Saturday, March 9, 2013

మనసు సూత్రం!

శైలజామిత్ర // 9-02-2013 (6 pm)

గదిలో కలర్ టివి చేరింది 
గది పాతదే!
గుండెలో సరికొత్త ఆశ మొదలయ్యింది 
శరీరం పాతదే! 
కూడలిలో బాంబు పేలింది 
రక్తం పాతదే! 

ఈ పాత కొత్త ల చుట్టూ చెదిరిపడిన 
ఆశల శిధిలాలు కొన ఉపిరితో కొట్టుకుంటూ 
సరికొత్తగా ఉండటం విశేషం 
రమారమి అందరు సజీవ సమాధులే 
సందేహం లేదు 
అలాగని వారిని ఉదయం నుండి చూడలేదు 

అనుకరించే విజ్ఞానానికి తోచకుండా 
ఎదగలేని మన:శిఖరాలకు అందకుండా 
నేరం ప్రకృతి మాతపైకి నెట్టేసి 
చేతులు చాచి నిలుచున్న మృత్యువు రెక్కలతో 
భవిష్యత్ తన ముఖాన్ని వద్దన్నా చూపుతుంది 
అది భూ విపత్కరమైనా 
జల తాండవమైనా
మనో వికారాలైనా  నలిగిపోయేది 
దిగువ రేఖా చిత్రాలే!

శిఖరాలను కూల్చేసి గాయం లేదు కదా అంటారు 
పీటభూముల్ని పేల్చేసి బతుకులు క్షేమం కదా అంటారు 
దుష్ప్రభావం అనేది రుచి కరమైన పదార్ధం 
దుర్మార్గం అనేది అసహనపు గడియారం 
తెల్లవారితే పొలానికి నీళ్ళు కావాలి 
పెద్దేక్కితే ఇంట్లో పిల్లల ఆకలి తీర్చాలి 
నేడు నదులన్నీ ఆకాశంలో అమృతాలు 
ఉట్టిపై దాచి ఉంచే ఆహారం నేడు శూన్యంలో 
వేళ్ళాడే బేల ముఖ చిత్రాలు !

అలాగని ఎలక్షన్లు ఆగవు 
ఊపిరి లేని ఓట్లు పడక పోవు 
ప్రయాణాలు ఆగవు 
ప్రవాహాలు నిలిచిపోవు 
ప్రభాతం వెనక్కు పోదు 
హింస! విధ్వంసం ! 
ప్రకంపనలు మనో వికారాలు 
ఏవీ ఆగవు ,, 

మనిషి ఒక తరగని సంకల్పం!
మానవతా రసధుని సుస్వరం ఆవాసం !
ఇప్పుడు మెలకువగానే ఉంటోంది గతం!
వర్తమానం ఎంత త్వరగా 
గతమవుతుందా అనేదే మనసు సూత్రం!







No comments:

Post a Comment