Saturday, October 20, 2012

గతం మెలకువగానే ఉంది


గడచిన గతుకుల రోడ్లమీద 
శయనించిన నా తనువు 
ఇంకా సేదతీరనే లేదు
అణువణువునా ఆవేదన
నిలదీసిన నిరాదరణల మధ్య 
చేసిన గుండె వేగం 
ఇంకా ఆగనే లేదు 
ఆవేశం, అనాలోచిత చర్యల మధ్య 
పోరాడి సాధించిన ఓటమి తాలుకు 
ఆనవాళ్ళకు చిహ్నంగా 
తడిసిన రెప్పల్ని తుడిచిన చేతి రుమాలు 
ఇంకా తడారనే లేదు 
సమ సమాజ సమూహం ఎలుగెత్తి 
పాడిన అపనిందల గీతాలు 
నా వీనులను ఇంకా వదలనే లేదు 
భారంగా గడిచిన రోజులు 
భయంగా నడిచిన క్షణాలు 
సందిగ్ధం లో సర్దుకున్న 
తలపుల క్రీనీడల్ని
అనుసరించిన నిరాశ, నిస్పృహల 
నిగ్గు తేలనే లేదు 
రక్తంతో తడిసిన 'పగ' లు 
సగం కాలిన రాత్రుల ఛాయలు
నన్ను ఇంకా వీడనే లేదు 
గత వర్షపు నిర్వీర్యమయిన ముఖం 
నా ఒడిలో నిదురిస్తున్న ఆ బంధం 
నా తలపై వేసిన ఆ చేతి వెచ్చదనం 
బరువైన శ్వాసతో 
అదిరే చుబుకంతో 
వదలలేక వదలలేక వదిలి 
అశక్తతను తన మంద్ర స్వరంతో 
పూర్తిగా వ్యక్త పరిచిందో లేదో
అపుడే మాయ క్యాలండర్ తేదీల తుంపర్లు 
కాలం కంపల్ని దాటుకుంటూ 
ఒకవైపు చలి, మరోవైపు ఆకలి ఆలోచనలతో 
లేమితనపు లిపిని గుర్తించేలోగా
కొలమానం లేని "వెర్రి" సాయంతో 
కళ్ళముందుకు వచ్చింది 
మనసున్న ఆపిల్ మాంత్రికుల నుండి 
మనిషి తత్వమే లేని నియంతృత్వం వరకు 
ఎందరో ఆత్మీయుల్ని ఆవేదనల్ని పోగొట్టుకుని 
వెక్కిళ్ళ మధ్య 
ఇంకా మెలకువగానే ఉంది గతం!
అంతస్తుల ఆభరణాల్ని ధరించినా 
నల్లని పరదాల చాటున దాగిఉండి
కళ్ళు తెరిచే ఉంది గతం!

అందుకే ..
భుకంపాలతో మేను ముడుచుకున్నప్పటినుండి 
బాంబుల శబ్దంతో కళ్ళు ముసుకున్నంత వరకు 
జ్ఞాపకాల ప్రాతిపదికపై 
భవిష్యత్ తెరిచి ఉంచిన గ్రంధంలా కనిపిస్తోంది 
స్పందించలేని సుగంధ రహిత సుమాలను ధరించి 
వర్తమాన వాకిళ్ళకు కాపలా కాస్తూ 
పైరవీల సరిగంచుల్ని కళ్ళకద్దుకోవడానికి
మంచు ప్రమిదల్లో
ఆశల దీపాల్ని మళ్లీ మళ్లీ వెలిగిస్తోంది!
మానవ జీవితం మరో అంకెల అంకంతో 
చమక్కుల చుక్కలతో 
మొగ్గుల ముగ్గుల్ని వేస్తూనే ఉంది !

జరిగిన విషయం విషాదమయినా 
వదిలి వెళ్లేందుకు విల విల లాడుతుంది 
జరిగిపోయేది ప్రళయ మయినా 
నిజమయినా , అబద్దమయినా 
అంగీకరించేందుకు అలసత్వం అడ్డొస్తోంది!
ప్రపంచం తల్లక్రిందులయినా
ఒక నర్గీస్, ఒక లైలా, ఒక తానే ల కంటే 
ముంచేసే మజ్ను ఎదురయినా 
నిమ్మకు నీరేత్తనట్లున్న నైజం 
మన నైసర్గిక స్వరుపాలకు ఒక నిదర్శనం!
పరికించి చూస్తే.. 
పరివర్తన ఒక్కటే ప్రపంచ నియమం!
అదే యుగాంతం!

No comments:

Post a Comment