Sunday, November 16, 2014

కానుక..! 

ఆకాశమంతా ప్రయాణించి ప్రయాణించి 
కళ్ళ ముందు చిత్తరువవుతుంది భూమి !

ఎంత ఎండ కాసినా 
ఎంతగా కన్నీరు కురిసినా 
పచ్చదనం కోసమే భూమి నివాసం 

నాకేదో కావాలని 
నువ్వేదో అనుకుంటావని 
దారి మరల్చి పోవడానికి 
ఇదేమి దాచి పెట్టుకునే వస్తువు కాదు 
పక్షి నోట కరుచుకున్న పురుగు కాదు 
జనన మరణాల తో సంభాషణ జరిపే అవని !

మరి నిద్రను వదిలి 
మంచుతెరల మధ్య ఆకాశాన్ని గమనిస్తావా ?
ఆశయ సౌధాల నుండి 
అత్యాశా యుగాలను అంటిపెట్టుకుని 
భూమిని ప్రవాహ దిశ వైపుగా కొట్టుకు పొమ్మంటావా ?

దట్టమైన చీకట్లు  కమ్ముకున్న వేళ 
వెలుగును గ్రహించలేని హృదయాలు 
ఎక్కడ ఖాళీ ఉందొ గుర్తించలేరు 
వెన్నెల రాత్రి భాష ను గమనించలేక 
రసాయనిక చర్యల తాలుకు సంభాషణ కొనసాగిస్తారు 

ఆకలికి అర్థం అక్కరలేదు 
ఆవేశానికి సందర్భంతో పనిలేదు! 
మట్టిని మోస్తూ వెళుతున్న 
చిరుగుల భూమికి మాత్రం 
పునరావాస చిగుళ్ళు కావాలి ! 
ఆకుపచ్చని స్పర్శ కానుకగా ఇవ్వాలి !
  

No comments:

Post a Comment