Wednesday, October 17, 2012


ఎడారి కళ్ళు // శైలజామిత్ర 

ఊరు పేరు లేని కాలం గోడల మధ్య ఖైది మనిషి
కడుపు నిండని ఖర్మ సిద్దాంతాల మధ్య బంధీ మనసు 
జీవితం ఒక బిక్షపాత్ర 
అందులో పడేవి ముత్యాలైనా, మట్టిగడ్డలైనా 
ఎడారి కళ్ళతో ఏరుకుని దాచుకోవాల్సిందే..!!

ఇంత వెలుగు కావాలి.. కొంత చీకటి కావాలి 
కాస్తంత నీరు కావాలి.. మరి కాస్తంత గాలి కావాలి 
చిరునవ్వు రావాలంటే నోటు కావాలి 
హృదయం ఒక ఉహా చిత్రం, అందంగా ఉన్న, లేకున్నా 
సాంఘిక శక్తులతో కలిసి సర్డుకోవాల్సిందే...

ఆకలి యానంలో ఆరాటం ఉండచ్చు.. ఆవేశం ఉండచ్చు 
శిలా నక్షత్రంలా ఉండచ్చు.. మేఘంలా ఉండచ్చు 
నీలి రాక్షసుడు రావచ్చు.. నిరంకుశత్వం ఏలచ్చు 
ఆయువు అరచేతిలో తాయిలం.. ఆ క్షణంలో ఉన్నా, వదిలి వెళ్ళిపోయినా 
ఆయుధాల శబ్దాలతో సంభాషించాల్సిందే...

సముద్రంలో పలకలు కదిలినా.. అరణ్యం ఆసాంతం అంటుకున్నా 
ఆకాశం అందుబాటులో ఉన్నా, అవని అలిగి కూర్చున్నా 
పొదలోనో, చెట్టు పైనో  పొంచిఉన్న వేటగాడు 
గురిచూసి విరగకొట్టే పాపాల కుండ.. ముక్కలైనా, ముచ్చటగా ఉన్నా 
వాస్తవ చేతనలో విరగబడి నవ్వాల్సిందే...

మనసే కాదు.. శరీరము కూడా ఒక ప్రశ్నే 
అవనేకాదు, ఆకాశము కూడా ఒక ప్రశ్నే 
ఆయుధాలతో స్వార్థ శక్తుల జైత్ర యాత్ర ఒక ప్రశ్నే..
ఆకుపచ్చని తోటలో స్తంభాలై నిలబడిన వీరులూ 
బాధలతో బీటలువారిన సమాజం 
అనేక ముఖాల్ని మోస్తున్న చరిత్ర పిడికిట్లో సంకల్పం 
పాతవైనా.. సరికోత్హవైనా 
ప్రశ్నల పరంపరలో కొనసాగాల్సిందే...-

2 comments:

  1. మంచి కవితలు చదువుతున్న అనందం.
    అన్ని చదువుతా ,జీర్ణించుకుంటో చదవాలి.
    సమయం కావాలి.

    ReplyDelete