Wednesday, July 17, 2013

తడిచి ముద్దవుతున్న కాలం// శైలజామిత్ర 

సంఘర్షణల వర్షానికి 
కాలం తడిసి ముద్దవుతోంది .  
రాత్రి బల్లపై ఒంటరి దీపం 
స్వప్నమై వెలిగిపోతోంది 
మంచు దువ్విన బంతి పువ్వు 
చిరునవ్వులు ఒలకపోస్తోంది 

శున్యపు కోటపై 
భయం కావలి కాస్తోంది 
బంగారు పళ్ళెరం లో 
ప్రకృతి ఉదయ బింబాన్ని 
మోసుకొస్తోంది 
జీవితపు చీకటికి 
సూర్యకాంతికి ఏమాత్రం సంబంధం ఉండదు 
ప్రయాణం లో విషాదాన్ని మరిచేందుకు 
మన అడుగులు మరొకరిపై 
నెట్టేస్తాం అంతే ! 

ఇక్కడ ముళ్ళు 
ఒంటికి గుచ్చుకుంది 
గుండెకు కాదు 
రక్తం మాత్రం గుండెలోంచి వస్తోంది 
ఆశ్చర్యం!
గిర గిర తిరిగే బావి గిలక 
నగరాలపై పడి 
చరిత్ర పుష్పించే మానవ రూపమై 
కృపాణ మతితో అలరిస్తోంది 

ఒకరికి శక్తి కావాలి 
మరొకరికి యుక్తి,కుయుక్తి కావాలి 
కొండల్లో లోయల్ని దాచేసే చీకట్లో 
వీధి దీపపు స్నేహం కావాలి 
కనిపించే పాలభాగం పై 
పుష్ప రాగం కనిపించాలి 
ఒక్కొక్క రోజు ఒక్కో కోరిక చేతుల్ని బంధిస్తే 
పతాక శీర్షికలో 
సమాజపు కొత్త శిల దర్శనమిస్తుంది 
మనిషి రాక్షసుడైనా 
మహానీయుడైనా 
చేతలలో మార్పే తప్ప 
చేతులు రెండే !
స్పర్శలో , స్పందనలో 
మస్తిష్క మనోజ్ఞ శాల ఒకటే ! 

సమయాన్ని అనుసరించి 
హృదయంపై నిప్పుల కుంపటో 
మబ్బుల పందిరో వెలుస్తుంది 
మనసును బట్టి 
పూల గుత్తో లేక ముళ్ళ కంపో ఎదురవుతుంది 
మనో ముఖంపై ఒకవైపు సంతోషం 
మరోవైపు ఆవేదన కలుగుతుంటుంది 
వెలుగు ముగ్గులపై  కన్నీరు 
నీడ ముద్రల దృశ్యాలు కలగలిపి 
జీవితానికి మౌలిక రహస్యమై మిగిలిపోతుంది 

రైలు కదిలింది 
ఆ మూర్తి రూపం మళ్ళీ ఆలోచనలో పడింది  





No comments:

Post a Comment