Wednesday, July 17, 2013

మా ఊరి చిత్రం

నా భుజంపై తల వాల్చి 
నా గుండెపై చిన్ని పాదాలు మోపి 
చిట్టి మోకాళ్ళు నన్నల్లుకుని 
నన్ను అనుకుని ఉండేది 
మా ఊరి చిత్రం 

ఏమైందో ఏమో
మసకబారిన ముఖంతో 
మోయలేని భారాన్ని మోస్తున్నట్లు 
మనసు ఉయ్యాల లోంచి 
కిందకు జారిపోయింది
నిండైన దృశ్యం చెదిరిపోయింది 

ఉల్లాసంతో ఎగిరి పడే చేప 
వెల్లకిలా పడినట్లుంది ఆ రూపం 
కలల కొలనులో 
మహారాణి లా  ఉండే చందమామ 
నాతో పాటు తుళ్ళిపడే వాన నేస్తం 
చిన్ని పాపలను ఓలలాడించే 
రెండెడ్ల బండి మువ్వల సవ్వడి 
వయస్సు ఉడిగినట్లు గా మారి 
నన్ను చూసి బోసి నవ్వునవ్వాయి 

సూర్యకిరణం మీది నుంచి దూకే 
కుందేటి వెచ్చదనాన్ని తోడు తెచ్చుకుని 
మూడో కాలు ఆసరాగా నడుస్తుంటే 
నువ్వూ  అంతేగా పిల్లా 
అంటూ ఊరు నవ్వుతోంది 

పైర గాలిలో తుమ్మెదల్లా సాగిపోతున్న 
రంగురంగుల ఉహలు 
ముసిరిన మబ్బులయితే 
వాస్తవాలు  ఉండుండి మెరిసే  
మెరుపులవుతాయి 
నీలాకాశంలో వెండి పడవ 
రెండు విశ్వాస తీర్మానాల మధ్య 
నిలుచున్న నా ఉపిరిలా ఉంది ..
అల్లిబిల్లిగా సాగే నీరెండ ముఖాల మధ్య 
అలికిడి నా ధరహాసంలా ఉంది.. 

No comments:

Post a Comment