Thursday, April 11, 2013

కాలపు గాలం// శైలజామిత్ర



సదస్యులు లేకుండా ఆడే నాటకం వలె 
రాజాదరణ కై తారాట్లాడే కవి రత్నం వలె 
ఉదయం మెల్లగా వచ్చింది.. 
చీకటి ఎడారి జీవితానికి కనిపించే ఈ వెలుగు 
ఒక వోయాసిస్ అని 
కళ్ళు కప్పి వేచి చూస్తేగా తెలిసేది మనిషికి 

నేడు అంతా క్షణం తీరిక లేని యంత్రాలే!
గుండె ను డాక్టర్ కు అప్పగించి 
బుద్దిని మరెక్కడో తాకట్టు పెట్టి 
నీటిపైనో , నేల మీదో 
నిందను అనుభవిస్తూనో 
అపనింద వేస్తునో కదిలిపోయే మనుషులు !
చాప చుట్టల బతుకులు ... 
భూమ్యాకాశాల మధ్య ఎవరికీ ఏమి కాని అతుకులు ! 

ఎక్కడైనా గడియారమే కాలమానం ! 
బతుకు తెరువు, తీరంలో బరువు 
రవి ఆగమనానికి కనిపించే ఉషస్సులు ! 
అయినా ఒక్క క్షణం నిశ్శబ్దంలో శబ్దంతో పలకరించి 
నేనెవరో నీవు చెప్పేదాకా తెలియదు 
నిజంగా నీవనుకునే నేనే నీ రూపమని! 
కాలాన్ని నియమించలేని దేవుడు 
మనిషి గాలానికి చిక్కిన నా రూపమని ! 

No comments:

Post a Comment