Friday, October 26, 2012


ఉరి
మనసు మడిస్నానం చేసి చేసి జోకొడుతోంది
నిద్ర చుట్టి చుట్టి వేకువను మేల్కొలుపుతోంది
నిశ్శబ్దపు నిశిలో చిక్కుకున్న పక్షి తన
కిల కిలా రావాలతో సృష్టికి సంకేతాల్ని అందిస్తోంది
వెలుగుకు చీకటికి మధ్య ఉన్న సన్నని తెర
కాలంతో పాటు కన్నెసొగసులను కాపలా కాస్తోంది
ఆకాశం మాసినట్లు చేస్తున్న కాలుష్య భూతం
మూడో కంటికి తెలియకుండా అధికారంతో శుభ్రం చేస్తోంది
ఎపుడో వేయాలనుకునే రోడ్డుకు ముందుగానే
దారికడ్డంగా పోసిన కంకర నడిచే కాళ్ళను రక్తంతో నిలదీస్తోంది
దేవుడే దిక్కని గుడిముందు అడుక్కుంటున్న ముష్టివాడి జీవితం
నాగరికత నడుమ కొత్త నోట్లలా కళకళలాడుతోంది
తప్పతాగి తూలుతూ అర్థరాత్రి ఇంటికొచ్చిన భర్త అక్రుత్యాల్ని
తెల్లవారకుండానే తులసికోటలో కన్నీటి దీపం వెలిగిస్తూ
ఆనవాలు దొరకకుండా భార్య కడిగేస్తోంది..
హైటెక్ సింధురాన్ని నుదుట దిద్దుకుని నగరం
మృత్యుమాతను పిలిచి అత్యాధునికంగా అలంకరిస్తోంది
అందమైన అనురాగాన్ని వికృతమైన ఆనందాన్ని పంచుతూ
తాత్కాలిక సుఖాన్ని వెదికే గుండె అశ్రువుల్ని నింపుకుంటోంది
కదలలేని కాలాన్ని సాగదీసి కృత్రిమమైన క్షణాల్ని సృష్టించి
గారడీల మధ్య నివసించే ప్రాణాలు ఉపిరి లేకుండానే సేదదీరుతోంది
బతుకు భారాన్ని మోయలేక మోయలేక
నడిరోడ్డు కూడలిలో నిలబడి ఉండగానే
మనసును ఒక ఒడంబడిగా చేసుకుని
చెదిరిన స్వప్నపు సంచుల్ని సరిచేసుకుంటూ
తెల్లని కాన్వాసుపై కనబడేలా నల్లని చిత్రాన్ని గీస్తూ
కనబడని దారానికి ఉరి పోసుకుని
తెలియని ద్వారాల వెంట జీవం వెళ్ళిపోతుంది..!!

No comments:

Post a Comment