Thursday, September 8, 2011

ఒంటరి నక్షత్రం

ఓడిపోవడమే
ప్రేమ లక్ష్యం..
గెలిచాను అనుకోవడమే
మనసు లక్షణం..!
గెలిచామో.. ఓడామో
తెలియని ప్రతి క్షణం ఒక సందిగ్ధం..!

నీట మునిగితే
నీరెండిపోతాయనుకోవడం
లేనిది ఉన్నట్లుగా చూపే సాక్ష్యం..
ఒడ్డుకు చేరితే
నేల తల్లడిల్లి పోతుందనుకోవడం
ఉన్నది మరొక్కమారు తెలుసుకునే దైన్యం..

మరణానంతరం
కాలి బూడిద అయ్యేది
శరీరమే అనుకోవడం అనాలోచితం ..
ప్రేమ మాయలో పడి
ముక్కలయ్యేది
గుండె మాత్రమె అనుకోవడం అవివేకం...

ఎదురయ్యే ప్రతిదీ
ఆవేదనే మనిషికి
ఎదురేల్లితే మాత్రం ఆత్మీయత కూడా
హృదయంలో అదృశ్యం..
కరగని శిలల మధ్య
కన్నీరు కూడా ఎప్పటికి ఉహా జనితం...

ఆకలి దప్పులంటే
కానేకాదు నేడు అన్నం, పానీయం..
నేడు మనిషిని మనిషే పీల్చి పిప్పిచేసే
మరయంత్రాల దాహం..
బంధాలు లేనితనం..
అనురాగాలు అపహాస్యమయిన దృశ్య రూపం..
కలగలిపితేనే
అచ్చమయిన మనిషి జీవితం..

ప్రేమ
సౌందర్య లిఖితం
పెళ్లి
సౌశీల్య పద గుంభనం.!
వీటికి నిర్ణయించిన
సంవత్సరానికో రోజూ మాత్రం
ఒంటరి నక్షత్రం..

No comments:

Post a Comment