Tuesday, August 21, 2012

తెల్లని ఆకాశం 

గుండె ఆవిర్లు 
చల్లరుతున్నాయి.
మరో మారు పంచడానికి కాదు 
నన్ను నేను ఒదార్చుకోవడానికి..

సజీవ మనో స్పర్శకు 
అనుభవాల మొన తగులుతుంది 
జ్ఞాపకాల ఫలితానికి 
మనసు పత్ర హరితాన్ని పోగొట్టుకుంటుంది 

తలుపు గొళ్ళెం పడినా 
రెప్ప పడని ఎదురు చూపులు
తడిని కోల్పోయిన కళ తప్పిపోయిన  
మమతల మడత మజిలీ 

ఎన్ని అవమానాలో ఈ జీవితానికి 
దిక్కులే మనిషికి చుక్కలు 
నిద్ర లేమికి ఓదార్పు ఇంటి చూరున 
వేళ్ళాడే సాలె గూడే!

ప్రవాసాల ప్రకంపనల మధ్య 
నిలబెట్టి గుట్టు చెప్పాలని 
ఒకరినైనా నమ్మించి తరించాలని 
ఒంటరి సెగలో కాలిపొతూ...

తెల్లని ఆకాశంపై 
నల్లని సంతకం 
రాసి పారేసిన గతం !
నేడు క్యాటరాక్ట్ పొరల మధ్య 
మసకబారిన ఆత్మీయ స్వరం !

No comments:

Post a Comment