comment