Saturday, September 7, 2013

పరిధి // శైలజామిత్ర  

కనిపించని కళ్ళతో సూటిగా చూస్తూ 
అనేక సంవత్సరాలుగా జీవిస్తున్న నేను నాకు బాగా గుర్తు 
వీధి చివర , ఆరు బయట 
చిగుర్లు చిట్లినట్లు రేగినట్లు .. చెట్లు తెగిపడినట్లు 

ఇంట్లో మారుమూల గదికేసి చూస్తూ 
నిస్తేజంగా చప్పుడు చేస్తున్న నా హృదయం ఇంకా గుర్తు 
శరీరం వెనుక   .. మనసుకు ఎదుట 
ఎదిగిన పంట ఎండినట్లు .. పండిన కాయ పూసినట్లు 

పెలుసుబారిన కిటికీ ఊచల కేసి గమనిస్తూ 
నా కనుబొమలు ముడిపడిన దృశ్యం ఇంకా గుర్తు 
భావోద్రేకం అంచున .. ఉపద్రవం రూపాన 
కొండలన్నీ కదిలి వెళ్లి పోతున్నట్లు .. పరకలన్నీ  స్థిరమైనట్లు

ముఖాముఖి హస్తగతమైన తీరు అంచనా వేస్తూ 
నా హృదయం చిరునవ్వులు చిందించిన చాయలు ఎంతో గుర్తు
ఒలికిన సముద్రాన .. ఎత్తుకున్న అత్తిచెట్టు అందాన  
కంచె ఇంటికి వేసినట్లు .. కావలి కాళ్ళకు పడినట్లు 

ఎదుగుదల మెరుపులా  మారిన దిశను పరిశీలిస్తూ 
గొంతెత్తి ఎదురుతిరిగిన క్షణాన నేనో తల్లినైన గుర్తు 
తేలికైన గుండె తీరాన .. కన్నీటి కళ్ళ చివరన 
జీవితం జీవితమైనట్లు .. ప్రేమ వేరింటి కాపురం పెట్టినట్లు ..  

No comments:

Post a Comment