Saturday, November 3, 2012

ఎవరు నేస్తం నీవు?



ఉపిరి తీసిన చోటే 
ఉహల పల్లకి మోస్తుంటే 
వాస్తవం విడివడి మినుకు మినుకుమనే తారలా  
ఎవరు  నేస్త౦ నువ్వు? 
సంధ్యా సమయానికి వేళ్ళాడుతున్న 
బంగారు వర్ణ౦తో వెలసిన ఉదయపు వాకిలివా? 

అంతులేని అవిశ్రాంతమయిన 
అవనిపై వాలిన ధరహాసనివా?
కడలి తన నీడను తానే చూసుకుంటున్న క్షణంలో 
ఉప్పొంగిన ఆనందపు అలల అంతరంగానివా?
నిద్ర తన ప్రగాఢ పరిష్వంగంలో మరచిపోయిన 
కలల కుంచెతో దిద్దిన నిట్టుర్పు మంచుశిలవా?

వేకువతో అనుక్షణం కబుర్లాడుతూ 
గుండె కవాటాలను  తడుముకుంటున్న నిముషంలో  
గగనమంత హృదయంలో దాచుకున్న రుగ్ధ వర్ణానివా?
తెలి మబ్బుల చారల వలయంలో 
మెరుస్తున్న ఆర్ద్రపు అంకెల వెన్నెలలో మెరుస్తున్న  
అందెల ఆకాశ౦లొ నక్షత్రాల జరీ అంచువా? 

చినుకు చినుకు కలిసి చిరునవ్వును తడిపినట్లు
ఆకు ఆకు కలిసి కొమ్మల కాంతలపై  
అత్తరు సుతారంగా అద్దినట్లున్న ఉషోదయంలో 
నులి వెచ్చని తొలి వేసవివా? 
నీరెండిన నిశిలో నువ్వు నేను శశి తో కలిసి నడుస్తుంటే 
గదిలోని సగం కాలిన అగరవత్తుల కొనలు అలిగి ఆవిరవుతుంటే 
అంధకారపు అరమోడ్పు కనులను మూసిన  ధవళ వస్త్రానివా?

నింగి ఒక సంపంగి రేకు 
నేల ఒక పూబంతి సోకు 
నడుమ నడిచే ప్రకృతి ఒక అందమయిన తామరాకు 
నలిగిన నాలుగు గోడలమధ్య 
నలు దిక్కుల్ని చూసుకునే గడియారానికి
కాంతి కిరణాల్ని చూపుతున్నవెలుగుల విభుదివా? 
ఎవరు నేస్తం నీవు ?
నిరాశను కదిలించిన శుబాభినవ ప్రభాతానివా?  
సృష్టిలోని సర్వస్వాన్ని సుమధుర సంగీతంలా 
మౌనంగా భరించే మలయ మారుతపు చిహ్నానివా?

No comments:

Post a Comment