Wednesday, September 7, 2011

ఓటమి జన్మహక్కు - శైలజామిత్ర August 14th, 2011

ఓడిపోవడం జీవితారంభం!
గెలిచి అరవడం చివరి అంకం!
ఓడితేనేగా గెలిచేది!
ఓడితేనేగా జీవితకాలం పెరిగేది!
ఓటమి పుట్టుకలో రావచ్చు
మరణంలో రావచ్చు..
నడుమ జీవితమంతా గెలుపే కావచ్చు!

జన్మనిచ్చిన అమ్మచేతి గంజినీరే
నేటి ఆరోగ్యసూత్రం కావచ్చు!
దాక్కునేందుకు అమ్మ చీరకొంగు,
భద్రతకు నాన్న చేతి వేలు
మనకు మిగిలిన నిజాలు కావచ్చు!
అవి కనుమరుగయినంతమాత్రాన
మనం ఓడిపోయినట్లు కాదు!
మనల్నిమనం తెలుసుకోవడానికి రహదారి కావచ్చు!

మల్లెల సువాసనల్ని మార్చాలనుకోవడం
నిజాన్ని భయపెట్టాలని ప్రయత్నించడం
ఓటమిని జయించే లక్షణాలు కాలేవు.
కాలం కల లాంటిది కాదు
వాస్తవం దాచుకునే వస్తువు కాదు
ఉలిక్కిపడే చర్య భయానిదే కాదు ఆత్మవిమర్శది కావచ్చు
జలజలా రాలే కన్నీటిబొట్లు ఆవేదనే కాదు
నిలువెత్తు పశ్చాత్తాపం కావచ్చు!

ఓటమి ఒకప్పుడు నీవొదిలి వెళ్ళిన నేస్తం కావచ్చు
నినే్న వరించాలని ఎదురుచూసిన నీ ప్రాణం కావచ్చు!
నిజాయితీకి చిరునామా మారిపోదు
సంవత్సరం పేరు మారిందని తేదీల మార్పు ఉండదు!
బతుకు బండిలో కదిలిపోతున్న ఒక్కోరోజు పండగ కాదు
పండుగలన్నీ మనకు ఆనందాల్ని తేలేవు!

ఊహ ఒకప్పుడు ఒక్కరికే పరిమితం
నేడు రెండు జీవితాల దర్పణం!
శరీరం వదిలివెళ్లడమే ఓటమి అనుకుంటే
పుట్టుకే ఓటమి కావచ్చు!
జేజేలు కొట్టడమే గెలుపు అనుకుంటే
వాటికి అలవాటుపడిన నీకు ఓటమే మిగలచ్చు!

No comments:

Post a Comment