Monday, October 29, 2012

తెరచి ఉంచిన సమాజ పుస్తకం 

మనదేశపు రెక్కలు తెగిపడుతున్నాయి 
కట్టుపడిఉన్న నీతికి వలువలు జారిపోతున్నాయి 
నిజాయితి నీడలకు భయపడే రోజులు పారిపోతున్నాయి 
తప్పులను వేలెత్తి చూపే వీధి దీపాలు ఆరిపోతున్నాయి 

ఇపుడు మన కళ్ళల్లో ఉన్నవి కాంతులు కావు 
తేలిపోయే కక్షలు, కార్పణ్యాలు మాత్రమే 
మనకు కావాల్సింది పందిరి నీడో, ఆశ్రమమో కాదు 
చెట్టు చేమా లేని ఎడారి చైతన్య నివాసం...

కిందపడినా, ఘోరంగా ఓడిపోయినా 
విజయంతో విర్రవీగుతున్నా, కీర్తి కిరీటాలు మోస్తున్నా 
మనం అస్తిత్వం కోల్పోయిన వ్యక్తిత్వాలను మోస్తున్న 
శక్తులము మాత్రమే..!!

అనుమానం మాటున దాగున్న పెనుభూతం నేడు మనిషి
శూన్యంలో విల విల లాడుతూ కాలుతున్న కోరిక మనసు 
యుగ యుగాల శబ్దాన్ని క్షితిజంతో విసిరివేయబడ్డ బావిష్యత్హు మనది 
హృదయ పాత్రలో కనిపించే నారీబింబ పారదర్శకత కాలానిది 

అరె..
పుట్టింది మొదలు గిట్టేంతదాకా నిరాశ అంచుల్లోనేనా జీవితం
పురిటిలోనే పునర్జన్మనేత్హే సందిగ్ధంలోనేనా ఆదర్శం..
ముందున్నాయని చేతులనే గౌరవించే నీకేం తెలుసు భవితవ్యం...?
పళ్ళ పదునుతో మాటల తూటాలు సంధించేదేనా ఉపమానం  ?

నిత్యం మండుతున్న గుండెతోనే నీ ప్రయాణమైతే 
ప్రశాంతతకు నివాసమేది ?
అనునిత్యం నీ ఇంటి మేకుకు సంతోషం వేల్లాడుతుంటే 
మనుగడకు ఆస్కారమేది?

మొండివారిన ఆశయాలతో ముందుకు నడిచేందుకు 
విరిగిపోయిన ఆశల రెక్కలతో ఎగిరేందుకు 
ముసపోసినట్లున్న సమాజంలో గెలిచేందుకు 
నువ్వేమి గోడ గడియారం కావుకదా?

మనిషిగా పుట్టి మనిషిగా పెరుగుతూ 
మనిషంటేనే మనసు రాకుంటే నీకు నీవే ఒక భాహిష్క్రుతి
చరిత్రలో ఇంకా ఎన్ని పేజీలకు చెదలు పట్టనుందో 
ఎన్ని తరాలు శిలా ప్రాకారాల మధ్య విధించబడి ఉందో
తెలియని నువ్వు నిర్జన ప్రదేశాలలో ఒంటరైన భారతీయ శిక్షాస్మృతి ...!

ప్రపంచానికి మనిషి మూలం కావచ్చు 
జీవన ప్రమాణానికి రెండు చక్రాలు అవసరం రావచ్చు 
పాతగాయాలు ఇంకా మానకముందే కొత్త గాయాలు తగలచ్చు 
అరచి అరచి అలసిపోయి ధూళి గమ్మిన శరీరంతో ఉపిరితీస్తూ 
ఆకలి కేకలతో కదులుతూ రాతి బొమ్మల్లా నిలిచిపోవచ్చు 
ఇక ఇలానే సాగితే 
ఉప్పు సముద్రంలో చేపల్లా మనం 
తెరచిఉంచిన సమాజ పుస్తకంలో తప్పుల్లా మన జీవితం 
ఉదయం వాకిలిలో అరవలేని పక్షుల్లా మూలన పడి ఉండక తప్పదేమో...!!

No comments:

Post a Comment